జనవరి 27న శశికళ విడుదల.. పార్టీలోకి రానివ్వమన్న పళనిస్వామి
''శశికళను ఏఐడీఎంకే పార్టీలోకి చేర్చుకునే ఛాన్సే లేదు.. ఆమె ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీలో లేరు..'' తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నోటెమ్మట వచ్చిన నిఖార్సైన మాట ఇది. అక్రమాస్తుల కేసులో శిక్షపడి నాలుగేళ్లపాటు కర్నాటకలోని బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో గడిపిన అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వికె శశికళ ఈ జనవరి 27న విడుదల కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా అన్నాడీఎంకే రాజకీయాల్లో అన్నీ తానై వెలిగిన శశికళ జయలలిత మరణానంతరం పన్నీర్‌సెల్వం పెట్టిన చిచ్చును కూడా తట్టుకుని నమ్మినబంటు పళనిస్వామిని తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రతిష్టాపించి ఇకపై కూడా తనకు తిరుగులేదనుకున్నారు.
కానీ ఆమెకు శిక్ష పడి జైలు కెళ్లాకు అనంతర పరిణామాల్లో అన్నాడీఎంకేలో బలమైన వర్గాలుగా ఉన్న ఫళనిస్వామి, పన్నీర్‌సెల్వం కేంద్రప్రభుత్వ ఆశీర్వాదంతో ఒక్కటై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుకుని అధికారం నిలుపుకున్నారు. ఆ తర్వాత శశికళపై ఎడపాడి, పన్నీర్‌సెల్వం నాయకత్వంలోని అన్నాడీఎంకే బహిష్కరణ వేటువేసింది. జైలు నుంచి శశికళ బయటకు రాగానే అన్నాడీఎంకేపై ప్రతీకార ధోరణికి పాల్పడగలదని అంచనా వేస్తున్నారు. పార్టీలో చేర్చుకోవడం ద్వారా సామరస్యంగా ముందుకెళ్లే అవకాశాలూ లేకపోలేదని కొందరు వాదిస్తున్నారు.
అలాంటి వారి ఆశలను వమ్ముచేస్తూ శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టం చేశారు. దీనిపై పార్టీ ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రజాభిప్రాయం కానీ ప్రజల మనోభావాలు కానీ ఇప్పటికీ శశికళకు వ్యతిరేకంగా ఉంటున్నందున ఆమె పార్టీలోకి తిరిగివస్తే పార్టీ మూలాలనే అది దెబ్బతీస్తుందని అన్నాడీఎంకే సీనియర్ మంత్రి ఒకరు చెప్పారు.
ఈ క్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను మంగళవారం ఢిల్లీలో కలిసిన అనంతరం సీఎం ఎడపాడి మీడియాతో మాట్లాడారు. శశికళ జైలు నుంచి విడుదల కావడం పార్టీపై ఎలాంటి ప్రభావం చూపదని, శశికళ పార్టీలో చేరే అవకాశాలు వందశాతం లేవని, శశికళను చేర్చుకోరాదని పార్టీలో ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాంమని సీఎం అన్నారు.
కాగా శశికళ జైలు నుంచి విడుదల కాగానే అన్నాడీఎంకేను స్వాదీనం చేసుకుంటారని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత సీఆర్ సరస్వతి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పళనిస్వామి ఈనెల 22న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. చెన్నై సచివాలయంలో జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి తప్పనిసరిగా మంత్రులంతా హాజరుకావాలని మంగళవారం ఆయన ఆదేశాలు జారీచేసారు.
చెన్నై మెరీనాబీచ్‌లో నిర్మాణం పూర్తిచేసుకున్న జయలలిత స్మారక మండపాన్ని ఈనెల 27న ప్రారంభిస్తున్నట్లు మంగళవారం అధికారిక ప్రకటన విడుదలైంది. ప్రధాని మోదీ ఈ మండపాన్ని ఆవిష్కరిస్తారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా మంత్రులతో చర్చిస్తారని తెలుస్తోంది.
శశికళ జైలుకెళ్లిన తర్వాత తిరిగి ఆమెను చేర్చుకోవడాన్ని నిరోధిస్తూ పార్టీ అంతర్గత చట్టాలను కూడా మార్చారు. ప్రస్తుతం పార్టీ నిభంధనల ప్రకారం అయిదేళ్లపాటు క్రియాశీలక సభ్యత్వం ఉన్నవారే పార్టీ పదవికి అర్హులన్నమాట, అంటే పార్టీకి దూరంగా నాలుగేళ్లపాటు జైలులో గడిపిన శశికళకు అన్నాడీఎంకే తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లే మరి.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు కుదిరిన ముహూర్తం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముహూర్తం కుదిరింది. జనవరి 29న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఇక వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ సమావేశాలు జరుగుతాయని, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభ సమావేశాలు జరుగుతాయని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు ఆయన. కరోనా నిబంధనలు పాటిస్తూ సభ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సభలో ప్రశ్నోత్తరాల సమయం ఉంటుందని, జీరో అవర్ తో పాటు సభలో సాధారణ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. సమావేశాల నేపథ్యంలో ఎంపీలకు ఈ నెల 27, 28 తేదీల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఆర్టీ-పీసీఆర్ టెస్టులకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. గత సెప్టెంబరులో జరిగినట్టే లోక్ సభ, రాజ్యసభ చాంబర్లలో సమావేశాలు జరుగుతాయని వివరించారు. రాష్ట్రపతి ప్రసంగం కోసమే పార్లమెంటు సెంట్రల్ హాల్ ను వినియోగిస్తామని తెలిపారు. ఈ ఏడాది ఆర్థిక సర్వే, బడ్జెట్ అంతా డిజిటల్ విధానంలోనే వుంటాయని అన్నారు.
మరో వైపు పార్లమెంట్ క్యాంటిన్లో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగబోతున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ క్యాంటిన్లో ఫుడ్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రకటన చేశారు. క్యాంటిన్ నిర్వహణ బాధ్యతల నుంచి నార్తర్న్ రైల్వేస్ ను తప్పించి.. ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అప్పగించారు. ఇప్పటి వరకు పార్లమెంట్లో ఉన్న క్యాంటిన్లో ఎంపీలకు సబ్సిడీ పద్ధతిలో భోజన వసతి ఏర్పాటు చేశారు. అయితే ఆ సబ్సిడీ విధానాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ బిర్లా తెలిపారు. పార్లమెంట్ సబ్సిడీ ఎత్తివేయడం వల్ల ఏడాదికి 8 కోట్లు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్‌లోని క్యాంటిన్లోని ఆహార పదార్థాలపై ఎంపీలు, సిబ్బందికి 80శాతం సబ్సిడీ ఉంటుంది. ఆహార పదార్థాలపై ఏటా రూ.17 కోట్లు ఖర్చవుతుండగా, వీటిలో దాదాపు రూ.14 కోట్లను పార్లమెంట్ సిబ్బంది.. సందర్శకులే వినియోగించుకుంటున్నారు.
'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు
పశ్చిమబెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటానని ఇటీవలే అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి వైదొలిగి బీజేపీలో చేరిన సువేందు అధికారి శపథం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలోంచి పోటీ చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి మమతపై 50 వేల మెజారిటీతో గెలుపొందగపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటానని సువేందు ప్రకటించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల క్రితం తనకు అధికారాన్ని తెచ్చిపెట్టిన రైతు ఉద్యమ కేంద్రం నందీగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నట్టు సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. కావాలంటే కోల్‌కతాలోని భవానిపూర్, తూర్పు మిడ్నాపూర్‌లోని నందీగ్రామ్ రెండింటినుంచీ పోటీ చేస్తానని తెలిపారు. గత ఐదేళ్ళలో తొలిసారిగా నందీగ్రామ్ బహిరంగ సభలో ఆమె ఈ సంచలన ప్రకటన చేశారు.
మమత సవాలును స్వీకరించిన సువేందు అధికారి ఆమెపై భారీ మెజారిటీతో తాను గెలుపొందడం ఖాయమని చెప్పారు. తనకు సవాలు చేసి మరీ పార్టీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారిపై మమత పట్టరాని ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా లూటీ చేసిన ప్రజాధనాన్ని కాపాడుకోవడానికే ఇలాంటి నేతలంతా పాలక పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారని మమత ఆరోపించారు.
ఈ నేపథ్యంలో మమత సవాలును సువేందు స్వీకరించారు. నందిగామ నుంచే అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారాన్ని మొదలెట్టేశారు. ఇక్కడినుంచే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రతా బక్షిని నా నందిగ్రామ్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని కోరుతున్నాను అని సువేందు చెప్పారు. దీంతో వేదికపై ఉన్న బక్షి ఆయన అభ్యర్థనను వెంటనే ఆమోదించారు.
నాకు నందిగామ నుంచి పోటీ చేసే అవకాశాన్ని మా పార్టీ కల్పించినట్లయితే, మమతపై 50 వేల మెజారిటీతో గెలుపు సాధిస్తాను. అలా కాకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటాను అని సువేందు శపథం చేశారు. మమతా బెనర్జీ, ఆమె మనవడు అభిషేక్ చెప్పుచేతల్లో టీఎంసీ నడుస్తోంది కానీ బీజేపీ మాత్రం ముందుగా చర్చించిన తర్వాతే తన అభ్యర్థులను ఎంపిక చేస్తోందని సువేందు చెప్పారు.
మమత కూడా నందీగ్రామ్ తన లక్కీ ప్లేస్ అని చెప్పుకున్నారు. నందీగ్రామ్ నాకు లక్కీ ప్లేస్ అని గతంలో ఎన్నోసార్లు రుజువైంది. 2016 ఎన్నికలలో నందీగ్రామ్ నుండే ప్రకటించా.. ఈ రోజు కూడా నందీగ్రామ్‌కు వచ్చాను. ఈ క్రమంలో 2021ఎన్నికలలో టీఎంసీ గెలిచి తీరుతుదంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో భవానీపూర్ నుంచి గెలుపొందిన ఆమె దయచేసి చెడుగా భావించవద్దు, మీకోసం మంచి అభ్యర్థిని కేటాయిస్తానని భవానీపూర్ వాసులకు భరోసా ఇచ్చారు. తద్వారా బీజేపీకి, ఇటు సువేందుకు సవాలు విసిరారు. అంతేకాకుండా టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సువేందు అధికారికి చెక్ పెట్టాలనే వ్యూహంలో భాగంగానే మమత అక్కడ పోటీకి సిద్ధమైనట్లు టీఎంసీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
టీఎంసీకి నందీగ్రామ్ అత్యంత ప్రతిష్టాత్మక అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఎందుకంటే 2006-08లో నందీగ్రామ్, సింగూర్‌లో భూసేకరణకు వ్యతిరేక సామూహిక ఉద్యమాలు బెనర్జీ రాజకీయ పునరుత్థానానికి మార్గం సుగమం చేశాయి. ఈ క్రమంలో 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం
అధినేత రజనీకాంత్ రాజకీయాల్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో రజనీ అభిమానులు ఎవరు ఏ పార్టీలోకి వెళ్లినా అభ్యంతరం లేదని అయన అభిమానుల సంఘం రజనీ మక్కల్ మన్రం స్పష్టం చేసింది. నటుడు రజనీకాంత్ రాజకీయాలపై పెట్టుకున్న ఆశలు అడియాసలు కావడంతో మక్కల్ మన్రం నేతలు వలసబాట పట్టారు. నచ్చిన పార్టీ దిశగా కదిలిపోతున్నారు. అలా వెళ్లిపోతున్న వారికి రజనీ మక్కల్ మన్రం ఒకే చెప్పింది. వలసలకు అభ్యంతరం లేదు..అయితే ముందుగా మన్రానికి రాజీనామా చేసి ఏ పార్టీలోనైనా చేరండని సోమవారం విజ్ఞప్తి చేసింది.
రెండు దశాబ్దాలుగా రాజకీయ ప్రవేశంపై ఊరిస్తూ వచ్చిన రజనీకాంత్ మూడేళ్ల క్రితం స్పందించారు. రాజకీయాల్లోకి రావడం ఖాయమని 2017లో చేసిన ప్రకటనతో అభిమానులు ఆనందంతో ఉర్రూతలూగారు. రజనీ ఆదేశాల మేరకు అభిమాన సంఘాలు.. మక్కల్ మన్రాలుగా మారిపోయాయి. సభ్యత్వ నమోదు, జిల్లా ఇన్‌చార్జ్‌ల నియామకం, సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లడం వంటి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా రజనీకాంత్ పార్టీ ఊసెత్తలేదు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ స్థాపన పెద్ద చర్చనీయాంశం కావడంతో గత ఏడాది ఆఖరులో రజనీ మళ్లీ రంగప్రవేశం చేశారు. మక్కల్ మన్రం జిల్లా ఇన్‌చార్జ్‌లతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయసేకరణ చేశారు. డిసెంబర్ 31వ తేదీన పార్టీ ప్రకటన, 2021 జనవరిలో పార్టీ స్థాపన, రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ అంటూ ప్రకటించారు.
ఈలోగా అన్నాత్తే సినిమా షూటింగ్ ముగించుకువస్తానని హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ అనారోగ్యం బారినపడి గత నెల 29న చెన్నైకి చేరుకున్నారు. ఆరోగ్యం సహకరించడం లేదని, రాజకీయ పార్టీ పెట్టడం లేదని ప్రకటించారు. ఈ ప్రకటన అభిమానుల గుండెల్లో బాంబులా పేలింది. చెన్నై పోయస్‌గార్డెన్‌లోని ఆయన ఇంటి వద్ద ఆందోళనలు చేపట్టి వత్తిడి చేసినా, చెన్నై వళ్లువర్‌కోట్టం వద్ద ధర్నా చేపట్టినా రజనీకాంత్ చలించలేదు.
ఇక చేసేదేమీ లేకపోవడంతో రజనీ మక్కల్ మన్రం నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నారు. వీరిలో నలుగురు ప్రముఖులు రెండురోజుల క్రితం డీఎంకేలో చేరిపోయారు. మిగిలిన వారు సైతం వేర్వేరు పార్టీల వైపు చూస్తున్నారు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారడంతో రజనీ మక్కల్ మన్రం ప్రధాన సారధుల్లో ఒకరైన సుధాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రజనీ మక్కల్ మన్రంలోని వారు ఏదైనా పార్టీలోనైనా చేరవచ్చు. అయితే మన్రం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లండని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇతర రాజకీయ పార్టీల్లో చేరినప్పటికీ తాము రజనీ అభిమానులమేనని మర్చిపోరాదని రజనీ మక్కల్ మండ్రమ్ సూచించింది. ఆసుపత్రి పాలు కావడం కూడా దేవుడు తనకు ఇచ్చిన హెచ్చరికగానే భావిస్తున్నాను. కరోనా నేపథ్యంలో నేను రాజకీయ ప్రచారం మొదలెడితే అది నా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని దేవుడే ఆదేశించినట్లుంది అని రజనీ సమర్థించుకున్నారు.
రజనీ ప్రకటనతో నిరాశ చెందా. కానీ ఆరోగ్యం ముఖ్యమే.. కమల్ హసన్
1996 ఎన్నికల్లో పాలక అన్నాడీఎంకే అధినేత జయలలితకు మళ్లీ అధికారం కట్టబెట్టేటట్టయితే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడని రజనీ చేసిన ప్రకటన సంచనల ప్రభావం కలిగించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో జయలలిత చిత్తుగా ఓడిపోగా డీఎంకే ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు రజనీకాంత్ అనారోగ్యం సాకుతో రాజకీయ పార్టీని ప్రారంభించడం నిలిపేసినప్పటికీ బీజేపీ ఆశలు చావడం లేదు. రజనీకాంత్ ఎల్లప్పుడూ జాతి రక్షణకు, తమిళనాడు ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూవచ్చారని, ఆయన గొప్ప నాయకుడని, తాజా ఎన్నికల్లో ఆయన మద్దతుకోసం తాము తప్పక ప్రయత్నిస్తామని తమిళనాడు బీజేపీ ఇన్ చార్జ్ సీటీ రవి పేర్కొన్నారు. ప్రధాని మోదీ, రజనీకాంత్ ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిన విషయమేమని రవి గుర్తు చేశారు.
నో ప్రాబ్లమ్.. యడ్యూరప్పే సీఎం
కర్ణాటకలో రోజుకో వార్త. యడ్డీ పరిస్థితి ఏంటి. ప్రజెంట్ సీఎం పొజిషన్ ఇప్పుడెలా ఉంది. సీఎం సీటులో ఉంటారా.. వేరే ఎవరైనా గుంజేసుకుంటారా. కేంద్రం ఏం ఆలోచిస్తుంది. బీజేపీ సెంట్రల్ నేతలు ఏం అనుకుంటున్నారు. మోడీ మనసులో ఏం ఉంది. యడ్యూరప్పని సీఎం గా కొనసాగిద్దాం అనుకుంటున్నారా లేదా. యడ్యూరప్ప అపొనెంట్ లు ఎన్నో రాజకీయాలు చేస్తున్నారు కదా. వాటి పరిస్థితి ఏంటి. ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి కదా.. వాళ్ల కామెంట్లని.. పొలిటికల్ అటాక్స్ ని పట్టించుకుంటారా లేదా. ఇంతకీ.. రైతుల్ని అయినా పట్టించుకుంటారా లేదంటారా.
రైతు వ్యతిరేక సీఎంగా పేరొచ్చింది కదా యడ్యూరప్పకి.. ఇప్పుడు బీజేపీ ఏం ఆలోచిస్తోంది. ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు.. ఎవరో ఒకరు సీఎంగా వస్తారు.. యడ్యూరప్పకి ఎసరు పెడతారు అనుకుంటున్నారు కదా వాటి పరిస్థితి ఏంటి. అసలు సీఎంగా బాధ్యతల నుంచి తొలగిస్తే.. యడ్యూరప్ప పరిస్థితి ఏంటి. కేంద్రం చెప్పినట్లు నడుచుకుంటాం అంటారా.. లేదంటే తిరుగుబాటు జెండా ఎగరేస్తారా.. వేరే పార్టీలోకి పోతారా.. సొంత పార్టీ పెడతారా. ఎన్ని వార్తలో కదా. ఈ మధ్య కర్ణాటక పాలిటిక్స్ మొత్తం.. ఈ ఇష్యూ చుట్టూనే తిరుగుతోంది.
ఏకంగా సీఎం పదవికే ఎసరు వచ్చిందంటే.. రైతుల్లో కర్ణాటక సీఎంపై ఎంత వ్యతిరేకత ఉందో కదా. అయినా సరే.. యడ్యూరప్పకి ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే.. కర్ణాటకలో ఊహించని పరిణామాల మధ్యలో ట్విస్టుల మీద ట్విస్టులు పడ్డ టైంలో కూడా యడ్యూరప్ప కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రాజకీయ చక్రాల్ని గిర్ర గిర్ర తిప్పి.. పొలిటికల్ గేమ్ లు ఎన్నో ఆడి.. ఆడించి సీఎం పదవి దక్కించుకున్నారు. సీఎం పదవి రాక ముందే.. అన్ని పాలిటిక్స్ చేసి.. అంత మందిని కంట్రోల్ చేసి.. పెద్దల దగ్గర మెప్పు పొంది సీఎం అయ్యారు.
అంటే మరి.. సీఎం అయ్యాక సీటు చేజార్చుకుంటారా చెప్పండి. అదేమైనా మామూలు చైరా వదిలేసుకోవడానికి.. అదేమైనా మామూలు పదవినా ఇబ్బంది పడ్డానికి.. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పొలిటికల్ గా నా ప్లేస్ ని ఎవరూ రీ ప్లేస్ చేయలేరు అనిపించుకున్నారు యడ్యూరప్ప. అమిత్ షా ఈ విషయంలో ఫుల్లు క్లారిటీ ఇచ్చారు. జనసేవక్ ముగింపు సభలో పాల్గొన్న అమిత్ షా.. ఈ విషయంపై ఎవరికీ కన్ ఫ్యూజన్ లేకుండా చెప్పేశారు.
యడ్యూరప్ప పూర్తి కాలం పదవిలో ఉంటారు. ఎలాంటి వార్తలకీ ప్లేస్ లేదు. ఎలాంటి కన్ ఫ్యూజన్ లూ లేవు. రైతుల విషయంలో యడ్యూరప్ప నిర్లక్ష్యం వహించారు అనేది సుద్ద తప్పు.. తను సుద్ధపూస. ఏ ప్రాబ్లమూ లేదు.. మరకలేని మంచి లీడర్ తను.. కర్ణాటక సీఎం గా తనకి హండ్రడ్ పర్సంట్ అర్హతలు ఉన్నయ్. ఆ మాటకొస్తే.. ఆయనొక్కరికే అందరికంటే ఎక్కువ అర్హత ఉంది అని కన్ఫమ్ చేశారు. సో.. యడ్యూరప్పపై ఇన్నాళ్లూ తిరుగుతున్న బ్రేకింగ్ న్యూస్ లు అన్నీ బ్రేక్ అయిపోయాయి.
బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసి తీరతాం.. శివసేన స్పష్టం
పశ్చిమబెంగాల్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో పాల్గొని తీరతామని శివసేన తేల్చిచెప్పింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్‌కి బీజేపీకి మధ్య జరుగుతుందని బావిస్తున్న ఎన్నికల పోరు శివసేన రాకతో రసవత్తరంగా మారింది. బెంగాల్ ఎన్నికల్లో పాల్గొనేది లేదని చెబుతామని కొంతకాలంగా ఊరిస్తూ వచ్చిన శివసేన ఎట్టకేలకు అధినేత సమ్మతితో బరిలో దిగాలని నిర్ణయించుకుంది.
చాలాకాలంగా ఎదురు చూస్తున్న అప్డేట్ రానేవచ్చింది. పార్టీ చీప్ ఉద్దవ్ థాకరేతో చర్చించిన పిమ్మట త్వరలో జరగపోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని శివసేన నిర్ణయించుకుంది. త్వరలో మేం కోల్‌కతాను చేరుకుంటాం అని శివసేన ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
అధికార పార్టీని దెబ్బతీయాలని, ఈ దఫా ఎన్నికల్లో ఏరకంగానైనా సరే అధికారం సాధించాలని భావిస్తున్న బీజేపీ పశ్చిమబెంగాల్లో సర్వశక్తులూ ఒడ్డుతున్న విషయం తెలిసిందే. చాలాకాలంగా కమ్యూనిస్టులు కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమిని చావుదెబ్బతీసి 2011లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
2014లో కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రభుత్వం స్థాపించిన తర్వాత అనేక రాష్ట్టాల్లో అధికార పార్టీలు, ప్రభుత్వాల పని పట్టిన బీజేపీ నాయకత్వం ఇటీవలి సంవత్సరాల్లో బెంగాల్‌పై గురిపెట్టి మమతపై దూకుడు దాడిని కొనసాగిస్తోంది.
గత లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీని ఢీకొని 18 ఎంపీ స్థానాలను బెంగాలనుంచి గెల్చుకున్న బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవాలని దృఢంగా పోరాడుతోంది. రాష్టంలో బీజేపీ విజృంభణ ప్రభావంతో శివసేన వంటి మితవాద పార్టీలు కూడా బెంగాల్‌పై కన్నేశాయి.
అయితే మహారాష్ట్రలో శివసేనతో కలిసి అధికారం పంచుకున్న కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్-మే నెలల్లో జరుగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్ విషయం తెలిసిందే. మే 20న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పదవీకాలం ముగియనుంది.
మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
బెంగాల్ బీజేపీ అధినేత దిలీప్ ఘోష్ వచ్చే నెలలో 50 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారని చేసిన ప్రకటన పశ్చిమబెంగాల్లో కలకలం సృష్టించిన నేపథ్యంలో మమతకు టీఎంసీ మహిళా ఎంపీ, ప్రముఖ నటి ఒకరు షాక్ కలిగించారు. బీర్బూమ్ ఎంపీ శతాబ్ది రాయ్ చేసిన పోస్టు ఒకటి ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌లో కల్లోలం సృష్టిస్తోంది.
నేను నిర్ణయం తీసుకున్నట్లయితే జనవరి 16 మధ్యాహ్నం 2 గంటలకు మీకు తెలియచెబుతాను అంటూ టీఎంసీ మహిళా ఎంపీ చేసిన పోస్టు బెంగాల్ రాజకీయాలను ఇప్పుడు ఊగించివేస్తోంది. శతాబ్ది రాయ్ 2009 నుంచి బీర్బూమ్ పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇది శతాబ్ది రాయ్ స్వయంగా చేసిన పోస్టా లేక ఆమె ఫ్యాన్ క్లబ్ పేజీ అధికారికమైనదేనా అనేది స్పష్టం కావడం లేదు.
డిసెంబర్ 29న మమతా బెనర్జీతో కలసి బోల్పూర్లో శతాబ్ది రాయ్ టీఎంసీ కార్యకర్తల ప్రదర్శనలో నడుస్తూ కనిపించారు. అయితే శుక్రవారం సాంయంత్రం 5 గంటల సమయంలో ఈ సంచలన వ్యాఖ్య పోస్ట్ చేశాక, రాయ్ ఫోన్ పనిచేయడం లేదు. శతాబ్ది రాయ్ ఫ్యాన్ క్లబ్ ఫేస్బుక్లో తన నియోజక వర్గ ప్రజలనుద్దేశించి పంపిన సందేశంలో రాయ్ కార్యకర్తలతో, అభిమానులతో కలిసి ఉండలేకపోయినందుకు మానసికంగా వ్యధ చెందుతున్నానని పేర్కొన్నారు. పార్టీకి చెందిన అనేక కార్యక్రమాల్లో తనను ఎవరూ ఆహ్వానించలేదని శతాబ్ది రాయ్ పేర్కొంటూ బాధను వ్యక్తం చేశారు.
నేను మీతోపాటు కలిసి నడవడం కొంతమందికి ఇష్టం లేదేమోనని భావిస్తున్నాను. పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలు గురించి నాకు తెలియపర్చలేదు. నేను ఎలా ముందుకెళ్లాలి. ఇది నాకు మనోవ్యధను కలిగిస్తోంది అని రాయ్ తన సందేశంలో పేర్కొన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా మీతో పూర్తి స్థాయిలో కలిసి ఉండేలా తగు నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. మీకందరికీ నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. 2009 నుంచి మీరు నాకు మద్దతు తెలుపుతూ నన్ను లోక్ సభకు పంపుతూ వస్తున్నారు. భవిష్యత్తులో కూడా నా పట్ల మీ అభిమానం కొనసాగుతుందని ఆశిస్తున్నాను. పార్లమెంటు సభ్యురాలిని కాక ముందు నుంచీ కూడా బెంగాల్ ప్రజలు నన్ను ఎంతగానో ప్రేమించారు. నేను కొనసాగడానికి, నా విధి నేను చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ నేను నిర్ణయం తీసుకున్నట్లయితే జనవరి 16 మధ్యాహ్నం 2 గంటలకు మీకు తెలియపరుస్తాను అని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు.
టీఎంసీ తోటి ఎంపీ సౌగత్ రాయ్ మహిళా ఎంపీ చేసిన వ్యాఖ్యలపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె ఏ నిర్ణయం తీసుకోనున్నారో చూడటానికి శనివారం వరకు వేచి చూస్తానని సౌగత్ రాయ్ చెప్పారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఈ విషయమై ఎలాంటి వ్యాఖ్యానాలు రావడం లేదు.
టీఎంసీ నేత, మంత్రి రజిబ్ బెనర్జీ కూడా ఇదేవిధమైన ప్రకటన చేయడం కాకతాళీయమే కావచ్చు. గత నెలలో పార్టీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రజిబ్ కూడా తన సోషల్ మీడియా పేజీలో జనవరి 16 అంటే శనివారం సాయంత్రం 3 గంటలకు తన ఫేస్ బుక్ లైవ్‌లో ప్రసంగిస్తానని ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. శతాబ్ది రాయ్‌ని బీర్బూమ్ జిల్లా నాయకత్వం కొంతకాలంగా పక్కన బెడుతున్నారని, అందుకే ఆమె మనోవ్యధకు గురై ఉంటారని జిల్లా పార్టీ వర్గాలు తెలిపాయి.
డిసెంబర్ 19న ఏడుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మల్యేలు, ఒక ఎంపీ పార్టీనుంచి వైదొలిగి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిపోవడం తెలిసిందే. వారి విద్రోహాన్ని టీఎంసీ తోసిపుచ్చింది.
2021 మే నెలలో ఆరునుంచి ఏడుగురు బీజేపీ ఎంపీలు స్థానాలు మార్చుకోవచ్చంటూ పశ్చిమబెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మాలిక్ చేసిన ప్రకటనకు బీజేపీ రాష్ట్ర అధిపతి ఎదురు సమాధానం చెబుతూ 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం బెంగాల్ రాజకీయాల్లో ముసలం పుట్టిస్తోంది.
అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు నిస్తున్న కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తూర్పారబట్టారు. ఇంతకూ కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పడం ఎప్పటి నుంచి ప్రారంభించిందో దేశప్రజలకు చెప్పాలని తోమర్ డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే వ్యవసాయ సంస్కరణలను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించిందని అలా ప్రస్తావించడం అబద్ధమా, లేక తమ ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా సాగు చట్టాలను వ్యతిరేకించడం అబద్దమా స్పష్టం చేయాలని నరేంద్ర సింగ్ తోమర్ ఎద్దేవా చేశారు.
వ్యవసాయ సంస్కరణలను 2019 ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించి ఉంటే రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఇద్దరూ మీడియా ముందుకొచ్చి తాము ఆబద్దం చెప్పింది ఏ సమయంలో అనే అంశంపై కాస్త స్పష్టత నివ్వాలని తోమర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రకటనలు, ఆయన చర్యలను చూసి మొత్తం కాంగ్రెస్ పార్టీ నవ్వుకుంటోందని తోమర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో–2019లో వ్యవసాయ సంస్కరణలపై వాగ్దానం చేశారని గుర్తుచేశారు. ఈ విషయం మేనిఫెస్టోలో ఉంటే.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీడియా ముందుకు వచ్చి, అప్పుడు అబద్ధాలు చెప్పారో లేక ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారో వివరించాలని తోమర్ సూచించారు.
వ్యవసాయ సంస్కరణల విషయంలో దేశంలోని రెండు లేదా మూడు రాష్ట్రాల రైతులు మాత్రమే ధర్నా చేస్తున్నారని కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. ప్రస్తుతం శీతాకాలం, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వంటి పరిస్థితుల దృష్ట్యా నిరసనకారుల గురించి ప్రభుత్వం ఆందోళన చెందుతోందని అన్నారు.
అంతకుముందు శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాందీ, రాహుల్ గాంధీ నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొన్నారు. రైతులతో కలిసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం వరకు మార్చ్ చేసారు.. తర్వాత జంతర్ మంతర్ వెళ్లి అక్కడ పంజాబ్ ఎపీలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులతో కలిశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోదీ రైతులను ఏమాత్రం గౌరవించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతుగా ఉంటుందని,. సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకునేంతవరకు రైతులకు అండగా ఉంటామని రాహుల్ చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యాపారవర్గాల కోసమే పనిచేస్తోందని, ప్రస్తుత సాగు చట్టాలు రైతులకు ఏమాత్రం అనుకూలంగా లేవని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సాగు చట్టాలను వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్, టీఎంసీ పార్టీలకు చెందిన ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మాత్రమే కేంద్రం సాగు చట్టాలను పార్లమెంటులో ఆమోదింప చేసుకున్నారని రాహుల్ విమర్శించారు.
కాగా శుక్రవారం దేశంలోని గవర్నర్ల నివాసప్రాంతమైన అన్ని రాజ్ భవన్ల వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది. సాగు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
కొత్త టెన్షన్.. కరోనా టీకాతో నపుంసకులు అవుతారా.?
ఎటు పోయి ఎటొచ్చినా ఏం జరుగుతుందో తెలీదు. టెన్షన్ మాత్రం తప్పేలా లేదు. కరోనా టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ మామూలే అని తెలుసు. జ్వరం వస్తుంది. బీపీ పెరుగుతుంది. దగ్గు వస్తుంది.. జలుబు చేస్తుంది.. ఒళ్లు నొప్పులొస్తయ్ అంటే ఏమో అనుకున్నం. అంతా ఓకే. కానీ.. ఇప్పుడు కొత్త టెన్షన్ ఒకటి జనాన్ని ఇరిటేట్ చేస్తుంది.
రేపటి నుంచే దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ వేయడం ప్రారంభం అవుతుంది కదా. ఇదే టైంలో.. ఇప్పుడు ఈ టెన్షన్ తప్పడం లేదు. నపుంసకత అంటే మామూలు విషయమా చెప్పండి. ప్రతి ఒక్కరికీ గుండెలు డగ్గ డగ్గ మంటున్నయ్. యంగ్ ఏజ్ లో వాళ్లు.. మిడ్ ఏజ్ లో వాళ్లే కాదు. ఓల్డే ఏజ్ లో వాళ్లు కూడా.. వామ్మో నపుంసకత వస్తే ఏం చేయాలి అంటున్నారు. అసలు కరోనా వ్యాక్సిన్ వేసే టైంలో ఇలాంటి డౌట్లు వస్తుంటే.. వ్యాక్సిన్ వేయించుకుంటారా అనేది పెద్ద డౌట్.
అవును.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదో భయం పట్టుకుంది. రేపు వ్యాక్సిన్ దగ్గరికి ఎంత మంది వస్తారు అని కన్ ఫ్యూజన్ మొదలైంది. ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ లీడర్ అఖిలేశ్ యాదవ్.. దీనిపై డిఫరెంట్ స్టేట్ మెంట్ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ బీజేపీది కాబట్టి.. దాన్ని తాను వేసుకోను అన్నాడు. ఇక ఇదే టైంలో.. మరో సమాజ్ వాదీ పార్టీ లీడర్.. ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే నపుంసకత వస్తుంది అన్నారు. అంతే.. అంతా భయం భయం. మానాయకుడు అఖిలేశ్ యాదవ్ వ్యాక్సిన్ తీసుకోను అన్నారంటే ఏదో తేడా ఉండే ఉంటుంది. మేం బీజేపీని నమ్మలేం అంటున్నారు సమాజ్ వాడీ పార్టీ ఎమ్మెల్సీ. అఖిలేశ్ యాదవ్ కి దాని కత ఏందో తెలిసే ఉంటుంది. అందుకే.. ఆయన వ్యాక్సిన్ తీసుకోనంటున్నారు. అందుకే మాకు కూడా భయం మొదలైంది అంటున్నారు సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్సీ. ఈ వ్యాక్సిన్ ప్రజలకు హాని చేస్తుంది. నపుంసకులు అవుతారు. మా పార్టీ కార్యకర్తలే కాదు.. దేశంలో ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ కి దూరంగా ఉండాలి. పోయి పోయి నపుంసకులు అయితే ఎలా చెప్పండి అంటున్నారు ఆ ఎమ్మెల్సీ.
ఇక చేసేదేముంది చెప్పండి. ఒక్కసారిగా సమాజ్ వాదీ పార్టీ లీడర్ వ్యాఖ్యలు.. దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. వాటిపై క్లారిటీస్ ఇవ్వడానికి టైం కూడా లేదు. అందుకే.. సెంట్రల్ హెల్త్ మినిస్టర్ లైన్ లోకి వచ్చారు. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమూ లేదు. అందుకే.. దీన్ని యాక్సెప్ట్ చేశాం. దేశప్రజలకి నాదీ భరోసా.. ఏం కంగారు పడాల్సిన పన్లేదు అంటున్నారు సెంట్రల్ హెల్త్ మినిస్టర్.
మంత్రిపై అత్యాచార ఆరోపణలు తీవ్రమైనవి.. చర్య తప్పదన్న శరద్ పవార్
నేషనల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండేపై వచ్చిన అత్యాచార ఆరోపణలు చాలా తీవ్రమైనవని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. ముండేపై ఆరోపణలు తీవ్రాతితీవ్రమైనవని భావిస్తున్నాను. సహజంగానే మేం మా పార్టీలో ఈ అంశాన్ని చర్చిస్తాం. నా సీనియర్ సహచరులతో కూడా ఈ విషయాన్ని చర్చించి వారి అభిప్రాయాలను తీసుకుంటాను, ఆ తర్వాత దీనిపై తగు చర్య తీసుకుంటాను అని పవార్ చెప్పారు.
మా పార్టీ సీనియర్ నేతపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. ఒక రాజకీయపార్టీగా మేం ఈ అంశంపై చర్య తీసుకోవలిసి ఉంటుంది. ఇంతవరకు పార్టీ నేతలతో ఈ అంశంపై చర్చించలేదు. త్వరలో మా వాళ్లతో దీనిపై చర్చిస్తాను. ఆరోపణలకు గురైన ముండే నన్ను కలిసి తన అభిప్రాయం చెప్పారు. ఆయన చెప్పిన విషయాలను మా పార్టీ నేతలముందు పెట్టడం నా బాధ్యత. ఆ తర్వాతే మా పార్టీ తదుపరి చర్య ఏమిటన్నది నిర్ణయించుకుంటాం అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్పారు.
తనపై వచ్చిన ఆరోపణల గురించి ముండే నాతో చెప్పారు. తనతో సన్నిహిత సంబంధం కలిగిన మహిళే ఇప్పుడు తాను అత్యాచారానికి గురైనట్లు ఆరోపిస్తోందని ముండే చెప్పారు. ఆయనపై ఫిర్యాదు నమోదైంది. దీనిపై విచారణ కూడా జరుగుతుందని భావిస్తున్నా.. తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే హైకోర్టును ఈ విషయమై సంప్రదించినట్లు ముండే చెబుతున్నారు. కానీ ఎవరికీ ఈ విషయంలో అన్యాయం జరగకుండా చర్య తీసుకుంటామని శరద్ పవార్ చెప్పారు.
అత్యాచారమా.. బ్లాక్ మెయిలింగా..
మహారాష్ట్ర సామాజిక, న్యాయశాఖ మంత్రి ధనంజయ్ ముండేపై 38 మహిళ అత్యాచార ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై ధనంజయ్ స్పందించారు. సదరు మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తుందని.. వాస్తవానికి ఆమె సోదరి, తను రిలేషన్లో ఉన్నామని పేర్కొన్నారు. అంతేకాక అక్కాచెల్లెల్లిద్దరు తనను బ్లాక్ మెయిల్ చేస్తూ.. డబ్బులు గుంజాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
వీరిద్దరి మీద తాను గతేడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానన్నారు. తనపై ఆరోపణలు చేసిన మహిళ సోదరితో తనకు 2003 నుంచి సంబంధం ఉందని.. తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ధనుంజయ్ ముండే తెలిపారు. అంతేకాక ఈ మధ్య కాలంలోనే తమ సంబంధం గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశానని. వారు కూడా అంగీకరించారని.. అంతా బాగుందనుకున్న సమయంలో తనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు.
మంత్రిపై ఆరోపణలు వచ్చిన వెంటనే తనను పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ తదితర పార్టీలు డిమాండ్ చేశాయి. ధనంజయ్ ప్రకటన వెలువడిన అనంతరం మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేటర్ రాశారు.
అంతకుముందు ధనుంజయ్ ముండే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఒడిశాలోని అంధేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె తరపు లాయర్ మాట్లాడుతూ.. బాధితురాలికి 1997 నుంచి ధనుంజయ్ ముండేతో పరిచయం ఉంది. తొలుత బాలీవుడ్లో సింగర్‌గా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఆమెతో క్రమంగా పరిచయం పెంచుకున్నాడు అని తెలిపారు. ఈ క్రమంలో 2008లో ముండే తొలిసారి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఏళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడు.
ఇక 2019లో ఆమె తనను వివాహం చేసుకోవాల్సిందిగా అతడిని కోరింది. కానీ ధనుంజయ్ అందుకు అంగీకరించలేదు. అంతేకాక దీని గురించి ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. దాంతో అతడి మీద ఫిర్యాదు చేశాం. కానీ పోలీసులు ధనుంజయ్ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. మేం కోర్టుకు వెళ్తాం. ఇక బాధితురాలికి ఏమైనా జరిగితే అందుకు ధనుంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది అని బాధితురాలి లాయర్ చెప్పారు.
అధికారుల పాపాలను ఎంతకాలం మోయాలి... హైకోర్టు ధ్వజం
తమిళనాడు అధికారుల అలసత్వంపై పదే పదే ధ్వజమెత్తుతున్న మద్రాస్ హైకోర్టు తాజాగా, ఏసుక్రీస్తు శిలువ మోసినట్టుగా అధికారుల పాపాలను న్యాయస్థానం మోయలేదని వ్యాఖ్యానించింది. ప్రజా ప్రయోజనాలకు సంబందించి న్యాయస్థానం గతంలో జారీ చేసిన ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.
అధికారుల తప్పిదాల కారణంగా కోర్టుల్లో పలు కేసులు దాఖలయ్యాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుదీర్ఘకాలం వాయిదాలో ఉన్న ఒక కేసులో అలసత్వానికి ప్రతిగా పిటిషనర్లకు రూ.లక్ష, 50 వేల చొప్పున నష్టపరిహారం అందజేయాలని ధర్మపురి, పెరంబలూరు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.శేషసాయి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే ధర్మపురి జిల్లా వీరప్పనాయకన్పట్టిలో రత్నం అనే మహిళకు చెందిన నాలుగెకరాల వ్యవసాయ భూమిని 1987లో ఓ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే అందుకు సంబంధించిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించగా, 2000 సంవత్సరంలో న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
అయితే అప్పటినుంచి అధికారులు ఆ భూమిని ఆమెకు స్వాధీనం చేయలేదు. అలాగని కోర్టు ఉత్తర్వులపైనా అప్పీలుకు వెళ్లలేదు. దీంతో రత్నం మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ భూమిని అధికారులు తనకు అప్పగించడం లేదని వివరించింది. అదేవిధంగా పెరంబలూరుకు చెందిన జయలక్ష్మి కూడా ఇదేవిధమైన వివాదంపై హైకోర్టును ఆశ్రయించింది.
ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.శేషసాయి.. అధికారుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. కోర్టు ఆదేశించి 20 ఏళ్లు అవుతున్నా, పిటిషనర్లకు భూములను అప్పగించకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. పొంతనలేని అధికారుల వ్యవహారశైలితో పడిన చిక్కుముడిని పరిష్కరించడం న్యాయస్థానాలకు కష్టంగా మారుతుందన్నారు.
ఆ భూములను పిటిషనర్ల పేర్లపైకి మార్చాలని స్పష్టం చేశారు. అదేవిధంగా పిటిషనర్లకు నష్టపరిహారం అందజేయాలని ఆదేశించారు. తమ ఆదేశాలను అమలు చేసి సమగ్ర నివేదికలను దాఖలు చేయాలని రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
2012లో జాతీయ రహదారుల కోసం స్వాధీనం చేసుకున్న పేదల స్థలాలకు నష్టపరిహారం చెల్లించాలని తాను చేసిన ఆదేశంపై ఎనిమిదేళ్లుగా ప్రభుత్వాధికారులు చర్య తీసుకోకపోవడంపై హైకోర్టు మండిపడింది. అలసత్వానికి గాను కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్య తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలని హైకోర్టు సేలం, విల్లుపురం జిల్లాల కలెక్టర్లకు గతంలోనే నోటీసు పంపింది.
జల్లికట్టు.. రాహుల్ పై బీజేపీ పట్టు
జల్లికట్టు ఎంత ఫేమస్సో తెలుసు కదా. ఎంత ఫేమస్సో అన్ని విమర్శలు ఉన్నయ్. సంప్రదాయం అని కొంతమంది.. సంస్కారం కాదు అని కొంతమంది. తప్పని కొంతమంది.. ఏంటి తప్పని ఇంకొంత మంది.. ఇలా ఎన్నో ఉన్నయ్. మానవతా వాదులు.. పశుప్రేమికులు ఎన్నో మాటలు అంటుంటారు. అటు కొంతమంది ఇటు కొంతమంది మాట్లాడుతుంటారు. సంక్రాంతి టైంలో.. జల్లికట్టు తమిళ్ నాడులో చాలా చాలా స్పెషల్. ఇప్పుడు కూడా మస్త్ జరిగింది.
కరోనా టైం కదా.. చాలా కండిషన్స్. అయినా సరే.. తమిళనాడు సర్కార్ బానే యాక్సెప్ట్ చేసింది. కాకపోతే.. ఎందుకొచ్చిన గొడవలే అని.. షరతులు వర్తిస్తాయి అని చెప్పింది. అంతా బానే పాటించారు. 150 మంది కంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయకూడదు.. ఎప్పటిలా పోలిస్తే.. సగం మంది కంటే ఎక్కువ మంది రాకూడదు అంటూ.. నిర్వాహకులకకు తూతూ మంత్రంగా రూల్స్ పెట్టింది తమిళనాడు సర్కార్. ఎలాగూ ఆ రూల్స్ ని జనం పట్టించుకోరు అని తెలిసిందే కదా. పనిలో పనిగా.. కాంగ్రెస్ పార్టీ మోస్ట్ సీనియర్ లీడర్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయిన రాహుల్ గాంధీ కూడా వచ్చారు. అక్కడ మొదలైంది అసలు రచ్చ. కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. జల్లి కట్టు నిర్వాహకులు మాత్రం ఫుల్ గా రిసీవ్ చేసుకున్నారు. రాహుల్ గాంధీ రావడంతో.. జల్లి కట్టు ప్రాంగణం అంతా పావనం అయింది అంటూ.. అంతా నెత్తిన పెట్టుకుని పొగడ్తలతో ముంచెత్తారు.
కానీ.. బీజేపీ ఊరుకుంటుందా చెప్పండి. ఎట్టా వస్తారు రాహుల్ గాంధీ మీరు అంటూ.. కామెంట్స్ మొదలెట్టేసింది. పండక్కి పిలిచారు వచ్చాను.. నాకు మాత్రం సంబరం ఉండదా.. సంక్రాంతి నేను మాత్రం జరుపుకోకూడదా అంటే ఊరుకుంటారా బీజేపీ వాళ్లు. వెళ్తే వెళ్లారు మేం వెళ్లొద్దు అనడం లేదు. మీరెట్టా వెళ్తారు అనేదే మా ప్రశ్న అంటున్నారు బీజేపీ వాళ్లు. పోయిన ఎన్నికలకు ముందు ఏం చెప్పారో గుర్తుందా అని ప్రశ్నించారు. జల్లి కట్టు కరెక్ట్ కాదు. జల్లికట్టుని మా ప్రభత్వం బ్యాన్ చేస్తుంది. మూగజీవాల్ని హింసించకూడదు అంటూ డైలాగులు దంచారు కదా.. గుర్తు లేదా అంటున్నారు బీజేపీ లీడర్లు. మీకు మీరుగా జల్లికట్టుని వ్యతిరేకించి.. మీరే సంబరాలకి వెళ్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పాపం రాహుల్.. ఇంకేం చేస్తాడు చెప్పండి. .అప్పుడెందుకు అట్టా మాట్లాడానురా దేవుడా అని.. తల పట్టుకున్నారు కావచ్చు.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ
06-07-2020

రహస్యంగా కాజల్ ఎంగేజ్ మెంట్? ఎవరితోనో తెలుసా?
24-08-2020

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?
10-08-2020

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్
09-08-2020

హైదరాబాద్‌లో బాంబు పేలుడు.. కార్లు, బస్సుల అద్దాలు ధ్వంసం
21-08-2020

నారా లోకేశ్ కి విడదల రజనీ షాక్
28-10-2020

ఏంటి రజనీ మేడమ్.. అసలు కథ అదేనా
30-10-2020

అప్పుడలా.. ఇప్పుడిలా..! విడదల రజినీ ఇంతలా మారిపోయారా..?
04-07-2020

విజయసాయి రెడ్డికి ఇష్టం లేని పని జరగబోతోందా?
24-07-2020