యువకుడికి పదేళ్ళ జైలు.. 70 ఏళ్ల వృద్ధురాలిపై అఘాయిత్యం కేసు
నిర్భయ.. దిశ.. ఉన్నావ్.. సమత..పేరు ఏదైనా మృగాళ్ల దాడికి బలైన అభాగ్యులు. తాజాగా అనంతపురం మహిళా కోర్టు ఓ కేసులో యువకుడికి పదేళ్ళ జైలుశిక్ష విధించింది. అనంతపురం జిల్లాలో 2013లో జరిగిన 70 ఏళ్ల వృద్ధురాలి అత్యాచారం కేసులో కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో యువకుడిపై ఆరోపణలకు సాక్ష్యాలు లభించడంతో అతనికి పదేళ్ల జైలు శిక్ష... రూ. 10 వేలు జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కంబదూరు మండలం అండేపల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడి ఈ దారుణానికి ఒడిగట్టాడు. 2013, ఆగస్టు 24వ తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఇంట్లో నిద్రిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు రాజు వయసుని మరచి, విచక్షణ కోల్పోయి ఆ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు పోలీసులు. జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలైన వృద్ధురాలిని చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. అయితే మరింత మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపారు. అప్పటి కళ్యాణదుర్గం సి.ఐ జి.రామకృష్ణయ్య కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేశారు.
కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతపురం మహిళా కోర్టు జడ్జి సోమవారం తీర్పు వెల్లడించారు. నిందితుడికి పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. దరాప్తు చేసిన సి.ఐ, ప్రాసిక్యూషన్ తరుపున వాదించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీదేవిలను జిల్లా ఎస్పీ అభినందించారు.
అసెంబ్లీ ముట్టడికి రాయలసీమ విద్యార్ధుల యత్నం
రాయలసీమకు పాలకులు అన్యాయం చేశారని, ఇప్పటికైనా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్ధులు కదం తొక్కారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌తో రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూలు జిల్లా విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విద్యార్దులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.
కృష్ణా రివర్ బోర్డు, శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం తమకు రెండో రాజధానిగా కేటాయించాలని తమ న్యాయపరమైన కోరికను తీర్చాలని వారు డిమాండ్ చేశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు కోసం వత్తిడి తేవాలని రాయలసీమ నేతలను కోరారు.
రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేస్తే అభివృద్ధి సాధిస్తుందని వారు కోరారు. అసెంబ్లీ వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేసిన రాయలసీమ విద్యార్ధులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధులు నినాదాలు చేశారు.
ఎంపీడీవో నిర్వాకం.. భార్యపై కత్తితో దాడి
రోజురోజుకీ మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు కూడా ఈ దాడులపై నిరసన తెలుపుతున్నారు. అయితే, కొంతమంది ప్రజాప్రతినిధులు తాము చట్టానికి అతీతులం అనే భావనతో వేధింపులకు పాల్పడుతున్నారు. కట్టుకున్న భార్యకు నరకం చూపించాడో బాధ్యతాయుతమయిన పదవిలో ఉన్న వ్యక్తి. తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) ఎంపీడీవో చేష్టలకు అతని భార్య బలవుతోంది.
తన భర్త తనను వేధిస్తున్నాడని, తాగి వచ్చిన హింసిస్తున్నాడని ఎంపీడీవో అనిల్ కుమార్ భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనం కలిగిస్తోంది. భర్త అనిల్‌కుమార్ అదనపు కట్నం వేధిస్తున్నాడని ఆమె జిల్లా ఎస్పీ మల్లారెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిత్యం తాగొచ్చి శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె ఆవేదన చెందుతున్నారు. తాజాగా రెండురోజుల క్రితం అనిల్ బాగా తాగివచ్చాడు. భార్యపై విచక్షణా రహితంగా దాడిచేశాడు. దీంతో ఆమె చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
రెండు చేతులపై కత్తి గాయాలను మీడియాకు చూపించారు. ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన జగదీశ్ అనిల్‌కుమార్, గుంటూరు వాసి మేరీకుమారితో 2018లో వివాహమైంది. ప్రస్తుతం అనిల్‌కుమార్ కొమురం భీ అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నాడు. కాగజ్‌నగర్‌లోని శ్రీరాంనగర్ కాలనీలో ఈ జంట కాపురం చేస్తున్నారు.
తరచూ తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని, అదనపు కట్నం తనపై హత్యయత్నం జరిగిందని మేరీకుమారి చెప్పారు. తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది. ఎంపీడీవోగా ఉండి ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్న అనిల్ పై చట్టపరమయిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
మాంసాహారులకు ‘చికెన్’ పండుగ
ఒక వైపు ఉల్లిధరలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. తినేందుకు ఏం దొరక్క జనం నానా ఇబ్బందులు పడుతున్న వేళ చికెన్ ధరలు తగ్గడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. డిసెంబర్, జనవరి నెలలు ఆధ్యాత్మికంగా కాస్త కఠిన నిబంధనలు కలిగి ఉంటాయి. దీంతో చికెన్ ధరలు దిగి వస్తున్నాయి. కోళ్ళ ఉత్పత్తి భారీగా ఉండడంతో ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి.
గతంలో కిలో 250 నుంచి 300 పలికిన చికెన్ ధర ప్రస్తుతం రూ.150 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. లైవ్ కోడి ధర రూ.100 కి లోపే వుంది. పది రోజుల క్రితం వరకు కూడా చికెన్ ధరలు కిలో రూ.220కి పైనే ఉన్నాయి. అకస్మాత్తుగా రెండుమూడురోజుల నుంచి ధరలు తగ్గాయని, అమ్మకాలు కూడా పెరిగాయని చికెన్ వ్యాపారులు చెబుతున్నారు. సండే వచ్చిందంటే చికెన్ ప్రియులకు ముక్కలేందే ముద్దదిగని పరిస్థితి.
ఈవారం చికెన్ ప్రియులు పండగ చేసుకున్నారనే చెప్పాలి. చికెన్ బిర్యాని, చికెన్ కర్రీ ఆర్డర్లు కూడా ఈవారం బాగా పెరిగాయి. అయ్యప్ప భక్తుల సీజన్‌కావడంతో నగర జనం చికెన్ కొనడం లేదు.
దీంతో ఉత్పత్తి పెరగడంతో ధరలు కూడా తగ్గాయి. ఈ ఏడాదిలో అతి తక్కువ ధరలు ఈ వారం నమోదయినట్టు చికెన్ అమ్మకం దారులు చెబుతున్నారు. లైవ్ చికెన్ హోల్‌సేల్ ధర కిలో రూ.82 నుంచి రూ. 92 మధ్య ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రెండుకిలోల లైవ్ చికెన్ కొనుగోలు చేసినా దాని ద్వారా కిలోన్నర వరకూ స్కిన్ లెస్ చికెన్ లభిస్తుంది. దీంతో జనం లైవ్ చికెన్ కొనుగోలు వైపు మొగ్గుచూపుతున్నారు.
ఉత్పత్తికి సరిపడా అమ్మకాలు లేకపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇది పౌల్ట్రీ ఫారం రైతులకు అశనిపాతంగా మారింది. మేతల ధరలు పెరిగిపోవడం, వాతావరణం చల్లగా మారడంతో కోళ్ళకు వివిధ రకాల వ్యాధులు సోకుతున్నాయి. వాటిని కాపాడుకోవడానికే ఎక్కువగా ఖర్చుచేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. హైదరాబాద్ నగరంలో దీని లక్ష కిలోల వరకూ ఉంటుంది. ఇటీవలి కాలంలో చికెన్ అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. శ్రావణ మాసం ముగియడంతో పాటు అయ్యప్ప దీక్షలు ప్రారంభ, చలి తీవ్రత నేపథ్యంలో ఈ నెల మొదటివారం నుంచే చికెన్ వినియోగం బాగా తగ్గింది.
సాధారణ రోజుల్లో 100 కిలోల వ్యాపారం జరిగితే ఈవారంలో సగానికి సగం తగ్గిందని ఓ చికెన్ వ్యాపారి చెప్పారు. దీనిని బట్టి చూస్తే చికెన్ తినాలని తహతహలాడేవారికి ఇది మంచి సీజన్.
భర్త ట్రిపుల్ తలాక్.. తాంత్రికుడి అఘాయిత్యం
కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చినా అది సరిగా వర్కవుట్ కావడం లేదు. భర్తలు తమ భార్యలకు ముమ్మారు తలాక్ లు చెబుతూనే వున్నారు. ట్రిపుల్ తలాక్ చెప్పడమే కాదు ఓ భర్త చేసిన నిర్వాకం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
విడాకులు ఇచ్చిన భర్త అంగీకారంతో ఓ తాంత్రికుడు హలాలా పేరుతో మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన సంఘటన కలకలం రేపుతోంది.
బాధిత మహిళ ఫిర్యాదుతో ఆమె ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తతో పాటు తాంత్రికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భోపాల్ నగరంలోని అశోకా గార్డెన్లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
భర్త ట్రిపుల్ తలాక్ ఇవ్వడంతో తనకున్న ఇబ్బందుల్ని తాంత్రికుడికి వివరించిన పరిష్కారం అడుగుదామని ఆ మహిళ ప్రయత్నం చేసింది. అయితే తాంత్రికుడి కుటిల ఆలోచనతో భర్త అంగీకారంతో తాంత్రికుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఏప్రిల్‌లో వివాహం జరిగింది. వీరి దాంపత్యం కొన్నాళ్లపాటు బాగానే సాగింది. నవంబర్‌లో నిందితుడు మహిళకు విడాకులు ఇచ్చాడు. భార్యతో రాజీ ప్రయత్నంలో తాంత్రికుడిని ఆశ్రయించాడు.
ఆ దొంగ తాంత్రికుడు పూజల పేరిట బాధితురాలిని ఫ్లాట్‌కు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఐష్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి భర్తతో పాటు తాంత్రికుడిని అరెస్ట్ చేశారు. ఇలాంటి మోసగాళ్ళయిన తాంత్రికులను ఆశ్రయించవద్దని, ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసులకు తెలపాలని కోరుతున్నారు.
తిరుమలలో విషాదం..లారీకిందపడి వ్యక్తి ఆత్మహత్య
ఏడుకొండల స్వామి సన్నిధిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కదులుతున్న టీటీడీ పాల లారీ కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొలుత దీనిని ప్రమాదంగా భావించారు. శ్రీవారి ఆలయానికి సమీపంలోని మాఢ వీధిలో పాలు దించిన పాల మిత్ర లారీ ముందుకు కదులుతుండగా పక్కనే ఉన్న వ్యక్తి వెనుక చక్రాల కిందకు వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.
ఈ సంఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సీసీ ఫుటేజ్ చూశాక ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరణించిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. తిరుమల మాఢవీధిలో ఈ ఆత్మహత్య జరగడంతో వెంటనే ఆలయంలో శ్రీవారి దర్శనాలు నిలిపి వేశారు.
ఆలయ ఆగమ సలహాదారు రమణ దీక్షితులు సూచనతో ఆలయంలో శుద్ది కార్యక్రమం నిర్వహించి అనంతరం శ్రీవారి దర్శన భాగ్యం కలిగించారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఆరాతీస్తున్నారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమలలో ఇలాంటి సంఘటన జరగడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.6 కోట్ల బంగారం సీజ్
శంషా బాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్మగ్లర్లు అడ్డాగా మార్చుకుంటున్నారు. తాజాగా భారీ స్థాయిలో బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు అందిన సమాచారంతో 112 ఎల్లో మెటల్ బార్స్ లో దాచిన 99.5 స్వచ్ఛత కలిగిన బంగార కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల్లో పట్టుబడకుండా ఉండేందుకు ఈ బంగారు కడ్డీలకు నలుపురంగు టేప్ అతికించారు. వీటి బరువు మొత్తం 14 కేజీలు ఉంటుందని అంచనా. విలువ 6 కోట్ల పైమాటే. ఈ బంగారు కడ్డీలన్నీ 24 క్యారెట్లు.
దుబాయి నుంచి హైదరాబాద్ కు భారీగా బంగారు స్మగ్లింగ్ అవుతుందని సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ దుబాయి నుంచి ఇండియా రావడంతో అందులో సీట్ నెంబర్లు 31ఎ, 32ఎ కింద బంగారు కడ్డీలు వున్నాయని సమాచారం అందింది.
ఈ రెండు సీట్ల కింద నల్లని రంగు టేప్ లతో బంగారు కడ్డీలను అతికించారు. ఈ పైపుల చుట్టూ బంగారు కడ్డీలు వుంచారు.ఇంత పకడ్బందీగా స్మగ్లింగ్ చేసినా అడ్డంగా దొరికిపోయారు.
ఈ బంగారం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి విలువైన పత్రాలు లభించకపోవడం సీజ్ చేశారు. చైనాకు చెందిన వ్యక్తితో పాటు సౌత్ కొరియా జాతీయుడ్ని అరెస్ట్ చేశారు శంషాబాద్ పోలీసులు. స్మగ్లర్ తెలివితేటలకు డీఆర్ఐ అధికారులు అవాక్కయ్యారు.
భీమవరంలో దారుణం.. భార్య చేతిలో భర్త హత్య
ఈమధ్యకాలంలో మానవ సంబంధాల్లో హింస ఎక్కువగా కనిపిస్తోంది. తల్లి అడ్డొచ్చిందని చంపే కూతుళ్లు, వివాహేతర సంబంధానికి అడ్డు వచ్చిందని భార్యను చంపే భర్తలు, భార్యలు, డబ్బులివ్వలేదని తల్లిని చంపే కొడుకులు.. ఇలా హింస వివిధ రకాలుగా కనిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భర్తను భార్య హత్య చేయడం సంచలనం కలిగించింది. భర్త సత్యశర్మ ను గొంతు నులిమి చంపేసింది భార్య హేమ నాగమణి.
కాళ్ళకూరులో నర్సుగా పనిచేస్తున్న హేమనాగమణి వేధింపులు తాళలేక భర్తను హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మధ్యనే భీమవరంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.
హేమ నాగమణి-భర్త సత్య శర్మ మధ్య తరచూ విబేధాలు చోటుచేసుకున్నాయి. భర్త సత్య శర్మ ఇంటిదగ్గర ఖాళీగా ఉండడంతో భార్యపై అనుమానం పెంచుకున్నాడు.
భార్యను చీటికిమాటికీ వేధించడం భరించలేకపోయింది. భర్త వేధింపులు తట్టుకోలేక సత్య శర్మ గొంతు నులిమి చంపేసిం నాగమణి. భర్త చనిపోయాడు అని తెలిసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది నాగమణి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్తను తానే చంపానని ఒప్పుకుంది నాగమణి. ఈ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది.
ఉల్లి కష్టాలకు చెక్.. డీహైడ్రేట్ ఆనియన్స్ గురించి తెలుసా?
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొనకుండా, కోయకుండానే కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి. మార్కెట్లో ఉల్లి ధరలు రూ.150 వరకూ పలుకుతున్నాయి. ఉల్లిని కొనాలంటేనే వణికిపోతున్నారు జనం. అసలు ఉల్లి లేకుండా మనం ఏ కూర చేయలేం. బిర్యానీలో ఉల్లి పాయ ముక్కలు తింటే ఆ టేస్టే వేరు. ఉల్లిధరల నేపథ్యంలో బిర్యానీ సెంటర్లలో ఉల్లిని వాడడం లేదు. వాటి స్థానంలో కీర దోస వాడుతున్నారు. అంతేకాదు నిత్యం తినే ఉల్లి దోసెలో ఉల్లి మాయం అవుతోంది.
కేవలం మసాలా దోసె ఇస్తున్నారు హోటల్స్ వారు. ఇక పకోడీలకు చెల్లుచీటీ ఇచ్చేశారు. ఈఉల్లికి ప్రత్యామ్నాయం లేదా? ఉల్లి ధరలు ఎంత పెరుగుతుంటే.. కన్నీళ్ళు పెట్టుకుంటూ వాటిని కొనాల్సిందేనా? దీనికి పరిష్కారం లేదా? అంటే ఉందనే అంటున్నారు వ్యాపారులు.
డీ హైడ్రేట్ ఉల్లిముక్కలు
సూపర్ మార్కెట్లో డీ హైడ్రేట్ ఆనియన్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ వీటిని చాలా తక్కువమంది మాత్రమే వాడుతున్నారు. సరైన ప్రచారం లేకపోవడమే ఇందుకు కారణం. ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నప్పుడు దీని గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కానీ డీ హైడ్రేట్ ఉల్లి ముక్కల్ని అందరూ వాడుకోవచ్చు. వీటి ఖర్చు కూడా చాలా తక్కువ. ఇప్పుడున్న ధరలతో పోలీస్తే ఒక కేజీ ఉల్లిపాయల ఖర్చుతో 8-10 కేజీల డీ హైడ్రేటెడ్ ఆనియన్స్ దొరుకుతాయి.
పలు ఈ కామర్స్ వెబ్ సైట్స్ వీటిని విరివిగా విక్రయిస్తున్నాయి. పలు బ్రాండ్లు ఇందులో అందుబాటులోకి వచ్చాయి. రిటైల్ మార్కెట్లో ఇవి బాగా అమ్ముడవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా ఈ తరహా డీ హైడ్రేట్ ఆనియన్స్ ని ఆస్పత్రులు, స్టార్ హోటళ్ళలో వాడుతుంటారు. ఈ ఆనియన్స్ ని వెంటనే వండుకునే అవకాశం ఉంటుంది.
ఉల్లిపాయలు తొక్కతీయడం, కోయడం వంటివి అవసరం లేదు. మనం వండే కూరలో వీటిని తీసుకుని వేసుకోవడం ద్వారా కూర త్వరగా అయిపోతుంది. టేస్ట్ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. గుజరాత్ రాష్ట్రంలోని వివిధ సూపర్ మార్కెట్లలో ఇవి ఎక్కువగా వాడుతున్నారు.
గుజరాత్ లో డీ హైడ్రేషన్ ఆనియన్స్ తయారుచేసే కంపెనీలు 100కి పైగా వున్నాయి. దేశంలో మూడింట రెండువంతుల వ్యాపారం ఇక్కడినుంచే సాగుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ యూనిట్లు జనవరి-జూన్ మాసాలలో బాగా నడుస్తాయి. అప్పుడు దొరికే ఉల్లిపాయల్ని డీ హైడ్రైట్ చేసి కార్న్ ఫ్లేక్స్ తరహాలో ప్రాసెస్ చేస్తారు. అంతేకాదు ఉల్లిపాయల్ని పౌడర్ గా కూడా మారుస్తారు.
గుజరాత్ లో ఏటా 50 నుంచి 55 వేల టన్నుల డీ హైడ్రేట్ ఆనియన్స్ ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ వ్యాపారం లాభసాటిగా ఉందని మహువా కంపెనీ ఎండీ ఘనశ్యాం పటేల్ అంటున్నారు.
గుజరాత్ లో తయారయ్యే డీ హైడ్రేట్ ఆనియన్స్ లో 80 శాతం పైగా ఎగుమతులకే వెళ్లిపోతున్నాయి. మిగిలినవి మన దేశంలో అమ్ముతున్నారు. ఉల్లి ధరలు మండుతున్న తరుణంలో ధరలనుంచి ఉపశమనం కలగాలంటే డీ హైడ్రేట్ ఆనియన్స్ ఒక్కటే మార్గం అని సూచిస్తున్నారు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో డీ హైడ్రైట్ ఆనియన్స్ దొరికితే ఒకసారి మీరూ ట్రై చేయండి.
సజ్జనార్‌పై హత్య కేసు పెట్టాలని..ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు
డాక్టర్ దిశ కేసు, నిందితుల ఎన్ కౌంటర్ కి సంబంధించిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. దిశ కేసులో నిందితులను షాద్ నగర్ చటాన్ పల్లిలో ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రజలు, రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జాతీయ మానవహక్కుల సంఘం సీరియస్ అయింది. దీనిపై అన్ని విధాలుగా వాంగ్మూలాలు రికార్డు చేస్తోంది మానవ హక్కుల సంఘం.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ‘నేను సైతం’ అనే స్వచ్ఛంద సంస్థ పోలీసుల తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ సంస్థ అధినేత ప్రవీణ్ కుమార్.
ఈ కేసులో సీపీ సజ్జనార్‌తో పాటు నలుగురు పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితులను పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌తో పాటు నలుగురు పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలన్నారు.
ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదుపై రాచకొండ పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఈ ఎన్ కౌంటర్ పై జాతీయ మానవహక్కుల సంఘం విచారణ జరుపుతోంది. ఇటు సుప్రీంకోర్టు, హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి.
గద్వాల తాహశీల్దార్ ఆఫీసు ముందే రైతు ఆత్మహత్యాయత్నం
తెలంగాణలో రైతుల పరిస్థితులు మారుతున్నాయని భావించే వారికి ఇది షాకింగ్ న్యూసే. తాహశీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్ సమస్యలతో రైతులు ఆత్మహత్యలకు వెనుకాడడం లేదు. అబ్దుల్లాపూర్ మెట్ తాహశీల్దార్ విజయ రెడ్డి సజీవ దహనం ఘటన మరిచిపోకముందే.. తాహసీల్దార్ కార్యాలయాల వద్ద రైతులు ఆందోళన చేస్తూనే వున్నారు.
తెలంగాణలోని గద్వాలలో ఓ రైతు తాహశీల్దార్ కార్యాలయం ముందే పెట్రోల్ బాటిల్ తెచ్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడున్న రైతులు వారించడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన భూసమస్య పరిష్కరించడంలో అధికారుల వైఖరికి నిరసనగా రైతు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అధికారులపై కాకుండా తనపై తానే పెట్రోల్ పోసుకుని అందర్నీ షాక్ కు గురి చేశాడు. తాహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగలేక, విసుగు చెందిన రైతు శేఖర్ రెడ్డి తనతో పాటు పెట్రోల్ తెచ్చుకుని తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యకు యత్నించాడు.
తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను శరీరంపై పోసుకున్న రైతు శేఖర్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నం చెయ్యటంతో అక్కడి వారు వెంటనే అతన్ని నిలువరించారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అతడికి నచ్చచెప్పడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈఘటనపై స్పందించిన అధికారులు త్వరలో ఈ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
దుర్గమ్మ సన్నిధి ఇక ప్లాస్టిక్ ఫ్రీ
అమ్మలగన్నయమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ.. చాల పెద్దమ్మ దుర్గమ్మ సన్నిధిలో ప్లాస్టిక్ ఫ్రీ జోన్ చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించామని, భవానీలెవరూ కొండపైకి ప్లాస్టిక్ కవర్లను తీసుకురావద్దని దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు సూచిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణ కార్యక్రమం ఏటా వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది అనేక సౌకర్యాలు కల్పించామని సురేష్ బాబు చెప్పారు.
ఈ నెల 18 నుంచి 22 వరకు భవానీల దీక్షా విరమణ జరగనుంది. దీక్షా విరమణ రోజుల్లో తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఈవో తెలిపారు. అమ్మవారి దర్శనార్థం ఏడు లక్షల మంది భవానీలు వస్తారని అంచనా వేశామని, ఇది మరంత పెరిగినా వారికి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కలశ జ్యోతి మహోత్సవానికి జ్యోతుల ఊరేగింపునకు హాజరయ్యే భక్తులు ఘాట్ రోడ్డు మీదుగా కాకుండా కనకదుర్గా నగర్ మీదుగా రావాలన్నారు.
అమ్మవారి దర్శనార్థం వచ్చే భవానీల కోసం ఘాట్ రోడ్డు మీదుగా క్యూలైన్లతో పాటు గిరి ప్రదక్షిణ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో భవానీల కోసం మూడు హోమగుండాలను ఏర్పాటు చేశారు. అమ్మవారి ప్రసాదాలు కూడా చాలినన్నీ తయారుచేస్తున్నామని, భవానీలు ఆలయ సిబ్బందికి సహకరించాలన్నారు. భవానీలు ప్లాస్టిక్ కవర్లు తీసుకుని రావద్దని ఆలయ ఈవో కోరారు.

వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్..!
13-09-2019

జిమ్‌లో జారిపడ్డ దీపికా.. రణవీర్ చిలిపి సలహా?
15-05-2019

బిగ్ బ్రేకింగ్.. వైఎస్ వివేకా మాదిరే జగన్ హత్యకూ కుట్ర?!
11-10-2019

మళ్ళీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. చేతిపై జగన్ పేరుతో మెహిందీ
13-05-2019

‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ చించేసింది
14-05-2019

వాస్తవిక ఫలితాలకు అద్దం పట్టిన ‘న్యూస్ స్టింగ్’ ఆన్ లైన్ పోల్
29-05-2019

నయనతార క్రేజ్ తగ్గలేదుగా..!
20-05-2019

రకుల్ జిల్ జిల్.. అచ్చం సూపర్ మోడల్!
07-05-2019

మోడీని ఇంప్రెస్ చేసిన ఈ ‘స్పెషల్ ఫ్రెండ్’ ఎవరు?
23-07-2019