ప్రపంచంలోనే ధనికుడు ఎలాన్ మస్క్
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా మారారు. తొలి స్థానంలో ఉన్న అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ను దాటి ఎలాన్ మాస్క్ ముందుకు వెళ్ళాడు. ఎలాన్ మస్క్ కేవలం కార్ల సంస్థనే కాకుండా స్పేస్ ఎక్స్ పేరుతో రాకెట్ల తయారీ సంస్థతో పాటు, న్యూరాలింక్ అనే మరో సంస్థను కూడా స్థాపించారు. ఎప్పటికప్పుడు ఎలాన్ మస్క్ సంస్థల పేర్లు ప్రపంచంలో వినిపిస్తూనే వచ్చాయి. ఎలాన్ మస్క్ కొత్త కారు.. ఎలాన్ మస్క్ రాకెట్ లాంఛింగ్.. ఇలా చాలా విషయాల్లో మస్క్ పాపులారిటీ సంపాదించుకుంటూ వెళ్ళాడు. అలాగే అతడి సంస్థ కూడా ఎదుగుతూ వెళ్ళింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ఆధారంగా గురువారం టెస్లా షేర్ల ధర ప్రకారం.. ఎలాన్ మస్క్ సంపద విలువ ఏకంగా 188.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ సంపదతో పోలీస్తే 1.5 బిలియన్ డాలర్లు అధికం. గతేడాది ధనవంతుల జాబితాలో 35వ స్థానంలో ఉన్న మస్క్ ఏడాది కాలంలోనే మొదటి స్థానానికి చేరుకోవడం విశేషం. టెస్లా షేరు ధర గతేడాది ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగింది. 2020 నవంబర్ చివరిలో ఎలాన్ మస్క్ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలవగా, ఇప్పుడు కేవలం రెండు నెలల్లోనే మొదటి స్థానానికి చేరారు.
గురువారం నాడు టెస్లా సంస్థ ఈక్విటీ విలువ స్టాక్ మార్కెట్ లో 4.8 శాతం పెరగడంతో ఆయన ఆస్తుల విలువ అమాంతం పెరిగిపోయిందని బ్లూమ్ బర్గ్ తెలియజేసింది. మస్క్ ఆస్తుల విలువ 188.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. గడచిన ఏడాది వ్యవధిలో మస్క్ ఆస్తుల విలువ గణనీయంగా పెరిగింది. ఆయన ఆస్తుల విలువ గత సంవత్సరం ఏకంగా 150 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి. ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న భవిష్యత్, దీన్ని ముందుగానే గుర్తించి మరింత మైలేజ్, వేగాన్ని అందించే కార్లను టెస్లా తయారు చేస్తోంది. ఏడాది వ్యవధిలో టెస్లా కంపెనీ ఈక్విటీ ధర 734 శాతం పెరిగింది. నవంబర్ తరువాత పరిస్థితులు టెస్లాకు అనుకూలంగా మారాయి. డెమోక్రాట్లు జార్జియా సెనెట్ సీట్లను సొంతం చేసుకోవడం, బైడెన్ అధికారంలోకి రావడంతో సాధ్యమైనంత త్వరగా పెట్రోల్, డీజిల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను రీప్లేస్ చేయాలన్న ఆదేశాలు వస్తాయన్న అంచనాలతో టెస్లా విలువ మరింతగా పెరిగింది.
పెట్రోల్ బాదుడు మళ్లీ షురూ..ఎలెక్ట్రిక్ వాహనాలే దిక్కా..!
గత కొద్దిరోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలు మరో సారి పెరిగాయి. 29 రోజుల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రోజువారీ విధానంలో ఇంధన ధరల సవరణ చేస్తున్న చమురు కంపెనీలు సుదీర్ఘ విరామం తర్వాత తాజా ధరలను ప్రకటించాయి. లీటర్ పెట్రోల్ పై 26 పైసలు, లీటర్ డీజిల్ పై 25 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.97కి చేరింది. డీజిల్ ధర లీటర్ ఒక్కింటికి రూ.73.87 నుంచి రూ.74.12కి పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే... అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.19కి చేరగా, డీజిల్ ధర రూ.83.25కి పెరిగింది. హైదరాబాదులో పెట్రోల్ లీటర్ ధర రూ.87.34 కాగా, డీజిల్ ధర రూ.80.88కి చేరింది. విజయవాడలో పెట్రోల్ ధర 27 పైసలు పెరుగుదలతో రూ.89.71కు చేరింది. డీజిల్ ధర 27 పైసలు పెరుగుదలతో రూ.82.81కు ఎగసింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.45 శాతం పెరుగుదలతో 53.84 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.08 శాతం పెరుగుదలతో 49.97 డాలర్లకు ఎగసింది.
ఇక పెట్రోల్-డీజిల్ పోటు నుండి బయటపడాలంటే ఎలెక్ట్రిక్ వాహనాలే దిక్కు అని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే పలు దేశాల్లో పెట్రోల్-డీజిల్ వాహనాల కంటే ఎలెక్ట్రిక్ కార్ల మీదనే ప్రజలు మక్కువ చూపిస్తూ ఉన్నారు. 2025 నాటికి పూర్తిగా పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలను నిలిపివేసిన దేశంగా నిలువాలని నార్వే భావిస్తోంది. నార్వే ప్రజలు కూడా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. 2019తో పోలిస్తే 2020లో పెట్రోల్, డీజిల్ కార్ల కొనుగోళ్లు అక్కడ భారీగా తగ్గాయి. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను పెంచడానికి పూర్తిగా పన్ను రాయితీలిస్తుండడం కూడా ఆ దేశంలో ఎలెక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా కొనడానికి కారణం అయిందని చెబుతూ ఉన్నారు. భారత్ లో కూడా ప్రభుత్వాలు అలాంటి పద్ధతినే ఫాలో అవ్వాలని సూచిస్తూ ఉన్నారు.
5జీ స్పీడ్ మామూలుగా లేదు.. సెకనకు 700 ఎంబీల డౌన్ లోడ్
ప్రపంచంలో చాలా దేశాలు ఇంకా 5జి ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల కల్పనలోనే కొట్టుమిట్టాడుతుండగా గత సంవత్సరమే 5జీని ప్రవేశపెట్టిన దక్షిణ కొరియా వేగవంతమైన ఇంటర్నెట్ కల్పన విషయం తనకెవరూ పోటీ లేనివిధంగా ముందుకు దూసుకెళుతోంది. కరోనా కారణంగా కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ వీలైనంత త్వరగా 5జీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మన దేశంలో కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఇప్పటికే 5జీ ఇంటర్ నెట్ దక్షిణ కొరియాలో అందుబాటులో ఉంది.
తాజా నివేదికల ప్రకారం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో 5జీ వినియోగం రోజు రోజుకి పెరుగుతున్నట్లు తెలుస్తుంది. 2020 రెండో అర్ధ భాగంలో ఎస్కె టెలికాం, కెటి కార్ప్, ఎల్జి అప్లస్ కార్ప్ నెట్వర్క్ యొక్క 5జీ హై-స్పీడ్ ఇంటర్నెట్ డౌన్లోడ్ వేగం 690.47 ఎంబిపిఎస్‌గా ఉంది. అదే తొలి ఆరు నెలల కాలంలో డౌన్లోడ్ వేగం 33.91 ఎంబీపీఎస్‌గా నమోదవగా.. ఆ వేగం ఇప్పుడు ఇరవై రెట్లకు పైగా పెరిగింది.
దీనికి సంబంధించి దక్షిణ కొరియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్, ఐసీటీ గణాంకాలు వెల్లడించాయి. ఆ దేశంలోని మూడు ప్రధాన మొబైల్ నెట్ వర్క్ లైన ఎస్కె టెలికాం 5జీ ఇంటర్ నెట్ డౌన్లోడ్ వేగం 795.57 ఎమ్‌బిపిఎస్, కెటి 667.48 ఎమ్‌బిపిఎస్, ఎల్జి అప్లస్ 608.49 ఎమ్‌బిపిఎస్ వద్ద ఉన్నాయి. అలాగే ఆ దేశంలో 4జీ ఎల్‌టిఇ డౌన్లోడ్ వేగం 153.1 ఎమ్‌బిపిఎస్‌గా ఉంది.
4జీ ఎల్‌టిఇ వేగం కంటే 5జీ ఇంటర్ నెట్ స్పీడ్ నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అక్కడి యోన్హాప్ వార్తా సంస్థ నివేదించింది. గత ఏడాది ఏప్రిల్‌లోనే 5జీని మొట్టమొదటి సారిగా కమర్షయలైజ్ చేసిన దేశం దక్షిణ కొరియానే. అలాగే అక్టోబర్ చివరి నాటికి దాదాపు 10 మిలియన్ల 5జీ యూజర్ నెట్ వర్క్ ను త్వరగా నిర్మించింది. దక్షిణ కొరియా దేశంలోని మొత్తం 70 మిలియన్ల మొబైల్ చందాదారుల వాటాలో 14 శాతం 5జీ చందాదారులే.
కానీ 5జి అమలులోకి వచ్చిన మొదట్లో సాంకేతిక లోపం, లిమిటెడ్ కవరేజ్, క్వాలిటీ సమస్యలు, ఇంటర్ నెట్ స్పీడ్ 4జీ కంటే తక్కువగా ఉండటంతో మొదట్లో వినియోగదారులు ఎవరు ఆసక్తి చూపలేదు. అయితే ఈ సమస్యలన్నింటిని అక్కడి ప్రభుత్వ సహాయంతో టెలికాం నెట్ వర్క్ లు పరిష్కారించాయి.
దీంతో అక్కడి 5జీ వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోయింది. 2022 నాటికల్లా దేశవ్యాప్తంగా 5జీ కవరేజీని అందించాలని లక్ష్యంగా దక్షిణ కొరియా పెట్టుకుంది. దీనికోసం అక్కడి ప్రముఖ టెలీకాం సంస్థలు 5జీ నెట్వర్క్ కోసం 25.7ట్రిలియన్ అంటే 24 బిలియన్ డాలర్లను ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
భారత్‌లో కూడా ఈ ఏడాది రెండో అర్ధభాగంలో 5జీ నెట్‌వర్క్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ఆ తర్వాత తమ స్మార్ట్ పోన్లన్నిటినీ 5జీ ప్రాతిపదికనే నిర్మిస్తామని సంస్థ పేర్కొంది.
ఫౌజీ ట్రైలర్ వచ్చేసింది.. గేమ్ వచ్చేదెప్పుడంటే..!
మొబైల్ ఫోన్ లో ఒకానొకప్పుడు పబ్ జీ గేమ్ ను విపరీతంగా ఆడేశారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గేమ్ ను ఆడేశారనుకోండి. అయితే అది కూడా చైనా వాసనలు ఉన్న యాప్ కావడంతో భారత ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసింది. పబ్ జీ గేమ్ కు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే పలు గేమ్స్ వచ్చాయి. కానీ పబ్జీ స్థాయికి చేరుకోలేకపోయాయి. ఆ స్థాయికి చేరుకోబోయే గేమ్ ఒకటే ఒకటని. అది 'ఫౌజీ' గేమ్ అని అంటూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ గేమ్ వస్తుందా అని గేమింగ్ ప్రియులు ఎదురుచూస్తూ ఉన్న తరుణంలో ఓ గుడ్ న్యూస్.. ఎన్కోర్ గేమ్స్ సంస్థ 'ఫౌజీ' గేమ్ ను రూపొందీస్తోంది.. దేశీయ ఎన్కోర్ గేమ్స్ సంస్థ ‘మేడ్ ఇన్ ఇండియా’ 'ఫౌజీ' గేమ్ ను జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
అందుకు సంబంధించిన ట్రైలర్ కూడా వైరల్ అవుతూ ఉంది. భారతీయ సైనికులు లడఖ్ లో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ దళాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దృశ్యాలతో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ గేమ్ యొక్క మొదటి టీజర్ గత సంవత్సరం దసరా రోజున విడుదలైంది. టీజర్ లో కేవలం పోరాటానికి సంబందించిన సమాచారాన్ని మాత్రమే పంచుకుంది.. ఆయుధాలు వంటి చాలా విషయాలను చెప్పలేదు. ట్రైలర్లో టైటిల్ ట్రాక్ ‘'ఫౌజీ'’ పేరుతో బాగా రూపొందించారు.
2020 డిసెంబర్లో గేమ్ కోసం ఫ్రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు.కేవలం 24 గంటల్లో ఒక మిలియన్ ప్రీ-రిజిస్ట్రేషన్లతో రికార్డు సృష్టించింది. పబ్జి గేమ్ మాదిరిగా కాకుండా 'ఫౌజీ' గేమ్ నిజమైన యుద్ధ సన్నివేశాల అనుభూతిని కలిగిస్తుందని సంస్థ చెబుతూ ఉంది. ఈ గేమ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కావడం విశేషం. భారతీయ వినియోగదారుల కోసమే ఈ గేమ్ ను రూపొందించినట్లు సంస్థ చెబుతోంది. పబ్జీ లాగానే ఫౌజీ కూడా హిట్ అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. పబ్జీ కూడా రాను రానూ మంచి పేరును సంపాదించుకుంది. యూజర్లకు ఎటువంటి కిక్ ఇవ్వాలో అలాంటి ఎన్నో అంశాలను ఎప్పటికప్పుడు గేమ్ లో యాడ్ చేస్తూ వెళ్ళింది. ‘'ఫౌజీ'’ కూడా అదే తరహాలోనే వెళ్తే మాత్రమే అనుకున్న స్థాయికి చేరుకుంటుంది.
వర్క్ ఫ్రం హోంతో జియోకు లాభాల పంట
కరోనా నేపథ్యంలో వర్క్ ప్రమ్ హోమ్ పనివిధానం అటు కంపెనీలకు, ఇటు ఉద్యోగులకు కూడా ఉభయతారకంగా ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తున్న కంపెనీలు ఈ వర్క్ ప్రమ్ హోమ్ ద్వారా లాభాల పంటను పోగు చేసుకుంటున్నట్లు తాజా సమాచారం. దీంట్లో కూడా గరిష్ట లాభం పొందుతోంది జియో బ్రాడ్ బ్యాండ్ మాత్రమేనని కొత్తగా తెలియవచ్చింది.
తక్కిన ప్రపంచంతోపాటు భారత దేశంలోను గత 10 నెలలుగా వర్క్ ఫ్రం హోం సంప్రదాయం నడుస్తోంది. కరోనా భయంతో అధిక శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కేబుల్ బ్రాడ్‌బ్యాండ్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే.. దీని కారణంగా అత్యధికంగా లాభపడ్డది మాత్రం జియో బ్రాడ్బ్యాండేనని ట్రాయ్ గణాంకాలు చెబుతున్నాయి.
గత ఆరు నెలల్లో జియో బ్రాడ్ బ్యాండ్ సంస్థ ఏకంగా 8 లక్షల మంది కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లను చేర్చుకుందని తాజాగా వెల్లడైంది. జియోకు ప్రధాన పోటీదారైన ఎయిర్టెల్ మాత్రం కేవలం 2.30 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లనే చేర్చుకోగలిగింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ప్రభుత్వ రంగం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఎయిర్ టెల్కు సమానంగా దాదాపు 2.20 లక్షల కొత్త వినియోగదారులను పొందింది.
ట్రాయ్ గణాంకాల ప్రకారం..ఏప్రిల్‌లో జియో కేబుల్ బ్రాడ్ బ్యాండ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 0.90 మిలియన్లు కాగా.. ఆక్టోబర్ నాటికి ఈ సంఖ్య అమాంతం 1.10 మిలియన్లకు చేరుకుంది. అతి తక్కువ ధరల్లో జియో అందిస్తున్న ప్యాకేజీలే ఈ దూకుడుకు కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం భారత్‌లో కనిపిస్తున్న ఇంటర్నెట్ విప్లవం అధిక శాతం మొబైల్ ఫోన్ల వినియోగం ద్వారానే జరుగుతోంది. దేశంలో కేబుల్ బ్రాడ్ బ్యాండ్ సబ్స్క్రైబర్ల సంఖ్య కేవలం 2.1 కోట్లే. మొబైల్ కనెక్షన్ల సంఖ్య మాత్రం ఏకంగా 70 కోట్లు. అయితే..ప్రస్తుత మున్న వర్క్ ఫ్రం హోం సంప్రదాయం కారణంగా కేబుల్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులా.. ఈ విషయం గమనించండి..!
పట్టణం నుండి పల్లె దాకా ప్రస్తుతం డిజిటల్ ట్రాన్సాక్షన్ పద్ధతులను ఉపయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే ల ద్వారా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా పలు యూపీఐ యాప్ లు ప్రజలకు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. పెద్ద పెద్ద సంస్థలు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ యాప్స్ లోకి అడుగుపెడుతూ ఉన్నాయి. చిన్న వ్యాపారస్తుల నుంచి మొదలుకుని ప్రతి ఒక్కరు గూగుల్ పే, ఫోన్ పే తో సహా థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్ ద్వారా లావాదేవీలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ డబ్బు ఉండడం కంటే.. ఇలా ఆన్ లైన్ యాప్స్ ద్వారా డబ్బు చెల్లిద్దామని అనుకుంటూ ఉన్నారు.
ఇక ఇటీవలే ఈ లావాదేవీలపై జనవరి 1 నుంచి అదనపు చార్జీలు వర్తిస్తాయని ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారం మొత్తం అబద్ధం అని తాజాగా తేలింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ లావాదేవీలు నిర్వహించే వారికి యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. దీని ద్వారా గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిపే వారికి కొంచెం ఊరటనిచ్చే అంశమే..! యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎప్పటి లాగానే నిర్వహించుకోవచ్చని చెబుతోంది.
తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, యూజర్ ల నుంచి ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేసేది లేదని తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే, ఎన్పీసీఐ థర్డ్ పార్టీ యాప్స్‌పై జనవరి 1 నుంచి అదనపు చార్జీలు విధించే అవకాశం ఉందనే వార్తలు పటాపంచలయ్యాయి. ఇంతకు ముందు ఎలా లావాదేవీలు జరుగుతుండేవో అలాగే యూజర్లు ట్రాన్సాక్షన్ జరుపుకోవచ్చు.
డిజిటల్ యుగంలో యూపీఐ యాప్స్ మధ్య కూడా పోటీ విపరీతంగా సాగుతోంది. తమ యాప్స్ ను ఉపయోగిస్తే క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లను అందిస్తామని పలు యాప్స్ సంస్థలు చెబుతూ ఉన్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే.. యూపీఐ పేమెంట్స్ యాప్స్ లో ముందు వరసలో ఉన్నాయి.
భారత్ లో లాంఛ్ అయిన అమెజాన్ బేసిక్స్ ఫైర్ టీవీ
అమెజాన్ బేసిక్స్ నుండి భారత్ లో మొట్టమొదటి టీవీ విడుదల అయింది. అమెజాన్ బేసిక్స్ నుండి ఇప్పటికే వస్తువులు, ఫ్యాషన్ కు చెందినవి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్ బేసిక్స్ భారత్ లో మొట్టమొదటి టీవీని లాంఛ్ చేసింది. ఇది రెండు రకాల సైజుల్లో లభ్యం కానుంది. 55, 50 ఇంచీల టీవీలకు 4కె రెజెల్యూషన్ ఉంది. అమెజాన్ బేసిక్స్ టీవీ ఇప్పటికే అమెజాన్ సైట్ లో కొనుక్కోడానికి అందుబాటులో ఉంది.
అమెజాన్ బేసిక్స్ ఫైర్ టీవీ ఎడిషన్: ధర వివరాలు
అమెజాన్ బేసిక్స్ తెలివిజన్స్ భారత్ లో 55, 50 ఇంచీల సైజ్ లో టీవీని విడుదల చేసింది. 50 ఇంచెస్ టీవీ ధర 29,999 రూపాయలు కాగా.. 55 ఇంచీల టీవీ ధరను 34999 రూపాయలుగా నిర్ణయించారు. ఈ రెండు టీవీలను అమెజాన్ ఇండియా వెబ్సైట్ లో కొనుక్కోవచ్చు.
అమెజాన్ బేసిక్స్ ఫైర్ టీవీ ప్రత్యేకతలు:
అమెజాన్ టీవీలను రెండు సైజ్ లలో విడుదల చేసినప్పటికీ అల్ట్రా హెచ్డీ(3840x2160-పిక్సెల్) ఎల్ఈడీ స్క్రీన్స్ తో తీసుకుని వచ్చాయి. డాల్బీ విజన్ సపోర్ట్, హెచ్.డి.ఆర్. సపోర్ట్ తో ఈ టీవీలను రూపొందించారు. టీవీల రీఫ్రెష్ రేట్ 60hz కాగా వైడ్ వ్యూవ్ యాంగిల్ ను 178 డిగ్రీలుగా తెలిపారు. టీవీలో 20W స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా చేయగలవు.
ఈ టీవీ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో తీసుకుని వచ్చారు. అందువలన టీవీ చూడడంలో ప్రత్యేక అనుభూతి లభిస్తుందట. అల్ట్రా బ్రైట్ స్క్రీన్ అమ్లాజిక్ నైన్త్ జనరేషన్ ఇమేజింగ్ ఇంజిన్ తో తీసుకుని వచ్చారు. టీవీ 1.9 గిగా హెడ్జెస్ క్వాడ్ కోర్ అంలోజిక్ 9థ్ జెనరేషన్ ఇమేజింగ్ ఇంజిన్ ప్రాసెసర్ ఉంది. హెచ్.డి.ఎం.ఐ. 2.0 పోర్ట్స్ మూడు ఉన్నాయి. యు.యస్.బి. 3.0, యు.ఎస్.బి. 2. పోర్ట్స్ ద్వారా హార్డ్ డ్రైవ్స్, యు.ఎస్.బి. డివైజ్ లను కనెక్ట్ చేసుకోవచ్చు. ఐఆర్ పోర్ట్ ద్వారా సౌండ్ బార్లు, రిసీవర్లు, సెట్ టాప్ బాక్స్ లను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక ఈ టీవీ ద్వారా పలు ఓటీటీ యాప్స్ ను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ అమెజాన్, యూట్యూబ్, 5000 ప్లస్ యాప్స్ ను యాక్సెస్ చేయొచ్చు.
రిలయన్స్ జియో.. అలా మంచి ఆఫర్ తో..!
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. డేటా వినియోగదారులను టార్గెట్ చేసుకుని మార్కెట్ లోకి వచ్చిన జియో సంచలన ఆఫర్లతో భారత్ టెలీకాం రంగంలో దూసుకుపోతోంది. తాజాగా జియో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తన వినియోగదారుల కోసం ఇతర్ నెట్‌వర్క్‌కు ఫ్రీ వాయిల్స్ కాల్స్‌ను తిరిగి అందించనివ్వనుంది. జనవరి 1, 2021 నుండి జియో మరోసారి తన నెట్‌వర్క్‌లో ఆఫ్-నెట్ డొమెస్టిక్ వాయిస్ కాల్స్‌ను ఉచితంగా అందిస్తామని తాజాగా ప్రకటించింది.
టెలికాం రెగ్యులేటర్ ఆదేశాల ప్రకారం, జనవరి 1, 2021 నుండి దేశంలో 'బిల్ అండ్ కీప్' విధానం అమల్లోకి వస్తుండడంతో జియో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై జియో చందారులు దేశంలోని ఏమొబైల్ నెట్‌వర్క్‌కైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ నిమిషానికి 6 పైసలు వసూలు చేసేది. జియో టు జియో ఉచిత కాలింగ్ సదుపాయాలను అందిస్తున్న రిలయన్స్ జియో గత ఏడాది దేశీయంగా ఇతర నెట్వర్క్ వాయిస్ కాల్స్‌కు ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జీలు వసూలు చేస్తూ వచ్చింది.
ఇంటర్నెట్ ను ఎక్కువగా వాడే వారికోసం విఐ(వోడాఫోన్ ఐడియా) కూడా ప్రీపెయిడ్ చందాదారుల కోసం వార్షిక రూ.1,499 ప్లాన్‌తో 50 జీబీ అదనపు డేటాను అందిస్తోంది. ఈ అదనపు డేటా అనేది ఎంపిక చేసిన సర్కిల్లలోని వినియోగదారులకు లభిస్తుంది అని విఐ పేర్కొంది. ఈ డేటా తమకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి వోడాఫోన్ ఐడియా యూజర్లు విఐ యొక్క అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ ని సందర్శించాలని తెలిపింది. వోడాఫోన్ ఐడియా రూ.1,499 వార్షిక ప్రణాళిక కింద 24జీబీ హై-స్పీడ్ డేటా మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు ఎంపిక చేసిన యూజర్లకు 50జీబీ డేటా కలుపుకొని మొత్తం 75జీబీ లభిస్తుంది. ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్ లను పొందవచ్చు. అలాగే పాపులర్ వెబ్ సిరీస్, టీవీ షోలు, సినిమాలు, లైవ్ టీవీ ఛానళ్లకు ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు.
అతి తక్కువ ధరకు నోకియా 2.4 మొబైల్ ఫోన్
నోకియా 2.4 మొబైల్ ఫోన్ భారత్ లో ఇటీవలే లాంఛ్ చేశారు. 10399 పరుగులకు ఈ మొబైల్ ఫోన్ ను తీసుకుని వచ్చారు. ధర అందుబాటులో ఉన్నప్పటికీ రియల్ మీ, రెడ్ మీ మొబైల్ ఫోన్లలో ఇదే ధరకు మంచి ఫీచర్లు లభిస్తూ ఉన్నాయని పెదవి విరిచేవారు ఎక్కువగా ఉన్నాయి. ఈ మొబైల్ ఫోన్ ధర భారీగా తగ్గింది. నోకియా 2.4 మొబైల్ ఫోన్ మీద 1399 డిస్కౌంట్ ను పేటీఎం ఇవ్వనుంది. ఇక క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉండడంతో 7000 రూపాయలకే ఈ మొబైల్ ఫోన్ లభించనుంది.
ప్రస్తుతం నోకియా 2.4 మొబైల్ ఫోన్ లాంఛ్ చేసిన ధర 10399 రూపాయలు. కానీ పేటీఎంలో 9999 రూపాయలకు అందుబాటులో ఉంది. ఎస్.బి.ఐ. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను ఉపయోగించడం వలన 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. అంటే 999 రూపాయలు ఈ మొబైల్ ఫోన్ విషయంలో డిస్కౌంట్ ఇవ్వనున్నారు. కాబట్టి 9000 రూపాయలకు మొబైల్ లభించనుంది. ఇక ఇంతకంటే తక్కువ ధరకు మనకు మొబైల్ ఫోన్ దక్కాలంటే FESTIVESHOPNOW అనే ప్రోమో కోడ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. పేటీఎం క్యాష్ 1000 రూపాయలు వెనక్కు రానుంది. 1000 రూపాయల విలువగల పేటీఎం మాల్ ఓచర్ లభిస్తుంది. అలా చూస్తే మొబైల్ ఫోన్ 7000 రూపాయలకు లభించనున్నట్లే..! నోకియా 2.4 మొబైల్ ఫోన్ అతి తక్కువ ధరకు మీరు సొంతం చేసుకోవచ్చు.
నోకియా 2.4 లో 6.5 ఇంచ్ డిస్ప్లే కలదు. మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్ ఉంది. బడ్జెట్ ఫోన్ కు తగ్గట్టుగా మొబైల్ ఫోన్ డిజైన్ కూడా ఉంది. వాటర్ డ్రాప్ స్టైల్ నాట్చ్ డిస్ప్లే ఉంది. 3 జీబీ ర్యామ్ తో ఈ మొబైల్ ఫోన్ లభించనుంది. 64జీబీ మెమరీతో వచ్చిన ఈ మొబైల్ ఫోన్ మెమరీని మైక్రో ఎస్.డీ. కార్డు సహాయంతో పెంచుకోవచ్చు. 13 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సార్ తో పాటూ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ మొబైల్ ఫోన్ పని చేయనుంది.
కేఆర్ఐడిఎన్ బైక్.. టాప్ స్పీడ్ 95 కిలోమీటర్లు
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే ఎలెక్ట్రిక్ వాహనాలను తప్పకుండా వాడాల్సి ఉంటుంది. రాబోయే కాలంలో ప్రభుత్వాలే డీజిల్, పెట్రోల్ వాహనాలను బంద్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎన్నో కంపెనీలు ప్రస్తుతం ఎలెక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే 'టెస్లా' కంపెనీ సృష్టిస్తున్న సంచలనాల గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది. మరిన్ని ప్రముఖ కంపెనీలు కూడా ఎలెక్ట్రిక్ వాహనాలను తీసుకుని వచ్చాయి.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ కంపెనీ అయిన వన్ ఎలక్ట్రిక్ తన 'కేఆర్ఐడిఎన్' ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులో డెలివరీలను ప్రారంభించారు. 2021 జనవరి చివరి నాటికి తమిళనాడు, కేరళలో ఎలక్ట్రిక్ వెహికల్ ని అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తోంది. ఈ బైక్ కేవలం 8 సెకన్లలో 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని సంస్థ చెబుతోంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 95 కెఎంపిహెచ్. ఈ ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎకో మోడ్‌లో 110 కిలోమీటర్లు, సాధారణ మోడ్‌లో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. మోటారు సైకిల్‌కు డిజిటల్ ఓడోమీటర్‌తో పాటు జిపిఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. 5.5 కిలోవాట్ లేదా 7.4 బీహెచ్ పీతో వస్తుంది.
80/100 17 అంగుళాల ట్యూబ్ లెస్ ఫ్రంట్ వీల్, 120/80 16 అంగుళాల ట్యూబ్ లెస్ రియర్ వీల్ ఉండనుంది. ఈ బైక్ 240 మిమీ డిస్క్, వెనుకవైపు 220 ఎంఎం డిస్క్ తో పాటు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం కూడా ఉంది. ఫ్రంట్ లో బైక్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ , వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి.
మహారాష్ట్ర, ఢిల్లీ లో డెలివరీల కోసం సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మోటారు సైకిల్ ధర1.29 లక్షలు(ఎక్స్-షోరూమ్). సంస్కృతంలో కేఆర్ఐడిఎన్ అంటే 'ఆడటం' అని అర్థం. ఎలెక్ట్రిక్ బైక్ లను కొనాలి అనుకుంటున్న వాళ్లకు ఈ బైక్ మంచి ఆప్షన్ అని ఆటో మొబైల్ నిపుణులు చెబుతూ ఉన్నారు.
భారతదేశం మీద చైనా-పాకిస్థాన్ లు డ్రోన్లతో చెక్ పెట్టబోతున్నాయా..?
భారతదేశానికి పక్కనే ఉన్న చైనా-పాకిస్థాన్ లు చేస్తున్న దుశ్చర్యలు అన్నీ-ఇన్నీ కావు. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ఓ వైపు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండగా.. భారత్ లోకి తీవ్ర వాదులను పంపి ప్రశాంతత లేకుండా చేయాలనేది పాకిస్థాన్ పన్నాగం. ఇక భారత్ కు వ్యతిరేక చర్యల్లో చైనా-పాకిస్థాన్ లు ఎప్పుడూ పాల్గొంటూ ఉంటాయి. ఎలాగైనా భారత్ ను దెబ్బ కొట్టాలన్నది పాకిస్థాన్ ప్లాన్..! అందుకు చైనా సపోర్ట్ ఎలాగూ ఉంది. తాజాగా పాకిస్థాన్ కు డ్రోన్ల విషయంలో చైనా అండగా నిలిచింది.. ఇక అందుకు తగ్గట్టుగా చైనా మీడియా కూడా ఆహా.. ఓహో గొప్ప డీల్ అంటూ చంకలు గుద్దుకుంటూ ఉంది.
ఇంతకూ పాక్ కు చైనాకు మధ్య జరిగిన డీల్ ఏమిటంటే.. పాకిస్థాన్ కు 50 సాయుధ డ్రోన్ లను అందించడానికి చైనా సిద్ధమవుతోంది. ఈ డ్రోన్లన్నీ పూర్తిగా ఆయుధాలను తమతో మోసుకెళ్లగలవని, వీటిని త్వరలో పాక్‌కు అందించేస్తున్నారట. చైనా అభివృద్ధి చేసిన వింగ్ లూంగ్-2 డ్రోన్లు పూర్తి సాయుధ టెక్నాలజీతో పనిచేస్తాయని.. పూర్తి స్థాయిలో ఆయుధాలను మోసుకెళ్లి నిర్దిష్ట ప్రాంతంలో జారవిడిచే కెపాసిటీ వీటికి ఉంది. ఈ డీల్ ద్వారా పాక్ భారత్ ను తీవ్ర ఇబ్బందులు పెట్టొచ్చని చైనా మీడియా సంచలన ప్రకటన చేసింది. భారత మిలటరీ ఈ డ్రోన్లను ఎదుర్కోలేదని.. లిబియా, సిరియా, అజర్బైజాన్ ఘర్షణల్లో సాంప్రదాయ యుద్ధాన్ని నమ్ముకున్న ప్రత్యర్థులను ఈ డ్రోన్లు తీవ్రంగా దెబ్బతీశాయని గుర్తు చేశారు. ఇలాంటి డ్రోన్లు చైనా, టర్కీ వద్ద మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు పాక్ కూడా ఆ లిస్టు లోకి చేరబోతోందని చెప్పుకొచ్చింది చైనా మీడియా.
చైనా మీడియా వ్యాఖ్యలకు భారత్ అదిరిపోయే కౌంటర్ ను ఇచ్చింది. డ్రోన్లు తయారు చేసింది చైనా కదా.. అవి పని చేస్తాయో లేదో చూసుకోవాలని సూచించింది. చైనా డ్రోన్లు పనిచేస్తాయో లేదో ఒకసారి పరీక్షించుకోవాలని భారత్ కౌంటర్ ఇచ్చింది. తమకు పట్టున్న ప్రాతంలో మాత్రమే డ్రోన్లతో దాడి చేయవచ్చని.. ఎక్కడికైనా వెళ్లి దాడి చేయడం సాధ్యం కాదని భారత్ వివరించి చెప్పింది. ఆఫ్ఘన్ గగనతలంపై పట్టు ఉండడం వల్లే అమెరికా ఉగ్రవాదులపై, వారి స్థావరాలపై దాడులు చేయగలుగుతుందని.. సరిహద్దుల వద్ద భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి దాడులకు చైనా లేదా పాకిస్థాన్‌కు అంత సీన్ లేదని చెప్పింది. పాకిస్థాన్, చైనా సరిహద్దులోని భారత రాడార్లు, యుద్ధ విమానాల అనుక్షణం నిఘా ఉంటాయని, వాటిని దాటుకుని లోనికి రావడం చైనా యుద్ధవిమానాలకు కూడా సాధ్యం కాదని వివరించింది.
లక్ష కోట్ల నిమిషాలకుపైగా వీడియో కాల్స్
వీడియో కాల్స్.. ఈ మధ్య కాలంలో నార్మల్ కాల్స్ కంటే వీడియో కాల్స్ ఎక్కువైపోయాయి. చిన్న చిన్న వాటికి కూడా వీడియో కాల్స్ నే ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక పిల్లోల్ల క్లాస్ లకూ.. లాక్ డౌన్ లో ఎక్కడో ఉండిపోయిన సన్నిహితులు, స్నేహితులతో సంభాషించాలని అనుకున్నా కూడా వీడియో కాల్స్ నే వాడారు. అందులో భాగంగా చాలా యాప్స్ నే ఉపయోగించారు అందరూ..! ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా లక్ష కోట్ల నిమిషాలకుపైగా వీడియో కాల్స్ మాట్లాడారని చెబుతూ ఉన్నారు. ఇది అన్ని వీడియో కాలింగ్ యాప్స్ ద్వారా మాట్లాడిన సమయం కాదు. అదీ ఒక్క గూగుల్ లోనే అట..! ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ వెల్లడించింది.
ఒక్క ఏడాదిలో అది 1,800 కోట్ల గంటలకు సమానం. గూగుల్ డ్యుయో, గూగుల్ మీట్ సేవలను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఈ విధంగా ఉపయోగించుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నుంచి జీమెయిల్ తో అనుసంధానమై గూగుల్ మీట్ సేవలను ఉచితంగా పొందొచ్చని సంస్థ తెలిపింది. కొత్తగా మీట్ ట్యాబ్ ను జీమెయిల్ లో తీసుకుని వచ్చారు. నెస్ట్ హబ్ మ్యాక్స్, క్రోమ్ క్యాస్ట్ లలోనూ మీట్ ను అందుబాటులోకి తెచ్చారు. హ్యాండ్స్ ఫ్రీ కాల్స్ మాట్లాడుకోవచ్చని గూగుల్ డ్యుయో, మీట్ ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ డేవ్ సిట్రాన్ చెప్పారు. గోప్యత, భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని.. ప్రతి ఒక్కరి సమాచారం రహస్యంగానే ఉంటుందన్నారు. రోజూ గూగుల్ లో సగటున 10 కోట్ల మంది కొత్త వినియోగదారులు చేరుతున్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రికార్డు స్థాయిలో రోజూ 23.5 కోట్ల మంది కొత్త వినియోగదారులు అందులో నమోదయ్యారు.
జూమ్ కాల్స్ కు పోటీగా తీసుకుని వచ్చిన గూగుల్ మీట్ కూడా బాగా హిట్ అయ్యింది. ఇక జూమ్ లో సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని.. డేటా ను లీక్ చేశారని కూడా కథనాలు రావడంతో చాలా మంది గూగుల్ కు షిఫ్ట్ అయిపోయారు. అందుకే అంత ఎక్కువగా గూగుల్ లో వీడియో కాల్ సదుపాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వినియోగించుకున్నారు.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ
06-07-2020

రహస్యంగా కాజల్ ఎంగేజ్ మెంట్? ఎవరితోనో తెలుసా?
24-08-2020

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?
10-08-2020

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్
09-08-2020

హైదరాబాద్‌లో బాంబు పేలుడు.. కార్లు, బస్సుల అద్దాలు ధ్వంసం
21-08-2020

నారా లోకేశ్ కి విడదల రజనీ షాక్
28-10-2020

ఏంటి రజనీ మేడమ్.. అసలు కథ అదేనా
30-10-2020

అప్పుడలా.. ఇప్పుడిలా..! విడదల రజినీ ఇంతలా మారిపోయారా..?
04-07-2020

విజయసాయి రెడ్డికి ఇష్టం లేని పని జరగబోతోందా?
24-07-2020