రెండేళ్లు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్.. జియో సంచలన ఆఫర్
టెలికాం రంగంలో జియో సృష్టిస్తున్న అద్భుతాలు అంతా ఇంతా కాదు..! ఒక్కసారిగా భారత్ టెలికాం రంగంలోకి జియో ఎంట్రీతో మొత్తం మారిపోయింది. ఎంతో కాస్ట్లీగా ఉన్న డేటా వినియోగం కాస్తా చాలా తక్కువకు వచ్చేసింది. ఎక్కువ రోజులు ఈ ఆఫర్లను కొనసాగించలేము అని చెప్పిన ఇతర టెలికాం కంపెనీలు కూడా జియో బాట పడ్డాయి. జియోకు పోటీగా ఆఫర్లను ప్రకటించాయి. అంతేకాకుండా జియో కంటే తక్కువకే ఆఫర్లను ఇచ్చిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఇదంతా తమ వినియోగదారులను కాపాడుకోవడానికి చేసిన పనులే..! అయినప్పటికీ వినియోగదారులను ఆకర్షిస్తూ జియో దూసుకువెళుతోంది. తాజాగా మరో ఆఫర్ ను జియో తన వినియోగదారులకు అందిస్తోంది.
తాజాగా మరో బంపరాఫర్ ను ప్రకటించి ఇతర టెల్కోలకు షాక్ ఇచ్చింది జియో. అతి త్వరలోనే తాము రూ.1,999 ధరలో కొత్త మొబైల్ ఫోన్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించింది. ఆ ఫోన్ కొనుగోలు చేసేవారికి రెండు సంవత్సరాల పాటు ఉచిత కాల్స్ ఇస్తామని చెప్పింది. నెలకు 2 గిగాబైట్ల డేటాను ఉచితంగా వాడుకోవచ్చని, రెండేళ్లలో మొత్తం 48 జీబీ డేటాను పొందవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో రూ. 1,499 ధరలో మరో ఫోన్ ను విడుదల చేస్తున్నామని, ఈ ఫోన్ తో ఏడాది పాటు అపరిమిత కాల్స్, నెలకు 2 జీబీ డేటాను పొందవచ్చని పేర్కొంది. ఇక ఇప్పటికే జియో అందిస్తున్న ఫీచర్ ఫోన్ ను వాడుతున్న వినియోగదారులు, రూ. 749తో రీచార్జ్ చేసుకుంటే, రెండేళ్లు అమలులో ఉండే ఇవే ఆఫర్లు పొందవచ్చు.
జియోకి వరుస షాక్ లు ఇస్తున్న ఎయిర్ టెల్
కొత్త జియో ఫోన్‌తో పాటు రెండేళ్ల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, అన్లిమిటెడ్ డాటా(నెలకు 2 జీబీ)ని కలుపుకుని కేవలం 1999 రూపాయలకే అందించనుంది. ఈ ఆఫర్‌ను పొందిన వినియోగదారులు రెండేళ్ల పాటు ఫోన్ రిఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 4జీ టెక్నాలజీ అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలోనే ఇంకా 30 కోట్ల మంది వినియోగదారులు 2జీ టెక్నాలజీని వినియోగిస్తున్నారని.. 5జీ టెక్నాలజీ రాబోయే సమయంలో 30 కోట్ల మంది ఇంకా సరైన ఇంటర్నెట్ సర్వీసులు వినియోగించుకోలేని 2జీ టెక్నాలజీ మొబైల్ సర్వీసులనే వాడుతున్నారని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ అంబానీ అన్నారు. అందుకోసమే తాము ఈ సరికొత్త ఆఫర్ ను తీసుకొని వచ్చామని తెలిపారు.
ఓటీటీల విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
భారతదేశంలో ఓటీటీలకు ఆదరణ ఇటీవలి కాలంలో బాగా పెరుగుతూ ఉంది. చాలా వరకూ బోల్డ్ కంటెంట్ తో పాటూ కొత్త రకమైన కంటెంట్ ఓటీటీలలో చూడొచ్చు. ఇక సినిమాలు థియేటర్లలో ఆడిన కొన్ని రోజులకే ఓటీటీలలో విడుదలవుతూ ఉండడం నిర్మాతలకు కూడా కలిసి వచ్చే అంశమే..! తాజాగా ఓటీటీల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలను తీసుకుని వచ్చింది. అయితే అది ఓటీటీల సెన్సార్ షిప్ కిందకు రాదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
దేశంలో ఓటీటీలు, డిజిటల్ మీడియా కంటెంట్ నియంత్రణకు కేంద్రం కొత్త నియమనిబంధనలు తీసుకురాగా.. ఈ నేపథ్యంలో, కేంద్రం తన మార్గదర్శకాలపై మరింత స్పష్టతనిచ్చింది. ఓటీటీలపై సినిమాల తరహాలో సెన్సార్ షిప్ ఉండదని వెల్లడించింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ ఖారే మాట్లాడుతూ ఓటీటీలు, డిజిటల్ మీడియాను క్రమబద్ధీకరించే క్రమంలో మూడు విస్తృత లక్ష్యాలనునిర్దేశించుకున్నట్టు తెలిపారు. వివిధ రకాల మీడియాలు ఒకదానికొకటి విరుద్ధమని, అన్నిటికీ ఒకే తరహా ప్రమాణాలు లేకపోయినప్పటికీ సారూప్యతలు ఉండాలని అన్నారు.
ఓటీటీ వేదికలపై ప్రసారమయ్యే కంటెంట్ కు సంబంధించి సినిమాల తరహాలో సెన్సార్ షిప్ ఉండదని, ఆ కంటెంట్ కు సంబంధించి సదరు ఓటీటీ వేదిక నుంచి ఓ స్వీయ వర్గీకరణ ఉంటుందని ఆయన తెలిపారు. వయసును ప్రమాణంగా చేసుకుని సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఓటీటీల చేతులలో ఉండనుంది. ఆ కంటెంట్ ను ఏ వయసుల వారు చూడొచ్చు అనేది ఆ ఓటీటీ వేదిక వర్గీకరించి తెలియజేయాలని అన్నారు. ఆ కంటెంట్ యూనివర్సల్ లేదా ఏడేళ్లకు పైన, 13 ఏళ్లకు పైన, 16 ఏళ్లకు పైబడిన వారు చూసేదా? లేక పెద్దల చిత్రమా? అన్నది ఓటీటీ వేదికలే వర్గీకరించాలని స్పష్టం చేశారు. ఆ కంటెంట్ ను చూసే ప్రేక్షకుడికి సమాచారంతో కూడిన ఎంపికకు అవకాశం ఉండాలన్నది తమ ఆలోచన అని ఖారే తెలిపారు. ఓటీటీలను కూడా సెన్సార్ చేయబోతున్నారు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఒకే ఒక్క ట్వీట్ లక్ష కోట్లు ఆవిరయ్యేలా చేసింది..!
స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ కు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే..! ఆయన చేసే ట్వీట్ల ద్వారా కొన్ని కంపెనీలు ఏకంగా రాత్రి రాత్రే లాభాలను ఆర్జించేశాయి. ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లిపోయాయి. కొద్దిరోజుల కిందట వాట్సాప్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఎలాన్ మస్క్ జస్ట్ 'సిగ్నల్' యాప్ ను ఉపయోగించండి అంటూ ఓ ట్వీట్ చేశాడు.
ఇక ఆ కంపెనీ షేర్స్ ఎప్పుడూ చూడని స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచం మొత్తం సిగ్నల్ యాప్ గురించి మాట్లాడేసుకుంది. అంత ప్రాముఖ్యత ఉంటుంది ఎలాన్ మస్క్ ట్వీట్ కు..! ఒక్కోసారి ఆయన చేసిన ట్వీట్లు ఆయన సంపద ఆవిరయ్యేలా చేస్తుంటాయి. అలాగని ఆయన సైలెంట్ గా ఉంటారంటే అది కూడా లేదు. సంపద ఎంత పోయినా.. నా తీరు మార్చుకోను అంటుంటారు.
కొద్దిరోజుల కిందటి వరకూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న ఎలాన్ మస్క్, తన ట్వీట్ల ద్వారా తాజాగా లక్ష కోట్లకు పైగానే నష్టపోయారు. తాజాగా చేసిన ట్వీట్ కారణంగా అమెరికా మార్కెట్లో టెస్లా ఈక్విటీ విలువ ఏకంగా 8.6 శాతం పడిపోయింది. దీంతో ఎలాన్ మస్క్ నికర ఆస్తి విలువ రూ. 1.10 లక్షల కోట్లు (సుమారు 15.2 బిలియన్ డాలర్లు) తగ్గిపోయింది. బిట్ కాయిన్ విలువ రోజురోజుకూ పెరుగుతూ, 50 వేల డాలర్లకు చేరగా, తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన మస్క్, "బిట్ కాయిన్, ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా కనిపిస్తోంది" అని ట్వీట్ చేశారు.
ఎలాన్ మస్క్ ఇటీవల బిట్ కాయిన్ లో భారీ పెట్టుబడులు పెట్టారని తెలియడంతో టెస్లా ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దీంతో సంస్థ ఈక్విటీ విలువ పడిపోయింది. త్వరలో బిట్ కాయిన్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న మస్క్, 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేశారు. దీంతో టెస్లా ఈక్విటీ షేర్ ధర భారీగా తగ్గిపోయింది. అయినా ఒక్క ట్వీట్ కు లక్ష కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోవడం ఏంటి..? అని పలువురు మాట్లాడుకుంటూ ఉన్నారు.
చంద్రయాన్-3 వాయిదా
ఇస్రో ఎన్నో అద్భుతాలను ఇటీవలి కాలంలో సృష్టిస్తున్న సంగతి తెలిసిందే..! ఒక ప్రయోగం తర్వాత మరో ప్రయోగం.. ఇలా ఎంతో మంచి సక్సెస్ రేట్ తో ఇస్రో దూసుకుని వెళ్తోంది. రాబోయే కాలంలో మరెన్నో అద్భుతాలు సృష్టించాలని ఇస్రో ప్రణాళికలు సృష్టిస్తోంది. తాజాగా చంద్రునిపైకి మూడో మిషన్ ప్రయోగం చంద్రయాన్–3ని 2022లో ప్రయోగించే అవకాశముందని ఇస్రో చీఫ్ కె.శివన్ తెలిపారు.
కోవిడ్–19 లాక్డౌన్ కారణంగా ఇస్రో చేపట్టాల్సిన చంద్రయాన్–3 వంటి పలు ప్రాజెక్టులు వాయిదా పడ్డాయని తెలిపారు. వాస్తవానికి చంద్రయాన్–3ని 2020 చివర్లో ప్రయోగించాల్సి ఉండగా.. చంద్రయాన్–2లో ప్రయోగించిన ఆర్బిటర్‌నే చంద్రయాన్–3లో ఉపయోగిస్తామన్నారు. 2019లో చంద్ర యాన్–2 మిషన్‌లో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగడంలో విఫలమైంది. దీంతో ఈసారి మాత్రం ఎటువంటి తప్పు జరగకుండా ఇస్రో ప్రణాళికలు రచిస్తూ ఉంది. 2019లో నిర్వహించిన చంద్రయాన్-2 విఫలమైన నేపథ్యంలో, లోటుపాట్లను దిద్దుకుని ముందుకు వెళతామని వివరించారు. 2020లోనే చంద్రయాన్-3 నిర్వహించాల్సి ఉన్నా, కరోనా మహమ్మారి వ్యాప్తి ఇస్రో ప్రణాళికలకు విఘాతం కలిగించింది. కరోనా వ్యాప్తి కారణంగా చంద్రయాన్-3 మాత్రమే కాకుండా, మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కూడా వాయిదా పడిందని శివన్ వెల్లడించారు. ఈ ప్రయోగాలను 2022లో చేపడతామని చెప్పారు.
ఇస్రో భవిష్యత్తులో చేపట్టే గ్రహాంతర ప్రయోగాలకు చంద్రయాన్–3 కీలకం కానుంది. గత ఏడాది డిసెంబర్లో చేపట్టాల్సిన మొట్టమొదటి మానవ రహిత గగన్‌యాన్ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబర్లో చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీని తర్వాత, మరో మానవ రహిత మిషన్ ప్రయోగం ఉంటుం దని, మూడో విడతలో ప్రధాన ప్రయోగం చేపడతామన్నారు. గగన్‌యాన్ ద్వారా 2022లో ముగ్గురు భారతీయులను అంతరిక్షం లోకి పంపనున్నారు. ఇందుకుగాను ఎంపికైన ముగ్గురు పైలట్లు ప్రస్తుతం రష్యాలో శిక్షణ పొందుతున్నారు. మూడో విడత ప్రయోగించే గగన్‌యాన్ మాడ్యూల్‌కు ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంటుందన్నారు. అందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు. భారత ప్రజలు మాత్రమే కాకుండా.. ప్రపంచం మొత్తం ఈ ప్రయోగాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాయి.
వాట్సాప్ కు పోటీగా సందేశ్.. క్లిక్ అయ్యేనా..?
ఇటీవలి కాలంలో ఎవరు మెసేజీలు చేసుకోవాలని అనుకున్నా కూడా వాట్సాప్ నే వాడుతూ ఉన్నారు. ఆ మధ్య ప్రైవసీ విషయంలో వాట్సాప్ మీద పెద్ద ఎత్తున వివాదాలు చుట్టుముట్టినా కూడా ఎప్పటికప్పుడు క్లారిటీ చేసుకుంటూ వస్తోంది. ఇక ఇటీవలి కాలంలో భారత్ కూడా విదేశీ యాప్స్ మీద ఆధారపడకూడదని భావిస్తూ ఉంది. అందుకే వాట్సాప్ కు పోటీగా సందేశ్ యాప్ ను సాధారణ ప్రజల కోసం తీసుకుని వచ్చింది భారత ప్రభుత్వం. ప్రభుత్వ విభాగాల మధ్య సమాచార మార్పిడికి ఉద్దేశించిన సందేశ్ యాప్ ను కేంద్ర ప్రభుత్వం ఇకపై సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. గతంలో దీన్ని జిమ్స్ అని పిలిచేవాళ్లు. జిమ్స్ అంటే గవర్నమెంట్ ఇన్ స్టాంట్ మెసేజింగ్ సిస్టమ్ అని అర్థం. దీన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధి చేసింది.
జిమ్స్ యాప్ లో పలుమార్పులు చేసిన ఎన్ఐసీ సందేశ్ గా మార్చి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. సందేశ్ యాప్ ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు పోటీ ఇస్తుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే నేరుగా జిమ్స్ వెబ్ సైట్ కు వెళ్లి దానికి సంబంధించిన ఏపీకేని ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఓఎస్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబరు సాయంతో సందేశ్ యాప్ లో ఖాతా ప్రారంభించి సేవలు పొందవచ్చు. ప్రభుత్వ అధికారిక మెయిల్ ఐడీలు ఉన్నవాళ్లు మాత్రమే మెయిల్ ఐడీ సాయంతో సందేశ్ ఖాతాలు ప్రారంభించవచ్చు.
జీమెయిల్, యాహూ వంటి ప్రైవేటు డొమైన్ మెయిల్ ఐడీలకు సందేశ్ యాప్ అనుమతి ఉండదు. వాట్సాప్ అందించే సేవలన్నింటిని సందేశ్ అందిస్తుందని అధికారులు తెలిపారు. ఇక ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ భద్రత కూడా కల్పిస్తున్నారు. త్వరలోనే కేంద్రం సంవాద్ అనే మరో మెసేజింగ్ యాప్ ను కూడా తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. న్యూస్ ఫీడ్, మల్టీ యూజర్ చాట్ సెషన్స్, ప్రైవేటు సోషల్ నెట్వర్కింగ్ వంటి అదనపు ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. స్వదేశీ యాప్ లనే వీలైనంత ఎక్కువగా ఉపయోగించాలని భారత ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగానే పలు యాప్ లను దేశీయంగా తీసుకుని వస్తోంది.
మార్స్ గ్రహంపై నాసా రోవర్.. ఆపరేషన్ లీడ్‌గా స్వాతి మోహన్
అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లకు సంబంధించిన నమూనాలను సేకరించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపించిన పర్సవరన్స్ రోవర్ ఈ శుక్రవారం అంగారక గ్రహంపై దిగనుంది. కాగా ఈ రోవర్ ప్రయోగంలో అత్యంత కీలక పాత్ర పోషించింది భారత సంతతి అమెరికన్ మహిళ స్వాతి మోహన్ కావడంతో ఆమె పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వస్తే పెర్సీ అనే ముద్దు పేరున్న ఈ పర్సవరన్స్ అంగారకగ్రహంపైకి నాసా పంపిస్తున్న అతిపెద్ద, అత్యాధునిక రోవర్. ఇది మార్స్ గ్రహంలోని రాళ్లు, మట్టి తదితరాలను సేకరిస్తుంది. అంగారక గ్రహంపై ఉన్న పురాతన నదీ పరివాహక ప్రాంతంగా భావిస్తున్న ప్రదేశంలో ఈ రోవర్ దిగనుంది. ఒకవేళ ఈ అరుణ గ్రహంపై జీవం ఉండి ఉంటే 300–400 కోట్ల ఏళ్లకు ముందు ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.
ఈ పెర్సీ రోవర్ 7 అడుగుల లోతు వరకు తవ్వి, రాళ్లు, మట్టి, ఇతర పదార్ధాలను సేకరించగలదు. ఈ శాంపిల్స్‌ను ట్యూబ్స్‌లో భద్రపరిచి, అక్కడే ఉంచుతుంది. తరువాత పంపించే మరో రోవర్ ఆ సాంపిల్స్‌ను మరో వ్యోమనౌక ద్వారా భూమికి తీసుకువస్తుంది. అంటే, ఈ నమూనాలు భూమిని చేరేందుకు మరో పదేళ్లు పడుతుంది.
స్వాతి మోహన్ ఆపరేషన్స్ లీడ్..
భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి మోహన్ నాసా తాజా రోవర్ ప్రయోగంలో కీలక బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ‘మార్స్ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్ కంట్రోల్స్(జీఎన్ అండ్ సీ)కి ఆమె ఆపరేషన్స్ లీడ్‌గా నాయకత్వం వహిస్తున్నారు. మొత్తం ప్రయోగంలో లీడ్ సిస్టమ్ ఇంజినీర్‌గానూ కీలకంగా ఉన్నారు. మిషన్ కంట్రోల్ స్టాఫ్‌కు విధుల కేటాయింపు, మిషన్ కంట్రోల్ రూమ్‌లో పాటించే విధివిధానాల రూపకల్పన తదితర బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
‘జీఎన్ అండ్ సీ’సబ్ సిస్టమ్స్‌కి, ప్రయోగంలో పాలు పంచుకుంటున్న ఇతర బృందాలకు స్వాతి మోహన్ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. మొత్తం ప్రయోగానికి జీఎన్ అండ్ సీ అత్యంత కీలకమైన విభాగం. ఈ మిషన్‌కు కళ్లు, చెవులు ఈ విభాగమే.
గూగుల్ కు షాక్ ఇచ్చేలా ఇస్రో మ్యాప్స్
ఒక మార్స్ సంవత్సర కాలంపాటు ఈ రోవర్ అంగారక గ్రహంపై గడుపుతుంది. మార్స్ గ్రహంపై సంవత్సర కాలం అంటే భూమిపై రెండేళ్ల కాలం అన్నమాట. అత్యంత పురాతనమైన సూక్ష్మ జీవి ఉనికికి సంబంధించిన సంకేతాలను కనిపెట్టడమే ఈ రోవర్ లక్ష్యం.
ఏడాది ప్రాయంలో భారత్ నుంచి అమెరికాకు కుటుంబంతోపాటు వలస వెళ్లిన డాక్టర్ స్వామి మోహన్ ఉత్తర వర్జీనియా-వాషింగ్టన్ డీసీలో పెరిగి, తర్వాత కార్నెల్ యూనివర్సిటీలో మెకానికల్, ఏరోస్పేసే ఇంజనీరింగ్‌లో డిగ్రీ పుచ్చుకున్నారు. ఎమ్ఐటీ ఏరోనాటిక్స్ అస్ట్రో నాటిక్స్ నుంచి ఎమ్మెస్, పీహెచ్‌డీని సాధించారు. కేసిని (శనిగ్రహంపైకి ఉపగ్రహం), గ్రెయిల్ (చంద్రుడిపై దిగిన ఉపగ్రహం) వంటి పలు విధాలైన ఉపగ్రహ ప్రయోగాలపై ఆమె పనిచేశారు. ఈ మార్స్ 2020 ప్రయోగం 2013లో ప్రారంభమైనప్పటి నుంచి డాక్టర్ స్వాతి మోహన్ ఇందులో పాలుపంచుకుంటున్నారు. ప్రస్తుతం నాసా జెట్ ప్రొపల్సన్ లాబరేటరీలో పనిచేస్తున్నారు.
తొమ్మిదేళ్ల ప్రాయంలో తొలిసారిగా స్టార్ ట్రెక్ సినిమా చూసిన స్వాతి విశ్వంలోని నూతన ప్రాంతాలను ఆ సినిమా చూపించిన చిత్రణకు నివ్వెరపోయారు. అప్పటినుంచే విశ్వం లోని నూతన, సుందరమైన ప్రాంతాలను కనుగొనాలని తలిచారు. అంతరిక్ష ప్రయోగాలపై తనకున్న ఆసక్తిని నెరవేర్చుకోవాలంటే ఇంజనీరింగ్ చదువేమార్గమని నిర్ణయించుకున్నారు.
వార్తలు షేర్ చేయకుండా ఫేస్ బుక్ సంచలన నిర్ణయం
చెప్పినట్లుగానే ఫేస్ బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాలో వార్తలు షేర్ చేయకుండా కఠిన నిర్ణయం తీసుకుంది ఫేస్ బుక్ సంస్థ. గురువారం ఉదయం నుంచి న్యూస్ ఫీడ్ ను బ్లాక్ చేసేస్తోంది ఫేస్ బుక్ సంస్థ. వార్తలు షేర్ చేస్తే సంబంధిత మీడియా సంస్థలకు సోషల్ మీడియా సైట్లు చెల్లింపులు చేయాలన్న ఆ దేశ కొత్త చట్టం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్ బుక్ వెల్లడించింది.
ఈ ప్రభావం మీడియా సంస్థల మీద మాత్రమే కాకుండా అగ్నిమాపక విభాగం, ఆరోగ్య శాఖ, వాతావరణ శాఖతో పాటు పలు అత్యవసర సేవలకు సంబంధించి వార్తా సమాచారం ఆగిపోయింది. ఆయా విభాగాలు, ప్రజలు అత్యవసర సేవల పేజీల్లో వార్తలను ఎలా బ్లాక్ చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఫేస్ బుక్ చర్యపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. వార్తలు షేర్ కాకుండా బ్లాక్ చేయడం ప్రమాదకర సంకేతమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అధికారిక గ్రూపులనూ వార్తల విషయంలో బ్లాక్ చేయడం వల్ల.. తప్పుడు వార్తల బెడద పెరిగిపోయే ప్రమాదముందని మీడియా సంస్థలు, ఆస్ట్రేలియా ప్రభుత్వం మండిపడ్డాయి. పేజీలను బ్లాక్ చేసేముందు ఫేస్ బుక్ బాగా ఆలోచించుకోవాల్సిందని ఆ దేశ సమాచార శాఖ మంత్రి పాల్ ఫ్లెచర్ అన్నారు. మీడియా సంస్థల పేజీలనూ బ్లాక్ చేయడం చాలా తప్పు అని అన్నారు. ఫేస్ బుక్ స్పందిస్తూ ప్రభుత్వ పేజీలకు ఎలాంటి అంతరాయం ఉండదని.. వాటిపై పడబోదని స్పష్టతనిచ్చింది. ఫేస్ బుక్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.
చట్టంలో చాలా లోపాలున్నాయని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫేస్ బుక్ మేనేజర్ విలియం ఈస్టన్ అన్నారు. వినియోగదారులతో సంబంధాలపై నిజానిజాలను మరచి చట్టాలను పాటించాలా? లేక యూజర్లు వార్తలు షేర్ చేయకుండా బ్లాక్ చేయాలా? అన్న దానిపై ఎంతగానో ఆలోచించామని, చివరకు దురదృష్టవశాత్తూ రెండో దానికే కట్టుబడ్డామని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలోని వార్తా కథనాలకు సంబంధించి ఆయా వార్తాసంస్థలకు ఫేస్బుక్, గూగుల్ డబ్బులు చెల్లించేలా ఆ దేశం కొత్త చట్టం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. దీనిని ఫేస్బుక్, గూగుల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత డిసెంబరులో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టగా.. సెనెట్ ఎకనమిక్స్ లెజిస్టేషన్ కమిటీ ఎలాంటి మార్పులు అవసరం లేదని నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో వార్తలను షేర్ చేయడాన్ని ఫేస్బుక్ నిషేధించింది.
సంచలన ఆఫర్ ను తీసుకుని వచ్చిన వీఐ
టెలికాం ఆపరేటర్ల మధ్య ఇటీవలి కాలంలో భారీ పోటీ ఉన్న సంగతి తెలిసిందే..! వినియోగదారులను కోల్పోకుండా ఉండేందుకు ఎన్నెన్నో ప్రణాళికలు రచిస్తూ వస్తున్నారు. జియో, ఎయిర్ టెల్ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తూ ఉండగా.. తాజాగా వొడాఫోన్ ఐడియా (వీఐ) ఓ సంచలన ఆఫర్ ను తీసుకుని వచ్చింది. వినియోగదారుల సంఖ్యను పెంచే ప్రయత్నంలో యూజర్ల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ప్రిపెయిడ్ కస్టమర్లకు రాత్రి సమయంలో అపరిమిత డేటా ఉచితంగా ఆఫర్ చేస్తోంది. రూ.249 ఆపైన అన్లిమిటెడ్ డెయిలీ డేటా రీచార్జ్‌లకు ఇది వర్తిస్తుంది. రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వినియోగదార్లు ఉచిత డేటాను వాడుకోవచ్చు. రోజువారీ మిగిలిన డేటాను వారాంతంలో వాడుకునే వెసులుబాటునూ కల్పిస్తోంది.
వొడాఫోన్ ఐడియా వంద కన్నా తక్కువ ధరలకు రూ.49, రూ.59, రూ.65, రూ.79, రూ.85 కు రీఛార్జ్ ప్లాన్లు అందిస్తోంది. వీటికి 28 రోజుల టాక్ టైమ్ లభిస్తుంది. 400 MB డేటా సైతం వినియోగదారులకు అందిస్తుంది. విఐ రూ.98 రీఛార్జ్ ప్లాన్‌లో డ్యూయల్ డేటా ఆఫర్ సైతం పొందవచ్చు. 28 రోజులు వ్యాలిడిటీతో 12GB డేటాను ఉపయోగించుకుంటారు.
వొడాఫోన్ ఐడియా రూ.218 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 6 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ బేసిక్ యాక్సెస్ లభిస్తుంది. వొడాఫోన్ ఐడియా రూ.219 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ బేసిక్ యాక్సెస్ లభిస్తుంది. వొడాఫోన్ ఐడియా యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 2జీబీ డేటా అదనంగా లభిస్తుంది.
వొడాఫోన్ ఐడియా రూ.248 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 8జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ క్లాసిక్ యాక్సెస్ లభిస్తుంది.
వొడాఫోన్ ఐడియా రూ.249 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ క్లాసిక్ యాక్సెస్ లభిస్తుంది. వొడాఫోన్ ఐడియా యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 5జీబీ డేటా అదనంగా లభిస్తుంది. రోల్ ఓవర్ డేటా వర్తిస్తుంది. అంటే వారంలో మొదటి 5 రోజుల్లో ఉపయోగించని డేటాను శని, ఆదివారాలు ఉపయోగించుకోవచ్చు.
పౌరుల గోప్యత అంటే అంత చిన్నచూపా.. వాట్సాప్‌పై సుప్రీంకోర్టు ధ్వజం
ఇతర దేశాల ప్రజలతో పోలిస్తే భారత పౌరుల గోప్యత పట్ల చిన్నచూపు చూస్తున్నారని పిటిషన్లు వస్తున్నాయి. మీ సమాధానమేంటి అంటూ సుప్రీంకోర్టు సామాజిక మాధ్యమమైన వాట్సాప్, దాని మాతృసంస్థ పేస్బుక్లను సుప్రీంకోర్టు నిలదీసింది. ఏ దేశంలోనైనా ప్రజలు లక్షల కోట్ల డబ్బుకంటే తమ వ్యక్తిగత గోప్యతకే ప్రాధాన్యమిస్తారని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇటీవల వాట్సాప్ ప్రకటించిన నూతన గోప్యతా విధానం దేశ ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును హరించి వేస్తోందని తక్షణం దానిపై స్టే విధంచాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. ఈ సందర్బంగా వాట్సాప్‌పై, దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
మీది 2–3 ట్రిలియన్ డాలర్ల కంపెనీ అయితే అయ్యుండొచ్చు. కానీ ప్రజలు డబ్బుకన్నా వారి సమాచార గోప్యతకే అధిక ప్రాధాన్యతనిస్తారని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పైగా ప్రజల ప్రైవసీని పరిరక్షించే బాధ్యత న్యాయస్థానాలపై ఉందని స్పష్టం చేసింది. అంతేకాకుండా పౌరుల వ్యక్తిగత డేటా గోప్యతపై సమాధానమివ్వాల్సిందిగా కేంద్రం, వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ ఏడాది జనవరిలో వాట్సాప్ కొత్త పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. వాట్సాప్ తన యూజర్ల బిజినెస్ సంభాషణలను ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకుంటుంది. ఈ కొత్త పాలసీని అంగీకరించకపోతే ఫిబ్రవరి 8 నుంచి వారి మొబైల్స్‌లో వాట్సాప్ పని చేయదని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై యూజర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల తమ వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుంతుదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కర్మన్య సింగ్ సరీన్, మరికొందరు కొత్త ప్రైవసీ పాలసీపై స్టే విధించాల్సిందిగా కోరతూ సుప్రీం కోర్టును కోరారు.
ఈ అభ్యర్థన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బోబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. మీ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల తమ గోప్యతకు భంగం వాటిల్లుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాము ఎవరో ఒకరికి పంపిన సందేశాలను వాట్సాప్, ఫేస్‌బుక్‌తో పంచుకోవడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రైవసీని కాపాడటం కోసం మేం తప్పక జోక్యం చేసుకుంటామని చీఫ్ జస్టిస్ ఎస్ఎ బాబ్డే తెలిపారు. ఈ సందర్భంగానే సోషల్ మీడియా దిగ్గజాలు వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీది బిలియన్, ట్రిలియన్ డాలర్ల విలువ చేసే కంపెనీ కావొచ్చు. కానీ ప్రజల వ్యక్తిగత గోప్యత అంతకన్నా విలువైనది. దానిని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది అని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇతరులతో తమ సంభాషణలని, తమ డేటాని, వాట్సాప్ కంపెనీ ఎవరితోనైనా షేర్ చేస్తే తమ వ్యక్తిగత గోప్యతకు నష్టం వాటిల్లుతుందేమోనని భారత పౌరులు భయపడుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని కోర్టు స్పష్టం చేసింది. నూతన గోప్యతా విధానాన్ని అమలుచేస్తే, ప్రజల ప్రైవసీని పరిరక్షించేందుకు తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ సుబ్రమణియన్‌ల ధర్మాసనం వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు నోటీసులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వానికీ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై స్పందించేందుకు 4 వారాల సమయాన్ని కోర్టు మంజూరు చేసింది.
వాట్సాప్ గోప్యతా విధానంపై పౌరులకు సందేహాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..ఇది దేశానికి సంబంధించిన సమస్య అని, వినియోగదారుల సమాచారాన్ని షేర్ చేసేందుకు ససేమిరా ఒప్పుకునే ప్రసక్తే లేదు అని కోర్టుకి చెప్పారు. వాట్సాప్ భారత చట్టాలను అనుసరించలేదని మెహతా ఆరోపించారు.
వాట్సాప్ పేమెంట్స్ .. ఆ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న వాట్సాప్
వాట్సాప్ ను వెంటాడుతూ ఉన్న ప్రైవసీ వివాదాలు
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్, దానికి చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మీది రెండు లేదా మూడు ట్రిలియన్ డాలర్ల సంస్థ కావచ్చు... కానీ మీకంటే ప్రజలు వారి గోప్యతకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలో ఇటీవల ప్రవేశపెట్టిన నూతన గోప్యతా విధానంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో సుప్రీం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజల గోప్యతను కాపాడటం తమ బాధ్యత అని స్పష్టం చేసింది. గోప్యత లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పుకొచ్చింది ధర్మాసనం. ఎవరికైనా మెసేజ్ పంపితే అది ఫేస్ బుక్ కు అందుబాటులో ఉంటోందని ప్రజలు అనుకుంటున్నారని.. ఇలాంటి ఎన్నో అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మీ సంస్థకు ఉందని తెలిపింది.
ఇక ఫేస్ బుక్, వాట్సాప్ తరపున ప్రముఖ లాయర్ కపిల్ సిబాల్ వాదించారు. నూతన గోప్యతా విధానం వల్ల యూజర్ల సమాచారం బయటకు వెళ్లదని అన్నారు. ప్రైవసీపై యూరప్ లో ఒక ప్రత్యేక చట్టం ఉందని, భారత్ కూడా అలాంటి చట్టాలనే తీసుకొస్తే, దాన్ని అనుసరించడం జరుగుతుందని చెప్పారు. ఫేస్ బుక్, వాట్సాప్ లు ఒకరి మెసేజీలను చూసే అవకాశమే లేదని కోర్టుకు వివరించారు కపిల్ సిబాల్.
నూతన ప్రైవసీ పాలసీ యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రతకు వ్యతిరేకంగా ఉందని వచ్చిన వ్యాఖ్యలపై వాట్సాప్ మాతృసంస్థ ఫేస్ బుక్ కొద్దిరోజుల కిందట కూడా వివరణ ఇచ్చింది. ఫేస్ బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ ఓ కార్యక్రమంలో వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించి మాట్లాడారు. ప్రైవసీ పాలసీపై తాము మరికొంచెం వివరణాత్మకంగా చెబితే బాగుండేదని.. వ్యక్తిగత సమాచారం ఎన్ క్రిప్షన్ చేయడంలో వాట్సాప్ నిబద్ధతను ఎవరూ అనుమానించలేరని అన్నారు. తామేమీ యూజర్ల సందేశాలను చదవబోమని, ఏ ఒక్కరి సందేశాలను తాము వీక్షించబోమని స్పష్టం చేశారు. ఇతరులెవ్వరూ కూడా యూజర్ల సందేశాల్లోకి తొంగి చూసే అవకాశం లేదని, ప్రైవసీ పాలసీలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేశామో అందరికీ అర్థమయ్యేలా వివరించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పుకొచ్చారు.
వాట్సాప్ లో ఇటీవల ప్రైవసీకి సంబంధించి కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పగానే.. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా వేరే యాప్ ఉపయోగించండి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వాట్సాప్ ఏకంగా అందరి మెసేజీలు చదివేస్తోంది అంటూ ప్రచారం కూడా చేశారు.
ముఖ్యమంత్రి కుమార్తెను ఆన్ లైన్ లో మోసం చేసిన కేటుగాళ్లను పట్టుకున్న పోలీసులు
సైబర్ నేరగాళ్ల మాయలో పడి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కుమార్తె హర్షితా కేజ్రీవాల్ మోసపోయిన సంగతి దేశ వ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. కొందరు కేటుగాళ్ల చేతిలో ఆమె మోసపోయినట్లుగా నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఓ ప్రముఖ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మాలనుకుంది హర్షిత. కొద్ది మొత్తంలో ఆమె అకౌంట్ కు డబ్బును ట్రాన్స్ ఫర్ చేసి ఆమెను నమ్మించారు. ఆ తర్వాత ఆమె పంపించిన క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి ఆమె అకౌంటులో ఉన్న రూ. 34 వేలను దోచేశారు.
డీల్ ఫైనల్ అయిన తర్వాత అవతలి వ్యక్తులు హర్షిత కేజ్రీవాల్ మొబైల్‌కి ఒక క్యూఆర్ కోడ్ పంపి.. ఆ కోడ్‌ను స్కాన్ చేయగానే మీ అకౌంట్లో డబ్బు జమ అవుతుందని నమ్మించారు. వాళ్లు చెప్పినట్టే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే.. హర్షిత ఖాతా నుంచి నిందితుని అకౌంట్‌కి 34,000రూపాయలు బదిలీ అయింది. దీనిపై పోలీసులకు హర్షిత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.మొదట ఆమెకు నమ్మకం కల్గించేందుకు వారు కొంత తక్కువ సొమ్మును ఆమె ఖాతాలో డిపాజిట్ చేశారు, ఆ తరువాత రిగ్ చేసిన క్యూ ఆర్ కోడ్ ను వినియోగించి ఆమె అకౌంట్ నుంచి డబ్బును విత్ డ్రా చేశారని పోలీసులు గుర్తించారు.
మోసగాళ్లు.. కేజ్రీవాల్ కుమార్తెను కూడా దోచేశారు
ఈ ఘటనను కాస్త సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ కేటుగాళ్లను పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సాజిద్, కపిల్, మన్వేంద్ర అనే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. సోఫాను అమ్ముతున్నట్టు ఆన్ లైన్లో హర్షిత పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో, తనను తాను కస్టమర్ గా పేర్కొన్న ఓ వ్యక్తి... చిన్న మొత్తాన్ని ఆమె అకౌంట్ కు బదిలీ చేస్తూ, బార్ కోడ్ ను స్కాన్ చేయాలని కోరాడు. అతని మాటలను నమ్మిన హర్షిత బార్ కోడ్ ను స్కాన్ చేశారు. ఆ తర్వాత ఆమె అకౌంట్ నుంచి రెండు విడతలుగా రూ. 20 వేలు, రూ. 14 వేలను కొట్టేశారు. భారతదేశంలో సైబర్ నేరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిపే ఘటన ఇది..! ప్రతి రోజూ ఎన్నో వందల మంది సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతూ ఉన్నారు.
గూగుల్ కు షాక్ ఇచ్చేలా ఇస్రో మ్యాప్స్
మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే ఒకప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళను అడుగుతూ వెళ్లే వాళ్ళం..! కానీ ఇప్పుడంతా గూగుల్ యాప్స్ మీదనే ఆధారపడుతూ ఉంటున్నాం. గూగుల్ కు ప్రత్యామ్నాయంగా భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో మ్యాప్స్ ను తీసుకుని రావడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తూ ఉంది. తాజాగా ఇస్రో ఆ విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), మ్యాప్ మై ఇండియాలు కలిసి దేశీ మ్యాప్స్ యాప్ ను తీసుకురాబోతున్నాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందం రెండు సంస్థల మధ్య జరిగిందని మ్యాప్ మై ఇండియా సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహన్ వర్మ తెలిపారు.
మ్యాపింగ్ సైట్, భూమికి సంబంధించిన సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ను ఇది మరింత ముందుకు తీసుకెళ్తుందని అంటున్నారు. భవిష్యత్ లో విదేశీ యాప్ లపై ఆధారపడాల్సిన అవసరం రాదని.. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ వంటి వాటిని వదిలేసి దేశీ యాప్స్ ను వాడుకునే వెసులుబాటు వస్తుందని రోహన్ వర్మ భరోసా ఇచ్చారు. మ్యాప్ మై ఇండియా మాతృ సంస్థ అయిన సీఈ ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఇస్రో శుక్రవారం ఒప్పందం చేసుకుంది.
ఒప్పందంలో భాగంగా ఇస్రో నావిక్, మ్యాప్ మై ఇండియాకు చెందిన వెబ్ సర్వీసెస్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్, భువన్, వేదాస్, మోస్దాక్ వంటి భూ పరిశీలనా సమాచార వ్యవస్థ ద్వారా అధునాతన మ్యాప్ లను తయారు చేస్తామని ఇస్రో తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ (డీవోఎస్), మ్యాప్ మై ఇండియా మాతృసంస్థ సీఈ ఇన్ఫో సిస్టమ్స్‌తో గురువారం ఒప్పందం కుదిరినట్టు ఇస్రో వెల్లడించింది.
అనేక కంపెనీలు గూగుల్ సహకారంతో మనం ఉన్న లొకేషన్‌ను బట్టి ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ప్రకటనల ఆదాయం కోసం గూగుల్ మన సమాచారాన్ని కంపెనీలకు ఇస్తోంది. ఇది వ్యక్తిగత సమాచార భద్రతకు ఎంతో ముప్పుగా మారనుంది. అందుకే గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా, పూర్తి స్వదేశీ సాంకేతికతతో భారతీయులకు నావిగేషన్, మ్యాప్స్ సేవలను అందించేందకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, మ్యాప్ మై ఇండియా ఒక్కటయ్యాయి.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ
06-07-2020

రహస్యంగా కాజల్ ఎంగేజ్ మెంట్? ఎవరితోనో తెలుసా?
24-08-2020

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?
10-08-2020

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్
09-08-2020

హైదరాబాద్‌లో బాంబు పేలుడు.. కార్లు, బస్సుల అద్దాలు ధ్వంసం
21-08-2020

నారా లోకేశ్ కి విడదల రజనీ షాక్
28-10-2020

ఏంటి రజనీ మేడమ్.. అసలు కథ అదేనా
30-10-2020

అప్పుడలా.. ఇప్పుడిలా..! విడదల రజినీ ఇంతలా మారిపోయారా..?
04-07-2020

విజయసాయి రెడ్డికి ఇష్టం లేని పని జరగబోతోందా?
24-07-2020