మళ్ళీ లాక్ డౌన్ వద్దు.. రాష్ట్రాలకు ఫిక్కీ లేఖ
దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎలాంటి లాక్ డౌన్ లకు ఒడిగట్ట వద్దని 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులను భారత్ వాణిజ్య పారిశ్రామిక మండలి సమాఖ్య (ఫిక్కీ) అభ్యర్ధించింది. తొలిదశ కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ల ప్రభావం నుంచి ఆర్హిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందాని ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ శంకర్ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ లాక్ డౌన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి తారుమారు అయ్యే అవకాశం ఉంటుందని, ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ మరింత సంక్షుభితం కావచ్చునని ఆయన అన్నారు.
కరోనా వైరస్ ను ఎదుర్కొనే చర్యలను ముమ్మర ప్రాతిపదికన ప్రభుత్వాలు చేపడుతున్నప్పటికీ దీని తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు మరోసారి లాక్ డౌన్ అనివార్యమా? అన్న కథనాల నేపథ్యంలో రాష్ట్రాలకు ఫిక్కీ చేసిన అభ్యర్ధన ప్రాధాన్యతను సంతరించుకొంది. పాక్షిక లాక్ డౌన్ విధించినా కూడా దాని ప్రభావం ఆర్హిక వ్యవస్థపై తీవ్రంగానే ఉంటుందని ఓ లేఖలో ఉదయ శంకర్ స్పష్టం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్ సహా 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన ఈ లేఖ రాశారు. లాక్ డౌన్ లేదా పాక్షిక లాక్ డౌన్లకు బదులు కోవిడ్ పరీక్షలను ముమ్మరం చేయాలని అలాగే నిబంధనలను అందరూ ఖచ్చితంగా ఆచరించేలా చర్యలు తీసుకోవాలని అయన సూచించారు. ప్రజలలో చైతన్యాన్ని, అవగాహనను కలిగించి కోవిడ్ వ్యాప్తిని నిరోధించాలే తప్ప లాక్ డౌన్ వంటి చర్యల ద్వారా ఆర్హిక వ్యవస్థకు నష్టం కలిగించకూడదని అన్నారు. అలాగే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని, అవసరమైతే ఇందుకోసం ప్రయివేటు భాగస్వామ్యాన్ని తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీకాలు వేయించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. స్కూళ్ళు, కాలేజీలు ఇతర స్వచ్ఛంద సంస్థలకు చెందిన కార్యకర్తల సహాయాన్ని కూడా తీసుకోవాలని కూడా ఉదయ శంకర్ సూచించారు.
10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు
18 ఏళ్ళు దాటితే కోవిడ్ టీకా వేయాలి.. సుప్రీంకోర్టులో పిటీషన్
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందరికీ అందుబాటులోకి తేవాలనే డిమాండ్ల నేపథ్యంలో 40 సంవత్సరాల లోపు వారికి కూడా ఈ వ్యాక్సిన్ అందించాలని సుప్రీం కోర్టులో ప్రజాహిత పిటిషన్ దాఖలైంది. ఈ కేసుల తీవ్రత తగ్గాలంటే 18 సంవత్సరాల వయసు దాటిన వారికి కూడా టీకాలు వేయాలని అడ్వొకేట్ రష్మీ సింగ్ దాఖలు చేసిన పిటీషన్ సుప్రీం కోర్టు విచారించబోతోంది. 18 సంవత్సరాల వయసు పైబడిన వారికి అలాగే 45 సంవత్సరాల లోపు వారికి ఈ వ్యాక్సిన్ వేయకపోవడం అన్నది రాజ్యాంగంలోని 21, 18వ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని పిటీషనర్ రష్మీ సింగ్ తెలిపారు.
ఈ నేపథ్యంలో 45 సంవత్సరాల పైబడిన వారికే వ్యాక్సిన్ ఇవ్వాలన్న నిబంధనను సడలించాలని ఆమె కోరారు. న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్. సుభాష్ రెడ్డిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ విచారిస్తుంది. పెద్ద సంఖ్యలో యువతకు, ఉద్యోగిత జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కేసుల తీవ్రత గణనీయంగా తగ్గుతుందని, అలాగే దీని వ్యాప్తిని కూడా గట్టిగానే నిరోధించగలుగుతామని పిటీషనర్ పేర్కొన్నారు. ఇతర వ్యాధులు ఉన్న 45 సంవత్సరాల లోపు వారికి ఈ వ్యాక్సిన్ ను ఇవ్వకపోవడం అన్నది రాజ్యాంగంలోని 21వ అధికరణ హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.
ప్రభుత్వం తన చర్య ద్వారా రాజ్యాంగంలోని 14వ అధికరణం కల్పిస్తున్న సమానత్వ హక్కును కూడా ఉల్లంఘిస్తున్నదని కూడా పిటీషనర్ తెలిపారు. ప్రభుత్వం జనవరి 16 నుంచి టీకాల కార్యక్రమం మొదలెట్టింది. మొదట దీనిని ఆరోగ్య కార్యకర్తలకు, ముందుండి సేవలు అందిస్తున్న కరోనా యోధులకు పరిమితం చేసింది. అయితే మార్చి 1 నుంచి 60 సంవత్సరాలు పైబడిన వారికి అలాగే ఇటారా వ్యాధులు ఉన్న 45 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారికి దీనిని విస్తరించింది. దైనందిన కూలీలు సహా పెద్ద సంఖ్యలో అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలకు ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం లేదని ఆమె అన్నారు.
మరోపక్క నిన్న మొన్నటి వరకూ ఈ వ్యాక్సిన్ ఎగుమతి చేసిన భారత్ తాజా పరిస్థితుల దృష్ట్యా దీనిని దిగుమతి చేసుకోవాల్సి రావడం కూడా తాజా నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు. తాజా పిటీషన్ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ రకమైన తీర్పును వెలువరించబోతోందన్న దానిపై ఆసక్తి నెలకొంది. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య అత్యంత తీవ్రంగా పెరగడం, అదే క్రమంలో వ్యాక్సిన్ లభ్యత కూడా అనుకున్న స్థాయిలో లేకపోవడం ఆందోళనకు కారణం అవుతోంది. ఇప్పటికే పరిస్థితి తీవ్రతను సంతరించుకున్న దృష్ట్యా భారత్ తమ టీకాల కార్యక్రమాన్ని విశ్వజనీన రీతిలో అన్ని వర్గాలకు విస్తరించి టీకాలను అందుబాటులోకి తేవాలన్న నిపుణుల అభిప్రాయాన్ని కూడా పిటీషనర్ ఉటంకించారు.
10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు
నీరవ్ మోడీ అప్పగింతకు లైన్ క్లియర్.. యు.కె హోమ్ మంత్రి
ఆర్ధిక నేరస్థుడు నీరవ్ మోడీని తమకు అప్పగించాలన్న భారత్ ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. నీరవ్ మోడీని భారత్ కు అప్పగించే నిర్ణయాన్ని బ్రిటన్ హోమ్ మంత్రి ప్రీతీ పటేల్ ఆమోదించడంతో నీరవ్ మోడీకి కేవలం మరో 14 రోజులే హైకోర్టులో అప్పీలుకు అవకాశం మిగిలింది. హోమ్ మంత్రి, జిల్లా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుపై నీరవ్ మోడీ హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశము ఉందని తెలుస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకును వేలాది కోట్ల రూపాయల మేర ముంచి హవాలాకు పాల్పడ్డ పరారీలో ఉన్న వ్యాపారవేత్త నీరవ్ మోడీని బ్రిటన్ కోర్టు నేరస్థుడని నిర్ణయించింది. అతడిని భారత్ కు అప్పగించాలని కూడా ఆదేశించింది. ఆ నిర్ణయానికి హోమ్ మంత్రి ప్రీతీ పటేల్ ఆమోదం లభించడంతో ఇక నీరవ్ మోడీ అప్పగింత లాంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ లో అనేక రకాల అక్రమాలకు పాల్పడి జనాన్ని నిలువునా ముంచేసిన ఆర్ధిక నేరగాళ్ళను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగానే కృషి చేస్తోంది.
యు.కె హోమ్ మంత్రి తాజాగా తీసుకున్న నిర్ణయం భారత్ కు అనుకోని వరంగానే భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయంపై హైకోర్టు కు అప్పీలు చేసుకునే హక్కు తన క్లయింటుకు ఉందని ఆయన న్యాయవాది తెలిపారు. అయితే అప్పీలు చేసుకోవడానికి 14 రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తనను భారత్ కు అప్పగిస్తే ఎంత మాత్రం న్యాయం జరుగదని రాజకీయ కారణాల దృష్ట్యానే తనను లక్ష్యంగా పెట్టుకున్నారంటూ నీరవ్ మోడీ చేసిన ఆరోపణలను కోర్టు కొట్టి పారేసింది. ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్ శివార్ల లోని ఓ జైలులో ఉన్నారు.
రైలు సర్వీసులు యధాతథo.. రైల్వేబోర్డు చైర్మన్ వెల్లడి
దేశవ్యాప్తoగా కోవిడ్ కేసులు తీవ్రమౌతున్న నేపథ్యంలో రైలు సర్వీస్‌లను నిలిపివేయాలని ఏ రాష్ట్రాన్నీ కోరలేదని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ వెల్లడించారు. కంటైన్మెంట్ జోన్లకు సంబంధిoచి రాష్ట్రాల అభ్యర్థనను పురస్కరించుకుని రైలు ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఐఆర్సిటీసి ఈ-టికెటిoగ్ వెబ్సైట్ లో పేర్కొన్నట్టుగా అన్ని రాష్ట్రాలు ప్రామాణిక నిబధనలను పాటిస్తున్నాయని ఆయన తెలిపారు. రైలు సర్వీస్‌లను నిలిపివేయాలని ప్రస్తుతానికి ఏ రాష్ట్రాన్ని కోరలేదని, ఇప్పటికే ఈఅంశంపై రాష్ట్రాలతో చర్చించామని ఆయన వెల్లడించారు. కేసులు తీవ్రంగా ఉన్నా కంటైన్మెంట్ జోన్స్‌లో ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆయన చెప్పారు.
ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్‌పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆయనా వెల్లడించారు. అలాగే కోవిడ్ నిబంధలను పాటించనివారి పై జరిమానాలు కూడా విధిస్తున్నామన్నారు. శ్రామిక ప్రత్యక రైలులను నడిపే ప్రసక్తేలేదని, ఎక్కడ డిమాండ్, అవసరం ఉంటుందో అక్కడే రైళ్ళను నడపడం జరుగుతుందని శర్మ అన్నారు. రైల్వే స్టేషన్లోరద్దీని నిరోధించే అందుకు ప్లాట్ ఫారం టికెట్స్ రేట్లను కొన్నిచోట్ల పెంచామని తెలిపారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల నాలుగువేల ఐసోలేషన్కోచ్లను కోవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేశామన్నారు.
దేశవ్యాప్త లాక్డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య
మహారాష్ట్రలోని నందర్బార్నుంచి తమకు వందకు పైగా కోచ్ ల కోసం అభ్యర్థన వచ్చిందని, అయితే 20 ఐసోలేషన్ కోచ్ లను సమకూర్చామన్నారు. ముంబై, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోని అన్ని స్టేషన్ల పైనా గట్టి నిఘా ఉంచామని, డిమాండ్ఎక్కువగా ఉన్న చోట్ల అదనపు రైళ్ళను నడిపే అధికారాన్ని జోన్ల జనరల్ మేనేజర్ లకు ఇచ్చామన్నారు. ఎక్కడా సర్వీసులలో పంలేదని, ముఖ్యంగా ముంబై, సూరత్, బెంగళూర్ సహా అన్ని చోట్లా మామూలు పరిస్థితులే ఉన్నాయన్నారు.
భారతీయరైల్వేలు సగటున రోజుకు 1490 మెయిల్, ఎక్సప్రెస్ రైలు లను, అలాగే 5397 సబర్బన్రైల్సర్వీస్లను నడుపుతున్నాయి. దేశవ్యాప్తంగా 70% రైల్వే సర్వీసులను ఇప్పటికే పునరుద్ధరించామని శర్మ తెలిపారు. అదనపు రద్దీని దృష్టిలో పెట్టుకొని దేశ వ్యాప్తంగా 140 అదనపు రైళ్ళను నడుపుతున్నామన్నారు. ఏప్రిల్, మే నెలల్లో 140 ప్రత్యేక రైళ్లు 483 ట్రిప్పులు వెస్తాయని చెప్పారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఉత్తర ప్రదేశ్ లోని ఘోరక్పుర్, లక్నో, వారణాసి, ప్రయాగరాజ్. అలాగే బీహార్‌లోని పాట్నా, భగల్పుర్, దర్భంగా. ఝార్ఖండ్‌లోని బొకరో, రాంచీ. అస్సాంలోని గౌహతి. పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలకు ఈరైళ్ళను నడుపుతున్నామన్నారు.
భారత్ లో వ్యాక్సిన్ సీన్ రివర్స్.. ఆందోళనలో భారత్ పై ఆధారపడ్డ దేశాలు
నిన్నమొన్నటి వరకూ ప్రపంచ దేశాలు అన్నింటికీ కోవిడ్ వ్యాక్సిన్ డొసులను లక్షలాదిగా బహుకరించడమో లేదా అమ్మడమో చేసిన భారత్ కు ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా తాజాగా కోవిడ్ కేసులు దేశవ్యాప్తంగా ప్రబలడంతో సొంత అవసరాలకే ఈ వ్యాక్సిన్లు సరిపోని పరిస్థితిని భారత్ ఎదుర్కొంటోంది. ఒక్కసారిగా కథ అడ్డం తిరగడంతో కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతులను, విక్రయాన్ని భారత్ నిలిపి వేయడంతో ప్రపంచ దేశాలలో ఆందోళన మొదలైంది. నిన్న మొన్నటి వరకూ ఈ వ్యాక్సిన్ ఎగుమతి చేసిన భారత్ కు దాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి తలెత్తడం చాలా చెశాలకు మింగుడు పడటం లేదు.
ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్ లో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కొరత పెద్ద సమస్యగా మారుతోంది. గురువారం ఒక్క రోజులోనే రెండు లక్షలకు పైగా కోవిడ్ కేసులు తలెత్తడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో భారత్ ఈ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకుంటున్నది. దేశీయంగానే వ్యాక్సిన్ తయారు చేస్తున్నప్పటికీ కూడా పెరుగుతున్న కేసుల తీవ్రత నేపథ్యంలో వీటి పరిమాణం ఎంత మాత్రం సరిపోవడంలేదు. రోజూవారీ కేసులు పెరగడంతో పాటు ఆసుపత్రులు కూడా క్రిక్కిరిసి పోవడంతో అన్ని విధాలుగా కొరత పరిస్థితిని భారత్ ఎదుర్కొంటున్నది. తక్షణ ప్రాతిపదికన ఈ వ్యాక్సిన్ దిగుమతి చేసుకునే విధంగా నియమాలను సడలించింది.
గతంలో ఫైజర్ వంటి విదేశీ మందుల కంపెనీలను తిరస్కరించిన భారత్ కు ఇప్పుడు దిగుమతులు శరణ్యం కావడంతో మార్గాంతరంపై దృష్టి పెట్టింది. భారత్ కు చిరకాల మిత్ర దేశమైన రష్యా కు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఒక్కసారిగా పరిస్థితితులు తారుమారు కావడంతో దేశీయంగా కోవిడ్ ను ఎదుర్కొనే ప్రయత్నాలు మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తోంది దాదాపు 60 పేద దేశాలలో భారత్ సారధ్యంలో జరుగుతున్న వ్యాక్సిన్ కార్యక్రమానికి గండిపడే అవకాశం కనిపిస్తోంది. కోవాక్స్ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు మందులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, గావి వ్యాక్సిన్ కూటమి చేపట్టింది.
అయితే భారత్ నుంచి భారీ పరిమాణంలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే నమ్మకంతోనే కోవాక్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఔషధాల రంగంలో ఆసియా ఖండంలోనే బలమైన శక్తిగా ఉన్న భారత్ తమను ఈ ఆపద సమయంలో ఆదుకుంటుందని ఎన్నో దేశాలు ఆశించాయి. కానీ ఇప్పుడు భారత్ కే వాటిని దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెలలో ఇప్పటివరకు 1.2 మిలియన్ వ్యాక్సిన్ డోసులనే భారత్ ఎగుమతి చేసింది. ఈ ఏడాది జనవరి మార్చి మధ్య దాదాపు 64 మిలియన్ డోసులను ఎగుమతి చేసిన భారత్ సొంత అవసరాలపైనే దృష్టి పెట్టడం, దీనిపై ఆధారపడిన దేశాలలో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితి ఉన్నందువల్ల దేశీయ అవసరాలకే మందులు సరిపోవడం లేదని ఎగుమతులపై ఇతర దేశాలకు ఎలాంటి హామీలు ఇవ్వలేమని ఓ అధికారి వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ ను భారత్ దిగుమతి చేసుకోవలసి రావడం అనివార్యమైందని పేర్కొన్న ఓ అధికారి "మా అవసరాలే తీరనప్పుడు ఇతర దేశాలకు ఎలా ఎగుమతి చేస్తాం" అని వ్యాఖ్యానించారు.
అయోధ్య విరాళాలలో 15వేల చెక్కులు బౌన్స్.. విలువ 22 కోట్లు
న్యూఢిల్లీ: అయోధ్యలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామాలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా పెద్దఎత్తున విరాళాలు కూడా అందాయి. అన్నివర్గాల ప్రజలు తమకు తోచిన రీతిలో ఇతోధికంగా ఆలయ నిర్మాణానికి చేయూతను ఇవ్వడం కూడా రాముడి ఆలయ నిర్మాణం పట్ల ప్రజలకు ఉన్న సానుకూల దృక్పధాన్ని చాటిచెప్పింది. అంతవరకూ కథ బాగానే ఉంది. వచ్చిన చిక్కల్లా ఇచ్చిన చెక్కులతోనే ! దాదాపు 22 కోట్ల రూపాయల మేర 15వేల చెక్కులు బౌన్స్ అయ్యాయన్న విషయం తాజాగా జరిగిన ఆడిట్ లో వెల్లడైంది.
అయితే మరో 2500 కోట్ల విలువైన విరాళాలకు సంబంధించిన చెక్కులు మాత్రం జమయ్యాయని అనధికార వార్తల వల్ల తెలుస్తోంది. ఈ చెల్లని చెక్కులను ఆయా దాతలకు తిరిగి పంపిస్తున్నట్లు తీర్థక్షేత్రం ట్రస్ట్ కోశాధికారి వెల్లడించారు. ఈ బౌన్స్ అయిన 15వేల చెక్కులు విశ్వ హిందూ పరిషత్ దాని అనుబంద సంస్థలకు ఆలయ నిర్మాణానికి విరాళంగా వచ్చినవేనని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ జరిపిన ఆడిట్ లోనే చెక్కులు బౌన్స్ అయిన వ్యవహారం బయటపడింది. అయితే ఈ చెక్కులు బౌన్స్ కావడానికి కారణం ఆయా ఖాతాల్లో ఇచ్చిన మొత్తానికి సరిపడా నగదు లేకపోవడం లేదా కొట్టివేసి రాయడం వంటి అంశాలు, సంతకాలు సరిపోకపోవడమో అయి ఉండవచ్చునని చెబుతున్నారు.
ఈ తప్పులను సరిదిద్దడానికి బ్యాంకు అధికారులతో మాట్లాడుతున్నట్లు ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా వెల్లడించారు. బ్యాంకులు కూడా ఈ లోపాలను సరిదిద్దుకునేందుకు ఇచ్చిన చెక్కులు చెల్లేలా చూసేందుకు ఆయా వ్యక్తులకు సహకరిస్తున్నట్లు మిశ్రా తెలిపారు. కాగా ఈ 15వేల చెక్కులలో దాదాపు రెండువేల చెక్కులు అయోధ్య నుంచే వచ్చినవేనని ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద దేవ్ తెలిపారు. మిగతా 13వేల చెక్కులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అందినవేనని వెల్లడించారు. అయోధ్యలో రామాలయాన్ని అత్యద్భుత రీతిలో నిర్మించేందుకు ఈ ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకు విహెచ్పి దాని అనుబంధ సంస్థలు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాయి.
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయ నిర్మాణ వ్యవహారం వేగాన్ని సంతరించుకుంది. సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువడిన నాటి నుంచి రామాలయ నిర్మాణం పట్ల విహెచ్పి, దాని అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా ప్రజల్లో హిందుత్వ భావనను బలంగా పాదుగొలిపే ప్రయత్నం చేశాయి. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా ప్రజానీకాన్ని సమాయత్తం చేసే ప్రయత్నం చేశాయి. ఆశయం ఎంత ఉదాత్తమైనదైనా దాన్ని ఆచరించేందుకు అనుసరించే మార్గాలు కూడా అంతే ఉదాత్తతను సంతరించుకోవాలి సంతరించుకోవాలి. దేవుడికి ఇచ్చే విరాళాలు అంటే పవిత్రంగా ఉండాలి. అయితే ఈ చెక్కుల బౌన్స్ వ్యవహారం సానుకూలంగానే కొలిక్కివచ్చి ఆలయానికి ఆర్ధిక దన్నును ఇస్తుందో లేదో వేచి చూడాలి.
చైనా కుయుక్తులను తిప్పికొట్టాం వత్తిళ్లకు తలవంచే ప్రసక్తే లేదు: బిపిన్ రావత్
న్యూఢిల్లీ : భారత దేశం ఎవరి వత్తిళ్ళకూ తలవంచేది లేదని త్రివిధ దళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. ఈశాన్య సరిహద్దుల్లో యథాతథ పరిస్థితిని మార్చేందుకు జరిగిన ప్రయత్నాలను భారత్ గట్టిగా నిరోధించిందని ఆ విధంగా ఎవరి వత్తిళ్లకు లొంగేది లేదన్న విషయాన్ని స్పష్టం చేసిందని బిపిన్ రావత్ గురువారంనాడిక్కడ వెల్లడించారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా తో ఇటీవల తలెత్తిన సరిహద్దు ప్రతిష్టంభనను ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏ దేశాన్నయినా తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోగలనన్న చైనా దురహంకార ధోరణిని భారత్ గట్టిగా నిరోధించిందని ఇక్కడ ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో అన్నారు. సాంకేతికంగా మెరుగైన రీతిలో సాయుధ శక్తిని కలిగి ఉన్నంత మాత్రాన అన్ని దేశాలను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోగలను అనుకోవడం చైనా అవివేకమేనని రావత్ స్పష్టం చేశారు. ఉత్తర సరిహద్దులకు సంబంధించి గట్టిగా నిలబడ్డ భారత్ తన అజేయశక్తిని కూడా చాటుకుందని ఈ వర్చువల్ కాన్ఫరెన్సులో రావత్ అన్నారు.
అలాగే ఈ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు జరిగిన ప్రయత్నాలను నిరోధించిన భారత్ కు ప్రపంచ దేశాల నుంచి గట్టి మద్దతు లభించిందని అన్నారు. ఎలాంటి శక్తిని ఉపయోగించకుండా విచ్ఛిన్న టెక్నాలజీల సాయంతో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించిందని అలాగే తన ఒత్తిళ్లకు భారత్ లొంగిపోతుందని భావించిందని ఆయన అన్నారు. కానీ ఈ వ్యవహారంలో చైనా కుయుక్తులు సాగలేదని ప్రపంచ దేశాల సహాయ సహకారాలతో డ్రాగన్ కోరలు విరుచగలిగామని రావత్ అన్నారు.
అంతర్జాతీయంగా ఉన్న నియమ నిబంధనలన్నింటిని ప్రతి దేశం త్రికరణ శుద్ధిగా అనుసరించి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. గత ఏడాది మే నెల నుంచి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని అనేక చోట్ల రెండు దేశాల మధ్య సంఘర్షణ వాతావరణం నెలకొంటూ వచ్చింది. దాని ఫలితంగా ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం పడటంతో ఇరు దేశాలు సైనిక, దౌత్య పరమైన చర్చలు మొదలెట్టాయి. ఫిబ్రవరిలో సైనిక దళాలు, ఆయుధాల ఉపసంహరణ కూడా జరిగింది. అలాగే మిగిలిన సంఘర్షణ పాయింట్ల వద్ద ఈ రకమైన శాంతి స్థాపన చర్యలను కొనసాగిస్తున్నాయి.
ఆధునిక సైనిక శక్తి ఉన్నంత మాత్రాన సాంకేతిక పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నంత మాత్రాన వ్యవస్థను తలకిందులు చేయగలమని అనుకోవడం నేలవిడిచి సాము చేయడమేనని రావత్ అన్నారు. భారత్ తన సైనిక దళాలను పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఆధునీకరిస్తోందని స్పష్టం చేశారు. ప్రపంచంలో కొన్ని దేశాలు అంతర్జాతీయ ఒడంబడికల ప్రకారం వ్యవకరిస్తోంటే, ఇంకా కొన్ని దేశాలు తమ సొంతంగా నియమ నిబంధనలు విధించుకొని వాస్తవ పరిస్థితులను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి చర్యల కారణంగానే ఉత్తర సరిహద్దుల్లో సంఘర్షణ వాతావరణం తలెత్తుతోందని తెలిపారు.
10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ రెండవ దశ ఒకటొకటిగా అనేక రాష్ట్రాలను కకావికలు చేస్తోంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో దైనందిన కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్కరోజులో నమోదైన మొత్తం కేసుల్లో 80.76 శాతం ఈ రాష్ట్రాలలోని ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం అందించిన తాజా వివరాలను బట్టి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఈ కేసుల సంఖ్య గణనీయంగా ఒక్క రోజులోనే పెరిగింది.
గత 24 గంటల్లో రెండు లక్షలకు పైగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 58,952 కేసులు నమోదైతే రెండవ స్థానాల్లో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 20,439 కేసులు నమోదయ్యాయని ఢిల్లీలో 17,282 కొత్త కేసులు వెలుగు చూశాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న మొత్తం కేసులు 14,71,877. మొత్తం దేశవ్యాప్తంగా వ్యాధి సంక్రమణ స్థాయిలో ఇది 10.46 శాతం. గత 24 గంటల్లో నికరంగా లక్షా ఆరు వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి.
మొత్తం యాక్టివ్ కేసుల్లో 43.54 శాతం మహారాష్ట్ర లోనే చోటుచేసుకున్నాయి. కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కోలుకునే వారి సంఖ్య కూడా గత 24 గంటల్లో ఆశాజనకంగానే ఉంది. మొత్తం 93,528 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 10 రాష్ట్రాలలో ఒక్క రోజులోనే 1,038 మంది మరణించినట్లు వెల్లడించింది. మొత్తం మరణాల్లో ఇది 82.27 శాతం. మహారాష్ట్ర లో అత్యధిక స్థాయిలో 278 మంది, ఛత్తీస్ గఢ్ లో 120 మంది మరణించారని తెలిపింది.
ఒక్కరోజే వెయ్యిమంది చనిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం
మరోపక్క కోవిడ్ మహమ్మారిని అదుపు చేసే చర్యలను కూడా కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా చేపడుతోంది. ఇప్పటివరకు 11 కోట్ల 44 లక్షల మందికి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లను అందించింది. ఈ నెల 11 నుంచి 14 మధ్య జరిగిన టీకా ఉత్సవంలో దేశవ్యాప్తంగా కోటి 28 లక్షల మందికి పైగా టీకాలు వేసి ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకు వెళ్ళింది. ప్రభుత్వ, ప్రయివేటు రంగాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ టీకాలను అందించే ఉద్దేశంతోనే ఈ టీకా ఉత్సవాన్ని నిర్వహించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇప్పటి వరకు 60 సంవత్సరాలు దాటిన 4 కోట్ల 35 లక్షల మందికి మొదటి డోసు 28 లక్షల 47 వేల మందికి రెండవ డోసు అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారిలో 3కోట్ల 75 లక్షల మందికి మొదటి డోసు 8 లక్షల 98 వేల మందికి రెండవ డోసు అందించినట్లు తెలిపింది. ప్రజల్లో కోవిడ్ పట్ల అవగాహన కలిగించడంతో పాటు అన్ని దశల్లోనూ దానిని నిరోధించేందుకు, నివారించేందుకు ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నాలు కూడా అన్ని రాష్ట్రాలలో ముమ్మరంగా సాగుతున్నాయి. మొదటి దశ కంటే కూడా ఈ వైరస్ అంత తీవ్రం కాదన్న ఉపశమ వ్యాఖ్యలు కూడా ప్రజల్లో ఆత్మ నిబ్బరాన్ని పెంపొందిస్తున్నాయి
కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ
దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలలో కరోనా కేసులతో పాటు, మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోవడంతో ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడింది. ఆరోగ్యం విషమించిన పరిస్థితుల్లో ఆసుపత్రులకు వస్తున్న వారికి కూడా బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. మరో 6 వారాల పాటు ఉద్ధృతి కొనసాగవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నగరాల్లో బెడ్స్ కు మరింత డిమాండ్ ఏర్పడబోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబైలలో ఫైవ్ స్టార్ హోటళ్లను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చారు. పరిస్థితి విషమంగా ఉన్న పేషెంట్లకు మాత్రం ఆసుపత్రుల్లోనే చికిత్స అందిస్తారు. తక్కువ కరోనా లక్షణాలు ఉన్న పేషెంట్లను మాత్రం స్టార్ హోటల్స్ కు తరలిస్తారు. ఇక్కడ 24 గంటల పాటు వైద్యులు, వైద్య సిబ్బంది, ఔషధాలు, అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి. ముంబైలో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే వారికి రోజుకు రూ. 4 వేలు ఛార్జ్ చేస్తారు. పేషెంట్ కు తోడుగా ఉండాలనుకునేవారు మరో గది కావాలనుకుంటే రోజుకు రూ. 6 వేలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి వారాంతపు కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. అత్యవసరాలు, నిత్యావసరాలు తప్ప మిగతా అవసరం లేని కార్యకలాపాలన్నింటినీ శని, ఆదివారాల్లో నిషేధిస్తున్నట్టు చెప్పారు. ఆడిటోరియాలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు, జిమ్ లు, స్పాలన్నింటినీ మూసి వేస్తున్నారు. ఏదైనా ఒక ప్రాంతంలో ఒక రోజు ఒకే సంతకు అనుమతి ఉండనుంది. సామాజిక, రాజకీయ, మత సమూహాలకు అనుమతి లేదని.. పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. వారాంతాల్లో కేవలం అత్యవసర, నిత్యావసరాలకే అనుమతి ఇచ్చారు. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలకు కర్ఫ్యూ పాస్ లు తప్పనిసరిగా ఢిల్లీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. జిమ్, స్విమ్మింగ్ పూల్స్, షాపింగ్ మాళ్లు పూర్తిగా మూసివేయనున్నారు. ఇక 30 శాతం సామర్థ్యంతో సినిమా హాళ్లకు అనుమతిని ఇచ్చారు. రెస్టారెంట్లలో తినడానికి లేదు. కేవలం పార్శిళ్లకు మాత్రమే అనుమతిని ఇచ్చారు.
రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్
విదేశాలలో తయారవుతున్న మరికొన్ని రకాల వ్యాక్సిన్లను దేశంలో అనుమతించాల్సిందిగా తాను గతంలోనే డిమాండ్ చేస్తే అపహాస్యం చేసిన కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఇప్పుడు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని భీతిల్ల చేస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ నిల్వలు తగినన్ని అందుబాటులో లేవని స్పష్టమైన నేపథ్యంలో రష్యా రూపొందించిన స్పుత్నిక్ టీకాను కేంద్రం హుటాహుటిన దేశీయ వినియోగానికి ఆమోదించింది. సరిగ్గా ఇదే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయుధమై కూర్చుంది.
మొదట వారు నీవుచెప్పేది లెక్క పెట్టరు. ఆ తర్వాత నీ మాటలకు వారు నవ్వుతారు. తర్వాత నీతో పోట్లాడతారు. ఆ తర్వాత చివరికి మీమాటలే నిజమవుతాయి. మీరే గెలుస్తారు అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
పశ్చిమదేశాలు, జపాన్ ఉపయోగిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ రకాలను అత్యవసర ప్రాతిపదికన దేశంలోకి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ మండిపడ్డారు. మరిన్ని వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చి కరోనా వ్యాప్తిని అరికట్టాలని తాను గతంలో చెబితే ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, గేలి చేసిందని, కానీ ఇప్పుడు అవే విదేశీ వ్యాక్సిన్లను మోదీ ప్రభుత్వం కౌగలించుకుంటోందని రాహుల్ ఎద్దేవా చేశారు.
కేంద్రప్రభుత్వ అధినేతలు మనం మొదటే మంచి చెబితే లెక్కపెట్టరు. పైగా మిమ్మల్ని చూసి పరిహాసం చేస్తారు. తర్వాత మీతో పోట్లాడతారు, ఆ తర్వాత అంతిమంగా మీరే గెలుస్తారు అని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
విదేశాల్లో తయారైన కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్లకు భారత్ అత్యవసర అనుమతులు ఇవ్వడానికి ఇప్పుడు పోటీపడుతోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు అదుపు తప్పి పెరిగిపోతుండటంతో పలు విదేశీ వ్యాక్సిన్లను దేశంలోకి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా నిర్ణయించింది. ఇప్పటికే రష్యా రూపొందించిన కోవిడ్ స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగం కింద భారత్ లోకి అనుమతించింది. దీంతో పైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా వంటి కంపెనీల టీకాలను కూడా దేశంలోకి అనుమతించేందుకు మార్గం సుగమమైంది.
పలు రాష్ట్రాలు కరోనా సెకండ్ వేప్ ప్రభావంలోకి వెళుతున్న నేపథ్యంలో మరికొన్ని రకాల వ్యాక్సిన్లు దేశంలోకి అనుమతించాలంటూ గతవారం ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాసిన లేఖ సారాంశంపై బీజేపీ తీవ్రంగా దాడి చేసింది. వ్యాక్సిన్లను నిదానంగా వేస్తూ పోతే దేశం మొత్తంగా ఉపద్రవంలోకి వెళ్లిపోతుందని రాహుల్ లేఖ రాయడంపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు.
పార్ట్ టైమ్ రాజకీయనేతగా ఉంటున్న రాహుల్ ఫుల్ టైమ్ లాబీయిస్టుగా మారిపోయనట్లుంది. యుద్దవిమానాల సేకరణకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాహుల్ విదేశీ యుద్ద విమాన సంస్థలతో లాబీయింగ్‌కి దిగారు. ఇప్పుడు విదేశాల నుంచి మరికొన్ని రకాల వ్యాక్సిన్లను అనుమతించాలని కోరుతూ ఫార్మా కంపెనీల తరపున లాబీ చేస్తున్నారు. అంటూ రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యకు మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వంతపాడింది. పార్ట్ టైమ్ పాలిటీషియన్, ఫుల్ టైమ్ లాబీయస్టు.. ఆశ్చర్యంగా ఉంది కదూ అంటూ స్మృతి ఇరానీ గేలి చేసింది.
ఇప్పుడు రాహుల్ దీన్నే దొరకబుచ్చుకుని బీజేపీని అపహాస్యం చేస్తుండడం గమనార్హం.
సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని ఎంతగా ఆవరిస్తోందంటే 35 లక్షల మంది విద్యార్థులు సిద్ధమవుతున్న సీబీఎస్సీ పరీక్షలను రద్దు చేయడం, వాయిదా వేయడం తప్ప కేంద్ర విద్యాశాఖకు మరో మార్గం లేకపోయింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్‌తో ప్రధాని నరేంద్రమోదీ చర్చించిన తర్వాత సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని కీలకనర్ణయం తీసుకున్నారు.
కరోనా సెకండ్ వేవ్ హద్దుల్లేకుండా చెలరేగిపోతున్న తరుణంలో లక్షలాది విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టడానికి సాహసించని కేంద్ర విద్యా శాఖ సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. కాగా విద్యార్థులు ప్రతిభ, పనితీరు ఆదారంగా వారికి మార్కులు కేటాయిస్తామని విద్యాశాఖ తెలిపింది. అయితే 12వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా వేస్తున్నామని, జూన్ 1న పరిస్థితిని సమీక్షించాక 12వ తరగతి పరీక్షలపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.
బుధవారం సాయంత్రం కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్వీట్ ద్వారా పరీక్షల రద్దు, వాయిదా నిర్ణయాన్ని తెలియజేశారు. దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మే 4 నుంచి జూన్ 7 వరకు జరగాల్సిన సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. అయితే విద్యా బోర్డు రూపొందించే ఆబ్జెక్టివ్, క్రైటీరియా ప్రాతిపదికన విద్యార్థుల పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు.
అయితే ఇప్పటికి వాయిదా వేసిన 12 వ తరగతి పరీక్షలపై జూన్ 1ని నిర్ణయం తీసుకుంటామని, పరీక్షలు తప్పకుండా పెట్టాలని భావిస్తే 12వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు 15 రోజులు ముందుగా వాటి వివరాలు ప్రకటిస్తామని కేంద్ర విద్యామంత్రి చెప్పారు.
దేశాన్ని కరోనా సునామీలా చుట్టుముడుతున్న తరుణంలో పరీక్షలు రద్దు చేయాలని వివిధ వర్గాలనుంచి డిమాండ్లు తలెత్తాయి. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం విద్యాశాఖతో కీలక సమావేశం నిర్వహించారు. విద్యార్థుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని మోదీ చెప్పారని ఈ భేటీకి హాజరైన విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. అనంతరం టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో 21.5 లక్షలమంది సీబీఎస్ఈ పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే విద్యాసంవత్సరాన్ని పూర్తి చేసుకోనున్నారు. మరోవైపున 14 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులపై పరీక్షల వాయిదా తీవ్రంగా ప్రభావం చూపనుంది. ఇంతవరకు తీవ్రంగా శ్రమించి పరీక్షలకు సిద్ధమైన వారు హుతాశులైపోయారు.
విద్యార్థులు ప్రతిభ, పనితీరు ఆదారంగా వారికి మార్కులు కేటాయించినప్పుడు ఏ విద్యార్థి అయినా సంతృప్తి చెందకపోతే, పరీక్షలు పెట్టడానికి అనువైన పరిస్తితులు ఏర్పడినప్పుడు వారికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యా శాఖ పేర్కొంది. అయితే వాయిదా వేసిన 12వ తరగతి పరీక్షలను తక్కువ కాలంలో ఆన్ లైన్ ద్వారా నిర్వహించడం సాధ్యం కాదని తెలిపింది. ఆన్ లైన్ పద్దతిలో విద్యార్థులు పరీక్షలకు అలవాటు పడటం తక్కువ సమయంలో చాలా కష్టమైన పని అని విద్యాశాఖకు చెందిన ఒక అధికారి పేర్కొన్నారు.
రాష్ట్రాల విద్యా బోర్డుల్లా కాకుండా సీబీఎస్ఈ పరీక్షలను దేశవ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహిస్తారు. కానీ ఇప్పటికే 11 రాష్ట్రాల్లో కరోనా కారణంగా పాఠశాలలను మూసివేయడంతో సీబీఎస్ఈ పరీక్షలపై కూడా కేంద్రం తీవ్ర నిర్ణయం తీసుకోక తప్పింది కాదు. పైగా పరీక్షల షెడ్యూల్‌ని మార్చాలని ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని అభ్యర్థించిన నేపథ్యంలో విద్యాశాఖకు మరో మార్గం లేకుండా పోయింది.
మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్
న్యూఢిల్లీ : భారత్ తమకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామ్య దేశమని రష్యా బుధవారంనాడు స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ఎలాంటి వైరుధ్యాలు గాని, అపోహలు గాని లేవని రష్యా మిషన్ డిప్యూటీ చీఫ్ రోమన్ బాబుష్కిన్ బుధవారం నాడిక్కడ స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖవద్ద 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ పాక్ చిత్తశుద్హితో పాటించాలని అన్నారు.
ఇందుకు ఇటీవల ఇరుదేశాలు చేసిన ప్రకటన పట్ల బాబుష్కిన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రాంతీయ సుస్థిరత కోసం ఈ రకమైన చర్యలు ఎంతో అవసరమని అన్నారు. బాబుష్కిన్ తో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన రష్యా రాయబారి నికులే కుబాషేవ్ పశ్చిమ దేశాల ఇండో పసిఫిక్ వ్యూహాన్ని తప్పుబట్టారు.
ఈ రకమైన ప్రయత్నాలు ప్రమాదకరమని ప్రచ్ఛన్న యుద్ధం నాటి పరిస్థితులను పునరుద్ధరించే ప్రయత్నమేనని ఆయన అన్నారు. ఆఫ్గానిస్తాన్ పై ప్రాంతీయ స్థాయిలో ఏకాభిప్రాయ సాధన ప్రక్రియలో భారత్ పాలు పంచుకోవాలని బాబుష్కిన్ ఈ సందర్బంగా పిలుపు ఇచ్చారు. ఇటీవల భారత్ లో పర్యటించిన రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ ఇక్కడి నుంచి ఇస్లామాబాద్ వెళ్లడంపై వచ్చిన విమర్శలను ప్రస్తావించిన బాబుష్కిన్ "పాకిస్థాన్ తో మాకు స్వతంత్ర సంబంధాలు ఉన్నాయి. ఇది ఏ దేశానికి ఉద్దేశించినది కాదు. ఏ దేశాన్ని లక్షయించింది కాదు" అని స్పష్టం చేశారు.
మొదటి నుంచి కూడా భారత్ రష్యాల మధ్య సమానమైన, దృఢమైన, సమగ్రమైన, దూర దృష్టితో కూడిన సంబంధాలే ఉన్నాయని కుబాషేవ్ అన్నారు. ఈ నెల ఆరవ తేదీన లావరోవ్ భారత్ లో జరిపిన పర్యటన వల్ల ఎంతో మేలు జరిగిందని ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక బాగస్వామ్యం మరింతగా ఇనుమడించిందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అలజడులు చోటుచేసుకున్నా భారత రష్యా బంధం చెక్కు చెదరదని ఆయన తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో జరుగనున్న భారత్ రష్యా శిఖరాగ్ర సదస్సు సన్నాహక చర్యలలో భాగంగానే లావరోవ్ భారత్ వచ్చారని ఆయన తెలిపారు.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ
06-07-2020

రహస్యంగా కాజల్ ఎంగేజ్ మెంట్? ఎవరితోనో తెలుసా?
24-08-2020

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?
10-08-2020

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్
09-08-2020

హైదరాబాద్‌లో బాంబు పేలుడు.. కార్లు, బస్సుల అద్దాలు ధ్వంసం
21-08-2020

నారా లోకేశ్ కి విడదల రజనీ షాక్
28-10-2020

ఏంటి రజనీ మేడమ్.. అసలు కథ అదేనా
30-10-2020

అప్పుడలా.. ఇప్పుడిలా..! విడదల రజినీ ఇంతలా మారిపోయారా..?
04-07-2020

విజయసాయి రెడ్డికి ఇష్టం లేని పని జరగబోతోందా?
24-07-2020