రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
రాజస్థాన్ రాయల్స్.. మొదటి ఐపీఎల్ సీజన్ ను సొంతం చేసుకున్న తర్వాత ఆ స్థాయి ఆటతీరును ప్రదర్శించడానికి చాలా కష్టాలే పడుతోంది. ట్యాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్లే ఆఫ్స్ కు వెళ్ళడానికి, టైటిల్ కొట్టడానికి చాలా ఇబ్బందులు పడుతోంది. ఈ సీజన్ లో సంజూ శాంసన్ కు కెప్టెన్సీ పగ్గాలను ఇచ్చింది. దీంతో ఆ జట్టు లక్ మారుతుందని భావించారు. అయితే ఊహించని విధంగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సీజన్ నుండి వైదొలిగాడు.
బెన్‌స్టోక్స్ గాయం కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌గేల్ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్ చేస్తూ అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి వేలికి గాయమైంది. ఆ తర్వాత ఫీల్డింగ్, బౌలింగ్ కూడా చేశాడు. ఛేజింగ్ లో ఓపెనర్‌గా వచ్చినప్పటికీ తొలి ఓవర్లోనే అవుటై పెవిలియన్ చేరాడు. అతడి వేలికి స్కానింగ్ చేయగా అది విరిగినట్టు తేలింది. దీంతో ఈ సీజన్ మొత్తానికి అతడు దూరమైనట్టు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తెలిపింది. మ్యాచ్‌లు ఆడకపోయినా ఇక్కడే ఉంటాడని, ఆటగాళ్లకు సలహాలు ఇస్తాడని తెలిపింది.
'రాజస్తాన్ రాయల్స్ జట్టులోని ప్రతి ఆటగాడు బెన్‌స్టోక్స్‌ను ఎంతగానో ప్రేమిస్తాడు. జట్టుకు ఉన్న అతిపెద్ద ఆస్తి అతడు. మైదానం లోపల, వెలుపల రాయల్స్ కుటుంబంలో అతడికి తగినంత ప్రాధాన్యం ఉంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో స్టోక్స్ ఎడమ వేలికి గాయమైంది. వైద్య పరీక్షల్లో అతడి వేలు విరిగినట్లు తెలిసింది. దీంతో ఈ సీజన్ మొత్తానికి బెన్ దూరమయ్యాడు. మ్యాచ్‌లు ఆడకున్నా ఇక్కడే ఉండి మైదానం బయట నుంచి బెన్ సలహాలు ఇవ్వబోతున్నాడు.
స్టోక్స్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. త్వరలోనే తన స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని సిద్ధం చేస్తాం'. అని రాజస్థాన్ ట్వీట్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ ల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆర్చర్ ఇప్పటికే సీజన్ నుండి తప్పుకోగా.. బెన్ స్టోక్స్ ఇప్పుడు గాయపడడంతో సీజన్ నుండి వైదొలిగాడు. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ తర్వాతి మ్యాచ్ లలో పుంజుకోవాలంటే భారత ఆటగాళ్లు రాణించాల్సి ఉంది.
నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
మ్యాచ్ ను లాగేసుకున్నారు.. అవును.. ముంబై ఇండియన్స్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ చేతుల్లో నుండి మ్యాచ్ ను లాగేసుకున్నారు. నైట్ రైడర్స్ ఓపెనర్లు ఆడిన ఆటను చూసి ఒకానొక దశలో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్ కూడా ఓడిపోతుందని అనుకున్నారు. కానీ ముంబై ఇండియన్స్ బౌలర్లు మ్యాచ్ ను ఆఖరి బంతి వరకూ తీసుకుని వచ్చారు. పిచ్ కూడా బౌలింగ్ కు అనుకూలిస్తూ ఉండడం.. టాప్ క్లాస్ బౌలర్లు ఉండడంతో ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ ను కోల్ కతా కెప్టెన్ మోర్గాన్ బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఒకానొక దశలో ముంబై 170 పరుగుల స్కోరు చేస్తుందని భావించారు. అయితే ఆఖర్లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రే రస్సెల్ బంతితో విజృంభించాడు. రస్సెల్ 2 ఓవర్ల వ్యవధిలో 5 వికెట్లు తీయడంతో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. క్రిస్ లిన్ స్థానంలో వచ్చిన ఓపెనర్ క్వింటన్ డికాక్ (2) విఫలమయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (43), సూర్యకుమార్ యాదవ్ జోడీ ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదిలింది. 36 బంతులాడిన సూర్యకుమార్ యాదవ్ 7 ఫోర్లు, 2 సిక్సులతో 56 పరుగులు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడంతో, స్కోరు వేగం మందగించింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (1), రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరారు. ఆ తర్వాత పతనమే.. 18 ఓవర్ లో రసెల్... తొలుత పొలార్డ్ ను అవుట్ చేశాడు. అదే ఓవర్లో మార్కో జాన్సెన్ ను కూడా అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో మళ్లీ బౌలింగ్ కు వచ్చిన రసెల్... ఈసారి మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వరుస బంతుల్లో కృనాల్ పాండ్య, బుమ్రా ను అవుట్ చేసి హ్యాట్రిక్ ముంగిట నిలిచాడు. రాహుల్ చహర్ హ్యాట్రిక్ బాల్ ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత బంతికే చహర్ అవుట్ కావడంతో రసెల్ ఖాతాలో ఐదో వికెట్ చేరింది. మొత్తమ్మీద 2 ఓవర్లలో 15 పరుగులిచ్చిన రసెల్ 5 వికెట్లు సాధించాడు. దీంతో ముంబై 152 పరుగులు చేసింది.
ఛేజింగ్ లో కోల్ కతాకు మంచి ఆరంభం లభించింది. కోల్‌కతా ఓపెనర్లు రాణా, గిల్ 72 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేశారు. చహర్ మ్యాజిక్ చూపించాడు. శుభమన్ గిల్ 33 పరుగుల వద్ద అవుట్ చేసిన చహర్ తన తదుపరి ఓవర్లలో వరుసగా రాహుల్ త్రిపాఠి (5), కెప్టెన్ మోర్గాన్ (7), నితీశ్ రాణాలను ఔట్ చేయడంతో ముంబై పట్టు బిగించింది. షకీబ్ (9) కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 15.2 ఓవర్లలో కోల్‌కతా 122 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. 16వ ఓవర్లో కృనాల్ ఒక పరుగు మాత్రమే ఇచ్చి వికెట్ తీశాడు. రసెల్ రిటర్న్ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. 17వ ఓవర్లో బుమ్రా 8 పరుగులిచ్చినా... మరుసటి ఓవర్ వేసిన కృనాల్ 3 పరుగులే ఇచ్చాడు. బుమ్రా తన 19వ ఓవర్లో 4 పరుగులు ఇచ్చాడు. ఇక ఆఖరి 6 బంతుల్లో కోల్‌కతా విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. బౌల్ట్ మూడో బంతికి రసెల్ (9)ను రిటర్న్ క్యాచ్‌తో, నాలుగో బంతికి కమిన్స్‌ను క్లీన్ బౌల్డ్‌తో పెవిలియన్ చేర్చాడు. చివరకు 4 పరుగులే ఇవ్వడంతో కోల్‌కతా 142/7 స్కోరు దగ్గరే ఆగిపోయింది. దీంతో ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాహుల్ చహర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
మనీష్ పాండే వంటి సిక్సర్ల వీరుడు చివరి మూడు ఓవర్లలో చివరి బంతి తప్ప ఒక్క బౌండరీని కూడా బాదలేకపోవడం వల్లే సన్ రైజర్స్ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ఓడిపోయిందని టీమిండియా మాజీ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మనీష్ పాండే చివరి వరకు క్రీజులో ఉన్నా మ్యాచ్ గెలిపించలేకపోవడానికి అతడి దురదృష్టమే కారణమని సెహ్వాగ్ చెప్పాడు.
నిజానికి ఆదివారం కేకేఆర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టు చివరి మూడు ఓవర్లలోనే గెలుపు చాన్స్ పోగొట్టుకుందని సెహ్వాగ్ చెప్పాడు. నిలబడితే చాలు సిక్సర్లు దండుకునే మనీష్ పాండేకి చివరి మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా బాదలేకపోవడం చాలా అరుదైన విషయమని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మనీష్ పాండే కడవరకూ క్రీజ్‌లో ఉన్నా మ్యాచ్‌ను గెలిపించలేకపోవడానికి కారణం బంతులు అతని రాడార్‌లో పడకపోవడమే. అసలు చివరి మూడు ఓవర్లలో మనీష్ ఒక్క బౌండరీ కూడా సాధించకపోవడానికి బంతులు అతని అంచనాకు అందకపోవడమేనని సెహ్వగ్ వివరించాడు.
క్రికెట్ ఆట తీరే ఇంత.. కొన్ని సార్లు ఆలాగే జరుగుతుంది. ఎంతో ఒత్తిడి భరిస్తూ కూడా క్రీజులో నిలిచిన బ్యాట్స్‌మన్ మ్యాచ్‌ను గెలిపించడానికి విశ్వప్రయత్నం చేసినా మనీష్ పాండేకి అది సాధ్యపడలేదు. కారణం ఏంటి? చివరి మూడు ఓవర్లు క్రీజులో నిలిచిన మనీష్ పాండే ఒక్కటంటే ఒక్క బౌండరీ కూడా చేయలేకపోయాడు. ఎట్టకేలకు చివరి బంతికి సిక్సు బాదినా అప్పటికే మ్యాచ్ అయిపోయందని సెహ్వాగ్ చెప్పాడు.
ఆదివారం జరిగిన ఆ మ్యాచ్‌లో మనీష్ పాండే నిజంగానే కీలక పాత్ర పోషించాడని, ముఖ్యమైన వికెట్లు పడిపోయినప్పుడు క్రీజ్‌లో నిలదొక్కుకుని మరీ మ్యాచ్‌ను గెలిపించే దిశగా ప్రయత్నం చేశాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. పాండే చాలా ఒత్తిడిలో క్రీజ్‌లో సెట్ అయ్యాడు. అతడు ఇంకొన్ని బౌండరీలు కొట్టుంటే ఆ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 పరుగుల తేడాతో ఓడిపోయేది కాదన్నాడు.
మనీష్ అనుకున్న చోట బంతులు పడలేదు. అందుకే విఫలమయ్యాడు. కొన్ని సార్లు అలానే జరుగుతుంది. మనీష్ క్రీజులో కుదురుకున్నాడు, కానీ బంతులు హిట్ చేసేందుకు ఏమాత్రం వీలుకాలేదు. లేకపోతే సన్‌రైజర్స్ ఆ మ్యాచ్ ఓడిపోయేది కాదు అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
మనీష్ పాండే క్రీజ్‌లో ఉండటంతో సన్ రైజర్స్ జట్టు గెలుస్తుందని ఆ ఫ్రాంచైజీ అభిమానులు భావించినా కలకత్తా నైట్ రైడర్స్ జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి విజయాన్ని అందుకుంది. మనీష్ పాండే 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచినప్పటికీ మ్యాచ్ గెలిపించలేకపోయాడు.
అందుకే ఆఖరి బంతికి సిక్స్ కొట్టావ్.. కానీ అప్పటికే మ్యాచ్ పోయింది అని సెహ్వాగ్ కాస్త సానుభూతి చూపాడు.
ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ తాము ఇక్కడి పరిస్థితుల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామని చెప్పుకొచ్చాడు. కేకేఆర్ పరిస్థితుల్ని అర్థం చేసుకుందని అందుకే విజయం సాధించిందన్నాడు. ఈ పిచ్‌పై అసలు ఇన్ని పరుగులు వస్తాయని అనుకోలేదని.. నేను అనుకున్నది ఒకటి.. జరిగింది ఒకటి అని చెప్పుకొచ్చాడు. మా ప్రణాళికల్ని అమలు చేయలేకపోయామని.. ఆరంభం నుంచి చివరి వరకూ దాదాపు ఇదే పరిస్థితి ఉందని చెప్పుకొచ్చాడు.
మేము ఆరంభంలో వికెట్లు కోల్పోయినా మనీష్ పాండే-బెయిర్ స్టో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారని.. దాంతో మాకు చాన్స్ దొరికిందని అనుకున్నామన్నాడు. బౌలర్లు ఓవర్ పిచ్ బంతులు వేస్తే ఈజీగా హిట్ చేయడం అనేది కనిపించింది. సీమ్ విభాగంలో మా కంటే కేకేఆర్ మెరుగ్గా కనిపించింది. ఈ మ్యాచ్ గెలవాల్సింది.. కానీ ఓడిపోయాం. ఇంకా ఈ వేదికలో నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. దాంతో ఇక్కడ గ్రౌండ్లో ఎలా ఆడాలనే దాన్ని మిగతా మ్యాచ్‌ల్లో ఉపయోగించుకుంటామని వార్నర్ తెలిపాడు.
కేకేఆర్ నిర్దేశించిన 188 పరుగుల టార్గెట్ ఛేదనలో ఆరెంజ్ ఆర్మీ చేధించలేకపోయింది. నమ్ముకోదగ్గ ఫినిషర్ ఉండి ఉంటే సన్ రైజర్స్ మ్యాచ్ ను గెలిచేదని.. గతంలో కూడా ఇలానే జరిగిందని.. ఈ ఏడాది కూడా మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ ఫినిషింగ్ చేయలేక చేతులెత్తేసిందని అభిమానులు అంటూ ఉన్నారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు, సన్ రైజర్స్ హైదరాబాద్ పై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఓపెనర్ నితీశ్ రాణా 56 బంతుల్లోనే 80 పరుగులతో రాణించాడు. త్రిపాఠి 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేశాడు. చివర్లో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (9 బంతుల్లో 22) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆండ్రే రస్సెల్ మరోసారి విఫలమయ్యాడు.
హైదరాబాద్ బౌలర్లలో మహ్మద్ నబీ 2, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. భువీ, నటరాజన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. భువీ భారీగా పరుగులు ఇవ్వడంతో కేకేఆర్ భారీ స్కోరు సాధించింది. లక్ష్యఛేదనకు దిగిన సన్ రైజర్స్ రెండో ఓవర్లోనే కెప్టెన్ వార్నర్ వికెట్ కోల్పోయింది. జానీ బెయిర్ స్టో (55) హాఫ్ సెంచరీ సాధించినా, విజయ తీరాలకు మాత్రం చేర్చలేకపోయాడు. మనీష్ పాండే 61 (నాటౌట్) పరుగులు చేసి రాణించాడు. పాండే, బెయిర్ స్టో జోడీ 92 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తరువాత వరుసగా వికెట్లు పడుతూ ఉండటంతో రన్ రేట్ పెరిగిపోయి, మిగతా వారిపై ఒత్తిడి పెరిగింది. యువ ఆటగాడు అబ్దుల్ సమద్ హిట్టింగ్ చేసినప్పటికీ 188 పరుగులను మాత్రం ఆ జట్టు అందుకోలేక పరాజయం పాలైంది.
ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
'ఇందిరా నగర్ కా గూండా' అంటూ భారత క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ నటించిన ఓ యాడ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అందులో రాహుల్ ద్రావిడ్ ట్రాఫిక్ లో గొడవ పడడాన్ని చూడొచ్చు. ట్రాఫిక్ లో విపరీతమైన చిరాకుతో బ్యాట్ తీసుకుని అద్దాలను పగులగొట్టడం, పలువురి మీద అరవడం, రారా తేల్చుకుందాం అంటూ విపరీతమైన కోపాన్ని ప్రదర్శించాడు. ద్రావిడ్ ఎప్పుడు కూడా కోప్పడడం చూడలేని వారు ఈ యాడ్ ను చూసి అవాక్కయ్యారు.
బ్యాట్ చేతపట్టి హల్చల్ చేశాడు. తొలుత తన కారుపైనే కోపాన్ని ప్రదర్శించిన ద్రావిడ్.. ఆ తరువాత తన కారు పక్కన ఉన్నవారిని సైతం బెదిరించాడు. నువ్ రారా చూసుకుందాం.. అంటూ ఊగిపోయాడు.. ఒక కారుకి సైడ్ మిర్రర్‌ను ధ్వంసం చేశాడు. రాహుల్ ద్రావిడ్ చర్యతో రోడ్డుపై ఉన్న వాహనదారులంతా హడలిపోతారు. ద్రావిడ్ కు కోపం కూడా వస్తుందా..? కోపం వస్తే ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా అని కూడా కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. ద్రావిడ్ కు యాంగర్ ఇష్యూ ఉందని అనుకునేలా ఈ యాడ్ ను రూపొందించారు. అయితే ద్రావిడ్ కోపాన్ని తాను ఇంతకు ముందే చూశానని.. భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అది కూడా మహేంద్ర సింగ్ ధోని మీద అని చెప్పుకొచ్చాడు.
వీరేందర్ సెహ్వాగ్ 2006లో పాకిస్థాన్ లో జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఆసక్తికర ఘటన గురించి చెప్పుకొచ్చాడు. ధోనీ అప్పుడే జట్టులోకి వచ్చాడని, ఓ మ్యాచ్ లో చెత్తగా ఆడి అవుట్ అయి పెవీలియన్ కు వచ్చిన ధోనీని చూసిన ద్రావిడ్ కు చిర్రెత్తుకొచ్చి, "నువ్వు ఇలాగేనా ఆడాల్సింది. మ్యాచ్ ని నువ్వే ముగించి ఉండాల్సింది" అంటూ కోపంతో ఇంగ్లీషులో చాలా తిట్టేశాడని.. ద్రావిడ్ ఇంగ్లీషులో తనకు సగం మాత్రమే అర్థమైందని సెహ్వాగ్ చెప్పాడు. ఆ తరువాతి మ్యాచ్ లో ధోనీ భారీ షాట్లకు పోకుండా నిదానంగా ఆడుతూ ఉండటంతో, తాను ఏమైందని, ఎందుకలా ఉన్నావని అడిగానన్నాడు. మరోసారి ద్రావిడ్ తో తిట్టించుకోవాలని తాను భావించడం లేదని చెప్పిన ధోనీ, తాను నిదానంగా ఆడుతూ మ్యాచ్ ని ముగించే వెళ్తానని చెప్పాడని అప్పటి ఘటన గురించి వెల్లడించాడు.
సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు.. బ్యాటింగ్, బౌలింగ్ బలమున్నా.. ఫినిషింగ్ సమస్యలు గత సీజన్ నుండి వెంటాడుతూ ఉన్నాయి. ఈ సీజన్ లో కూడా మొదటి మ్యాచ్ లో అదే రిపీట్ అయింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు, సన్ రైజర్స్ హైదరాబాద్ పై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఓపెనర్ నితీశ్ రాణా 56 బంతుల్లోనే 80 పరుగులతో రాణించాడు. రాణా స్కోరులో 9 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. వన్ డౌన్ బ్యాట్స్ మన్ రాహుల్ త్రిపాఠి దూకుడుగా ఆడాడు. త్రిపాఠి 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేశాడు. చివర్లో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (9 బంతుల్లో 22) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆండ్రే రస్సెల్ మరోసారి విఫలమయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో మహ్మద్ నబీ 2, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. భువీ, నటరాజన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. భువీ భారీగా పరుగులు ఇవ్వడంతో కేకేఆర్ భారీ స్కోరు సాధించింది.
లక్ష్యఛేదనకు దిగిన సన్ రైజర్స్ రెండో ఓవర్లోనే కెప్టెన్ వార్నర్ వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన వార్నర్... ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అంతకు ముందే హర్భజన్ సింగ్ బౌలింగ్ లో సున్నా పరుగుల దగ్గరే వార్నర్ వెనుదిరగాల్సి ఉన్నా.. అదృష్టం వరించింది. అయినప్పటికీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అప్పటికి సన్ రైజర్స్ స్కోరు 1.3 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే. ఆ తర్వాత ఓవర్లోనే వృద్ధిమాన్ సాహా కూడా అవుటయ్యాడు. ఈ వికెట్ షకీబల్ హసన్ ఖాతాలో చేరింది. జానీ బెయిర్ స్టో (55) హిట్టింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ సాధించినా, విజయ తీరాలకు మాత్రం చేర్చలేకపోయాడు. మనీష్ పాండే 61 (నాటౌట్) పరుగులు చేసి రాణించాడు. పాండే, బెయిర్ స్టో జోడీ 92 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసినా, ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో అద్భుతమైన క్యాచ్ పట్టిన రానా, వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. ఆ తరువాత వరుసగా వికెట్లు పడుతూ ఉండటంతో రన్ రేట్ పెరిగిపోయి, మిగతా వారిపై ఒత్తిడి పెరిగింది. యువ ఆటగాడు అబ్దుల్ సమద్ హిట్టింగ్ చేసినప్పటికీ 188 పరుగులను మాత్రం ఆ జట్టు అందుకోలేకపోయింది. దీంతో సన్ రైజర్స్ జట్టు ఈ సీజన్ లో తమ తొలి ఓటమిని చవిచూసింది.
క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. దీంతో ఈ ఏడాది ఎలాగైనా మెరుగైన ప్రదర్శన చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ దృఢ సంకల్పంతో ఉంది. అయితే మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కు అంతగా కలిసి రాలేదు. ఫీల్డింగ్ లో చెన్నై ఆటగాళ్లు చాలా తప్పులు చేశారు. దీంతో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా కోపం వచ్చేసింది. ఓపెనర్ పృథ్వీ షాఇచ్చిన క్యాచ్‌ని సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ మిచెల్ శాంట్నర్ వదిలేశాడు. అతని ఫీల్డింగ్ చూసిన ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్యాచ్ వదిలే సమయానికి 20 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు పృథ్వీ షా. అతని క్యాచ్ వదిలేయడంతో ధోనీ కాస్త సహనం కోల్పోయాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో లాంగాఫ్ దిశగా పృథ్వీ షా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి ఎక్కువ ఎత్తులో గాల్లోకి లేచింది. లాంగాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ మిచెల్ శాంట్నర్.. ఆ బంతిని క్యాచ్‌గా అందుకోవడంలో విఫలమయ్యాడు. ముందుకు డైవ్ చేయగా.. అతని చేతిలో పడిన బంతి బౌన్స్ అయ్యి నేలపాలైంది. 10వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కి వచ్చిన మొయిన్ అలీ బౌలింగ్‌లో మరోసారి పృథ్వీ షా క్యాచ్ ఇచ్చాడు. ఈ సారి రుతురాజ్ గైక్వాడ్ ఆ క్యాచ్‌ని చేజార్చాడు. దీంతో పృథ్వీ షా చెలరేగి ఆడాడు. తన జట్టుకు కావాల్సిన పరుగులను అవలీలగా చేస్తూ వెళ్ళిపోయాడు.
మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ తమ బౌలింగ్ మెరుగుపడాలని చెప్పుకొచ్చాడు. పిచ్‌పై డ్యూ (మంచు) కనబడిందని..ఇది మొదట బ్యాటింగ్ చేసిన జట్టుపై చాలా ప్రభావం చూపుతుందని అనుకున్నామని.. మంచు పిచ్‌పై ఉంటే అది ఛేజింగ్ జట్టుకే అనుకూలంగా ఉంటుందనేది కాదనలేని వాస్తవమని తెలిపాడు ధోని. టాస్ ఓడిపోయినప్పటికీ ఈ పిచ్‌పై సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే అనుకున్నామని.. అలాగే తొలి అరగంట చాలా జాగ్రత్తగా ఆడాలనుకున్నా అది వీలుపడలేదని ధోని చెప్పుకొచ్చాడు. మేం సాధ్యమైనన్ని ఎక్కువ పరుగుల్ని బోర్డుపై ఉంచాలనే అనుకున్నామని.. అదే లక్ష్యంతో బ్యాటింగ్ చేశాం.. ఇంకా 15-20 పరుగులు చేసి ఉంటే బాగుండేదని తెలిపాడు. మాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మంచు ఉండటంతో బంతి గమనంపై అంచనా దొరకదని.. బంతి ఆగుతూ వస్తుంది. ఫలితంగా ఆరంభంలో కీలక వికెట్లను చేజార్చుకున్నాం. అయినా మా బ్యాటర్స్ బాగా ఆడారు. మా బౌలింగ్ ఇంకా మెరుగుపడాలి.. బౌలర్ల ప్రదర్శన చాలా పేలవంగా ఉందని కాస్త అసహనం వ్యక్తం చేశాడు ధోని. వారు ప్రత్యర్థికి బౌండరీలు ఇవ్వడమే లక్ష్యంగా బంతులు వేసినట్లు కనబడిందని.. తదుపరి మ్యాచ్‌లకు ఈ మ్యాచ్ ఒక గుణపాఠమన్నాడు. ఈ తరహా పిచ్‌పై 200 పరుగులు ఉంటేనే గెలుస్తాం.. ఢిల్లీ బౌలర్లు మంచి లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేశారు. ఈ తరహా పిచ్‌పై ఏ బంతులు వేయాలో అవే వేసి సక్సెస్ అయ్యారని అన్నాడు. మా ఓపెనర్లకు ఢిల్లీ బౌలర్లు వేసిన బాల్స్ నిజంగా అద్భుతమని ధోని మెచ్చుకున్నాడు. తర్వాతి మ్యాచ్ లలో తప్పకుండా పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు ధోని.
చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ను ఓటమితో మొదలుపెట్టింది. భారీ స్కోరును చేధించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏ మాత్రం తడబడలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా అద్భుతంగా ఆడి చెన్నై కు ఏ దశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ లో పొరపాట్లు కూడా ఢిల్లీకి కలిసొచ్చాయి. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
ముంబైలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ సేన, 188 పరుగులు చేసింది. మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా దూకుడు కనబరిచి, 36 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. సురేశ్ రైనా (54), శామ్ కరన్ (34) రాణించారు. మొదట చెన్నై 7 పరుగులకే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (5), డుప్లెసిస్ (0) వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో సురేశ్ రైనా, మొయిన్ అలీ (36) జోడీ వికెట్ల పతనాన్ని ఆపడమే కాకుండా మంచి రన్ రేట్ ను కొనసాగించారు. అంబటి రాయుడు (23), రవీంద్ర జడేజా (26) కూడా వేగంగా పరుగులు సాధించారు. చెన్నై 137 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా శామ్ కరన్ ధాటిగా ఆడడంతో చెన్నై భారీస్కోరు సాధించింది. 15 బంతులు ఎదుర్కొన్న శామ్ కరన్ 4 ఫోర్లు, 2 భారీ సిక్సులతో అలరించాడు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు తీశారు. అశ్విన్, టామ్ కరన్ లకు చెరో వికెట్ లభించింది.
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ధావన్ 54 బంతుల్లో 85, పృధ్వీ షా 38 బంతుల్లో 72 పరుగులు చేయడంతో విజయం దాదాపుగా ఢిల్లీదే అన్నట్లు తయారైంది. మిగతా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే లాంఛనాన్ని పూర్తి చేశారు. చివర్లో పంత్, (15 పరుగులు) స్టోయినిస్ (14 పరుగులు)లు జట్టును విజయ తీరాలకు చేర్చారు. శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. నేడు చెన్నై వేదికగా, రాత్రి 7.30 గంటల నుంచి హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
దుర్బేధ్యమైన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ శ్రేణిని తుత్తునియలు చేసి ఐపీఎల్ లీగ్ 2021 తొలి మ్యాచ్ చివరి ఓవర్లో చుక్కలు చూపించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆల్ రౌండర్ హర్షల్ పటేల్ రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. ఇక కోహ్లీ ఆనందానికైతే పట్ట పగ్గాల్లేవు. కొరకరాని కొయ్యగా భావిస్తున్న ముంబై ఇండియన్స్ పని పట్టడంలో హర్షల్ సాధించిన ఘనతను చూసి ఆర్సీబీ కెప్టెన్ ఉబ్బితబ్బిబ్బయిపోయాడు.
ఒక కెప్టెన్‌గా తననుంచి ఏం ఆశించానో ఆ అంచనాలను హర్షల్ అందుకున్నాడని కోహ్లీ కితాబిచ్చాడు. ఢిల్లీ నుంచి హర్షల్‌ను మేం కొనుగోలు చేశాం. తనదైన ప్రణాళికలతో, జట్టు తనపై పెట్టిన బాధ్యతను నెరవేర్చడంలో సఫలం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో తను ఎంతో ప్రత్యేకంగా నిలిచాడు. డెత్ ఓవర్లలో తన సేవలు కచ్చితంగా వినియోగించుకుంటాం అని కోహ్లీ స్పష్టం చేశాడు. డెత్ ఓవర్ బౌలర్‌గా తనను సీజన్ మొత్తం కొనసాగిస్తామని పేర్కొన్నాడు.
శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అద్భుతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, మార్కో జెన్సన్ వంటి ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు చేర్చి ఉత్కంఠ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆర్సీబీ తరపున ఒకే మ్యాచ్‌లో అయిదుమందిని ఔట్ చేసిన తొలి బౌలర్‌గా కూడా హర్షల్ రికార్డు సృష్టించాడు. తద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన హర్షల్ ఆర్సీబీ అభిమానుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.
సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, ఆర్సీబీ 2 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి గెలుపుతో బోణీ కొట్టింది.
27 పరుగులిచ్చి 5 వికెట్లు సాదించిన హర్షల్ డెత్ ఓవర్లో ముంబై ఇండియన్స్‌ని వణికించాడంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. బ్యాటింగ్‌లో డివీలియర్స్, గ్లెన్ మాక్స్వెల్ మెరుపులు సృష్టించినా ముంబై ఇండియన్స్ విజయావకాశాలను ఆదిలోనే తుంచేసిన ఘనత హర్షల్కే దక్కుతుంది. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తమ జట్టు 20 పరుగులు వెనకబడిందని అంగీకరంచాడంటేనే హర్షల్ తన ప్రత్యర్థి జట్టును ఎంతగా హడలెత్తించాడో అర్థమవుతుంది.
దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
ఐపీఎల్ 2021 లీగ్ తొలి మ్యాచ్‌లో 27 బంతులకు 48 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుపాన్ ఏబీ డివీలియర్స్పై దిగ్గజ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గత సంవత్సరం చివరలో దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ 2020 తర్వాత ప్రొఫెషనల్ సర్క్యూట్ లోకి తొలిసారిగా ప్రవేశించిన డివీలియర్స్ని లెజెండరీ క్రికెటర్లు బ్రియన్ లారా, మాథ్యూ హెడెన్లు ప్రశంసలతో ముంచెత్తారు.
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియన్ లారా తన జట్టుకు అవసరమైన క్షణంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆర్సీబీ ఇన్నిగ్స్ మొత్తంలో రక్షణ కవచంగా డివీలియర్స్ నిలబడ్డాడని లారా కితాబిచ్చాడు.
డీవిలియర్స్ కాలాతీత వ్యక్తి. దండిగా అనుభవమున్నవాడు. ఐపీఎల్లో మాత్రమే క్రికెట్ ఆడుతున్నప్పటికీ డీవిలియర్స్ పూర్తి ఫిట్నెస్తో సిద్ధమయ్యాడని భావిస్తున్నాను. ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ పడ్డాక జట్టుకు అత్యంత అవసరమైన క్షణంలో డీవీలియర్స్ మైదానంలోకి వచ్చాడు. సకాలంలో విస్పోటనం కలిగించాడు. ఆటను పూర్తిగా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. బ్యాటింగ్ వరసలో గ్లెన్ మ్యాక్స్ వెల్ తర్వాత వచ్చినప్పటికీ గేమ్‌పై నియంత్రణ సాధించి ముంబై ఇండియన్స్‌కి చుక్కలు చూపించాడు అంటూ లారా ప్రశంసించాడు.
కాగా అత్యంత క్లిష్టసమయంలో స్ట్రైక్ రోటెట్ చేయడమే ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లో డివీలియర్స్ ఘనత అని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ పేర్కొన్నాడు. నిజంగానే కలకాలం గుర్తుంచుకోదగ్గ ప్రాభవం డివీలియర్స్ చూపించాడు. ప్రశ్నించడానికే లేదు. ఎప్పుడు దూకుడు ప్రదర్శించాలో, ఎప్పుడు కాచుకోవాలో స్పష్టంగా తెలిసిన పరిణితితో ఆడాడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే స్ట్రైక్ రొటేషన్ కొనసాగించడమే. బంతిని ఇంత క్రమబద్ధంగా బాదడం అతడికే తెలిసిన విద్య అంటూ హెడెన్ వ్యాఖ్యానించాడు.
గొప్ప ఆటగాళ్ల ప్రతిభ ఎక్కడ ఉంటుందంటే ఇతర గొప్ప ప్లేయర్లపై తలపడినప్పుడే. జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ డెత్ బౌలర్లలో ఒకరు. ఈ టోర్నమెంటు తొలి మ్యాచ్‌లో పకడ్బందీగా బంతులేశాడు. కాని ఇంతటి గొప్ప బౌలర్‌ని కూడా డివీలియర్స్ బాదిపడేశాడు. ఫ్రంట్ ఫుట్ పై నేరుగా బంతిని ఆడుకున్న డివీలియర్స్ 19వ ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో 12 పరుగులు సాధించాడు. సరిగ్గా ముంబై ఇండియన్స్ ఇక్కడే వెనుకబడిపోయారు. అదే వారి ఓటమికి దారితీసింది అని హేడెన్ పేర్కొన్నాడు.
స్లో పిచ్‌లపై కూడా అత్యంత వైవిధ్యపూరితంగా, దూకుడుగా ఆడగలిగిన ఏకైక ఆటగాడు డివీలియర్స్ మాత్రమే నని శుక్రవారం మరోసారి రుజువైందని ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ తన సహచరుడిని ప్రశంసించడం తెలిసిందే.
ముంబై ఇండియన్స్ తన తదుపరి ఆటను కొల్కతా నైట్ రైడర్స్‌పై ఆడనుండగా, ఆర్సీబీ.. సన్ రైజర్స్ జట్టుతో తలపడనుంది.
కోహ్లీ జాగ్రత్త..!
ఐపీఎల్ లో భారత క్రికెట్ అభిమానులు వేరు.. వేరు ఫ్రాంచైజీలకు సపోర్ట్ చేసిప్పటికీ.. భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేయాలని ఆశిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మెగా టోర్నీ అయ్యాక ఎలాగూ.. భారతజట్టు ఇతర దేశాలతో టోర్నమెంట్లు ఆడాల్సి ఉంటుంది. అందుకే భారత ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక ప్రాక్టీస్ లాగా ఉపయోగపడుతుందని ఆశిస్తారు. ఇక ఐపీఎల్ లో భారత ఆటగాళ్లు గాయాల పాలవ్వడాన్ని కూడా భారత అభిమానులు అసలు తట్టుకోరు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో కోహ్లీకి గాయమవ్వడం అభిమానులను టెన్షన్ పెట్టింది.
విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. 19వ ఓవర్ తొలి బాల్ ను వేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కృనాల్ పాండ్యా కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన కోహ్లీ కంటి దగ్గర బాల్ తాకింది. తొలుత చేతిని తాకిన బాల్, ఆపై నుదుటిపై కుడికన్ను సమీపంలో తాకింది. ఆపై కోహ్లీ కొన్ని క్షణాలు విలవిల్లాడినా, తన జట్టు గెలుపు కోసం మైదానాన్ని వీడలేదు. కోహ్లీ ముఖంపై తగిలిన దెబ్బ కారణంగా, అతని కన్ను ఎర్రగా మారిపోయింది. కంటి నుంచి నీరు కారుతూ కూడా కనిపించింది. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపు కంటి కింద ఐస్ కూడా పెట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత పెవిలియన్ కు వెళ్లిన కోహ్లీ, ఆపై ఓపెనర్ గా బ్యాటింగ్ కు వచ్చాడు. కోహ్లీ కన్ను ఎర్రబడటం, కంటి నుంచి నీరు కారుతున్న ఫొటోలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ముంబై ఇండియన్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడించింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఆఖరి బంతి వరకూ మ్యాచ్ సాగింది. విజయం ఆర్సీబీనే వరించింది. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ కు 2 వికెట్ల పరాజయం తప్పలేదు. సీజన్ తొలిసమరంలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా 160 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్ ఆఖరు బంతికి విజయాన్ని అందుకుంది. 5 వికెట్లను తీసిన బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
ఐపీఎల్-14 సీజన్ మొదలైంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడించింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఆఖరి బంతి వరకూ మ్యాచ్ సాగింది. ఒకానొక దశలో ఎంతో సునాయాసంగా మ్యాచ్ ను బెంగళూరు గెలుస్తుందని భావించారు. కానీ మ్యాచ్ చివరికి ఉత్కంఠగా మారింది. అయినప్పటికీ విజయం ఆర్సీబీనే వరించింది. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ కు 2 వికెట్ల పరాజయం తప్పలేదు.
సీజన్ ఈ తొలిసమరంలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా 160 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్ ఆఖరు బంతికి విజయాన్ని అందుకుంది. 5 వికెట్లను తీసిన బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ముంబయి జట్టుకు తొలిసారి ఆడతున్న క్రిస్ లిన్ 49 పరుగులు సాధించగా, సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ 19, క్రిస్ లిన్ 49, సూర్యకుమార్ 31, ఇషాన్ 28, హార్థిక్ పాండ్యా 13 పరుగుల స్కోర్లకే పరిమితమయ్యారు. బెంగళూరు బౌలర్లలో యువఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ 27 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్,జామీ సన్ చెరో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఆరు ఓవర్లలో ముంబై బ్యాటింగ్ విధ్వంసం ఈ మ్యాచ్ లో కనిపించకపోవడంతో భారీ స్కోరును ముంబై చేరుకోలేకపోయింది.
బెంగళూరు ఇన్నింగ్స్ ను కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కలసి ప్రారంభించారు. సుందర్ 10 పరుగుల స్కోరుకే అవుటైనా…మాక్స్ వెల్ తో కలసి కెప్టెన్ కొహ్లీ కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. డివిలియర్స్ తో కలసి మరో కీలక భాగస్వామ్యం నమోదు చేసి అవుటయ్యాడు. కొహ్లీ 33 పరుగులు, మాక్స్ వెల్ 39 పరుగుల స్కోర్లకు వెనుదిరిగారు. ఇక డివిలియర్స్ తనదైన శైలిలో గ్రౌండ్ నలుమూలలకూ భారీషాట్లు కొట్టి 48 పరుగుల స్కోరు ద్వారా తనజట్టును విజయానికి చేరువ చేశాడు. ఆఖరి ఓవర్లో కాస్త సస్పెన్స్ నటించింది. హర్షల్ పటేల్ విజయానికి అవసరమైన పరుగు సాధించడం ద్వారా బెంగళూరు కు 2 వికెట్ల విజయం అందించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా,జెన్సన్ చెరో 2వికెట్లు, బౌల్ట్, కృణాల్ చెరో వికెట్ పడగొట్టారు.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ
06-07-2020

రహస్యంగా కాజల్ ఎంగేజ్ మెంట్? ఎవరితోనో తెలుసా?
24-08-2020

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?
10-08-2020

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్
09-08-2020

హైదరాబాద్‌లో బాంబు పేలుడు.. కార్లు, బస్సుల అద్దాలు ధ్వంసం
21-08-2020

నారా లోకేశ్ కి విడదల రజనీ షాక్
28-10-2020

ఏంటి రజనీ మేడమ్.. అసలు కథ అదేనా
30-10-2020

అప్పుడలా.. ఇప్పుడిలా..! విడదల రజినీ ఇంతలా మారిపోయారా..?
04-07-2020

విజయసాయి రెడ్డికి ఇష్టం లేని పని జరగబోతోందా?
24-07-2020