లాక్ డౌన్ అంటే చావబాదడమా.. శ్రుతిమించుతున్న పోలీసు చర్యలు
24-03-202024-03-2020 17:49:52 IST
2020-03-24T12:19:52.302Z24-03-2020 2020-03-24T12:19:49.872Z - - 14-04-2021

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా లాక్ డౌన్ పేరిట పోలీసులు తీసుకుంటున్న చర్యలు రెండోరోజుకే శ్రుతిమించిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజల కోసమే పోలీసు ఆంక్షలు అంటూ పైకి ప్రభుత్వాధినేతలు, మంత్రులు, నేతలు, పోలీసుల అధికారులు ఎంత నచ్చచెబుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వాస్తవంగా బడితెపూజతోనే పోలీసులు ప్రజలను కట్టడి చేస్తున్నట్లు సమాచారం అన్ని చోట్లనుంచి వస్తోంది. ప్రత్యేకించి జనతా కర్ప్యూ పేరిట దేశంలోని 130 కోట్లమంది ప్రజలు బ్రహ్మాండంగా ప్రధాని మోదీ పిలుపును ఆదరించి విజయవంతం చేసినప్పటికీ ఆ మరుసటి రోజు అంటే సోమవారం నుంచి వివిధ అవసరాల కోసం ప్రజలు రోడ్లమీదికి రావడమే మహాపాపంగా భావించి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. లాక్ డౌన్ కఠినంగా అమలు చేయడం అంటే బడితె పూజ ఒకటే మార్గమని పోలీసులు తాజాగా భావిస్తున్నట్లుంది. ఇది పోలీసు శాఖనుంచి శ్రుతిమించిన వ్యవహారం అనే చెప్పాలి. పంజాబ్ లో అయితే మరీ ఘోరం. రోడ్లపైకి వచ్చిన వాహనదారులను అదే రోడ్డుపై ఎండలో పరుండబెట్టి శిక్షించిన వైనం షాక్ కలిగిస్తోంది. ప్రజలను కంట్రోల్ చేయడం అంటే ఇలానా అని విస్తుపోతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితి, పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సోమవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్ తీవ్రత ప్రజలకు అర్థమయ్యేలా తొలుత సహనంతోనే సమాధానం చెప్పాలని, స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు సహకరించకపోతే కఠినంగానే వ్యవహరించాలన్నారు. దుకాణదారులు, వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. ఇదేవిధమైన ఆదేశాలు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు సైతం జారీ చేయడంతో ఒక్కరోజులోనే తెలుగు రాష్ట్రాల పోలీసుల తీరు మారిపోయింది. కొన్ని చోట్ల రోడ్లమీద చిన్న బంకుల్లో టీలు, టిఫిన్లు ఇస్తూ సామాన్య ప్రజల ఆకలి తీరుస్తున్న వారిపై ప్రతాపం చూపారు. కూరగాయలు కూడా అమ్మనీకుండా రోడ్లను బ్లాక్ చేశారంటే ప్రజా సంక్షేమానికి ఇది సరికొత్త నిదర్శనమనే చెప్పాలి. ఉన్నట్లుండి జనతాకర్ప్యూ ప్రకటించి, ఒకరోజేలే మనదేం పోయింది పాటించేద్దాం అని ప్రజలు నమ్మేలా చేసి పథకాన్ని విజయవంతం చేసుకున్న కేంద్ర, రాష్ట్లాల ప్రభుత్వాలు ఆ మరుసటి దినంనుంచి మరో పది రోజులపాటు అంటే మార్చి 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఆకస్మికంగా ప్రకటించినప్పుడు ప్రజలకు కలిగిన చింతల్లా ఒకటే. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు వగైరా ఈరోజునుంచి తెచ్చుకోవడం ఎలా అనేది. ఈ ఆలోచనతోనే వచ్చే పదిరోజుల్లో అంగళ్లలో సరుకులు ఉంటాయా లేదా అనే భయంతోనే సోమవారం ఉదయం ప్రజలు రోడ్డుమీదికెక్కారు. రోడ్డెక్కడమే ప్రజలు చేసిన పాపంగా భావించిన ప్రభుత్వం, పోలీసు శాఖ ఆ మాత్రానికే ప్రజలను బండబూతులు తిడుతూ కొన్నిచోట్ల లాఠీచార్జీ చేస్తూ బీభత్సం సృష్టించేశారు. జాతిని ఉద్దేశించి ప్రధాని, జనతా కర్ఫ్యూ గురించి రాష్టాల ముఖ్యమంత్రులు శుక్ర, శనివారాల్లో టీవీల్లో గంటలకొద్దా మాట్లాడారు. పథకం విజయవంతం కావటం గురించే వీరంతా మాట్లాడారు కానీ ప్రజల నిత్యావసరాలను ఎలా తీరుస్తాం అనే భరోసాను మాత్రం ఇవ్వలకపోయారు. ఇదే అదునుగా సోమవారం నుంచి నిత్యావసర వస్తువులు కొండెక్కాయి. పది రూపాయలకంటే తక్కువగా అమ్మిన టమోటా ఒక్క రోజు లోపే 100 రూపాయలకు పెరగడం, 40 రూపాయలున్న పచ్చి మిర్చి 150 రూపాయలకు చేరుకోవడం.. ఇలా ప్రతి కూరగాయల ధరా చుక్కలనంటింది. దీంతో దిక్కుతోచని జనం ప్రభుత్వ ఆదేశాలను కూడా ధిక్కరించి ఎక్కడ చౌకగా దొరుకుతున్నాయని సమాచారం వస్తే అక్కడికల్లా పరుగులు తీశారు. ఆదేశాలను ఉల్లంఘించారు. ప్రజల ప్రాధమిక అవసరాలకు భరోసా కల్పించడంలో కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఘోరంగా విఫలమయ్యాయి. 130 కోట్లమంది అవసరాలను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు ప్రజలు తమ అవసరాల కోసం ఆదేశాలను ఉల్లంఘిస్తే మాత్రం దండనే పరిష్కారంగా భావించాయి. ప్రజల కోసమే ఆంక్షలు అంటున్న ప్రభుత్వాలు, అధికారులు ఆ ప్రజల పది రోజుల కనీస అవసరాలను తీర్చడంలో, భయపడవద్దు మీ అవసరాలను మేం తీరుస్తాం అనే భరోసా కల్పించడంలో కానీ ఘోరవైపల్యం చెందినట్లే చెప్పాలి. ‘లాక్‌డౌన్‌పై నిర్లక్ష్యం పనికిరాదు. దీన్ని ఎందుకు ప్రకటించామో గుర్తించాలి. లాక్‌డౌన్‌ను తీవ్రంగా పరిగణించి ప్రతి ఒక్కరూ విధిగా లాక్డౌన్ నియమాలు పాటించాలి. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని’ అని ప్రధాని మోదీ తాజాగా ట్వీట్ చేశారు. మనల్ని మనం రక్షించుకోవడానికే లాక్డౌన్ పాటించాలని మోదీ పేర్కొన్నారు. కానీ లాక్ డౌన్ పాటించడం అంటే స్వచ్చందంగానా నిర్బంధంగానా.. పోలీసులు కొట్టి మరీ లాక్ డౌన్ చేయిస్తారా అనే ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పాలి? ప్రజలపై ప్రతాపం కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కఠినమైన ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. జనతా కర్ప్యూ తర్వాత తొలిరోజే దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా విజయవంతం చేసిన ప్రజలు ఈ నెల 31 వరకు ప్రకటించిన లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు అమలులోకి తెచ్చాయి. లాక్డౌన్ అమలుకు స్వచ్ఛందంగా ప్రజలు సహకరించే పరిస్థితి లేకపోవడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి పోలీసులు రోడ్లపైకి వచ్చి తగు చర్యలు చేపట్టారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాలతోపాటు అనేక పట్టణాలు, జిల్లా కేంద్రాలు, గ్రామాల్లోనూ పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేసి, ప్రధాన రహదారులను మూసివేశారు. ఆటోలు, ప్రైవేటు వాహనాలు బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. బ్రిటిష్ కాలంనాటి 1897 చట్టాన్ని ‘ఆంధ్రప్రదేశ్ అంటు వ్యాధి కొవిడ్–19 రెగ్యులేషన్ 2020’గా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అంటు వ్యాధుల చట్టం –1897లోని సెక్షన్ 2,3,4 ప్రకారం కఠినమైన నిబంధనలు అమలు చేస్తారు. తద్వారా గాలి, మనిషి నుంచి మనిషికి వ్యాధి సోకకుండా నియంత్రించేందుకు అత్యవసరం మినహా సకల వ్యవస్థలను దిగ్బంధించే ప్రయత్నం చేస్తారు. దీన్నే లాక్‌డౌన్‌గా వ్యవహరిస్తున్నారు. కరోనా నిబంధనల అతిక్రమణ.. నడిరోడ్డుపై పడుకోబెట్టిన పంజాబ్ పోలీసులు మహమ్మారి కరోనా విజృంభణ ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 16 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. 3 లక్షల 80 వేల మంది చికిత్స పొందుతున్నారు. ఇక భారత్‌లో సైతం ప్రాణాంతక కోవిడ్‌తో 10 మంది మృతి చెందగా.. 500 మందికి పాజిటివ్ అని తేలింది. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వగా.. కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. అయితే, ప్రజల్లో మాత్రం సీరియస్‌నెస్ కనిపించడం లేదు. రవాణా వ్యవస్థపై తీవ్ర ఆంక్షలు ఉన్నప్పటికీ రోడ్లపైకి వస్తున్నారు. దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులకు జరిమానాలతో పాటు, అవసరమైతే కేసులూ పెడుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్ పోలీసులు కొందరు వాహనదారులకు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లఘించిన వాహనదారులను నడిరోడ్డుపై పడుకోబెట్టి.. ‘రూల్స్‌ని పాటిస్తాం.. ఇంకోసారి రోడ్లపైకి రాబోము’ అని చెప్పిస్తున్నారు. ఈ వీడియోను పంజాబ్ ఐపీఎస్ అధికారి పంకజ్ నైన్ ట్విటర్లో పోస్టు చేయగా వైరల్ అయింది. ‘సామాజిక దూరం పాటించకపోతే.. ఇలాంటి శిక్షలు తప్పవు. దూరం దూరంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి. ఇది పిక్నిక్ టైమ్ కాదు’ అని ఐపీఎస్ అధికారి క్యాప్షన్ పెట్టారు. ఇలాంటి వార్తలను చూసిన వారికి పోలీసులు ప్రజల మిత్రులుగానే ఉంటున్నారా ఆనే సందేహం వస్తే దానికి జవాబుదారీ ఎవరు? కాలుతున్న రోడ్లమీద వాహనదారులును పరుండబెట్టడం అనేది బ్రిటిష్ కాలంలో అమలు చేసిన ఘోర చర్య. 70 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత కూడా ఇలాంటి చర్యలు కొనసాగితే ఇక సామాన్యులకు దిక్కెవరు అనిపించదా కరోనా వైరస్ నిరోధం పేరిట కొరడా ఝలిపిస్తున్న ప్రభుత్వాలు, పోలీసు శాఖ కాస్తంత మానవీయంగా వ్యవహరిస్తే ఇలాంటి మరకలు తొలిగిపోతాయి..కానీ పాటించేదెవరు? లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోకుండా బయట తిరిగేవారిపై కేసులు నమోదు చేయడంలో వెనకాడవద్దని ఆదేశిస్తున్న రాజకీయ నేతలు, అధికారులు.. అసలు ప్రజలు ఎందుకు రోడ్లమీదికి వస్తున్నారు. వారి ఇబ్బందులు ఏమిటి అనే కోణంలో కాస్తంతయినా ఆలోచిస్తే ఈ దూకుడు చర్యలు ఉండవు. అసలు వ్యవహారం మాని కొసరు పనులు చేస్తే ఉన్న పరువు కాస్త పోతుందనే చెప్పాలి. అమ్మా.. చెల్లీ... అన్నా దండం పెట్టి చెబుతున్నాం... ప్రయాణాలు చేయకండి....ఇళ్ళకే పరిమితం కండి... కరోనా వైరస్ నివారణకు సహకరించండంటూ వాహనదారులను వేడుకున్నారు ఆదిలాబాద్‌కి చెందిన పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు... కరోనా మనలో ఉందో లేదో ఎలా వస్తుందో కూడా చెప్పలేం, ఇంటిల్లిపాది, గ్రామం, దేశం సురక్షంగా ఉండాలంటే సహకరించండంటూ ఇలా రోడ్లపై తిరిగితే వైరస్‌ను కట్టడి చేయలేమని కోరారు... పెద్దపల్లి కమాన్ చౌరస్తా వద్ద సోమవారం రాజీవ్ రహదారిపై వచ్చి పోయే ప్రయాణికులకు ఇలా మూకుమ్మడిగా దండాలు పెడుతూ వినూత్న కౌనెల్సింగ్ నిర్వహించారు పెద్దపల్లి ట్రాఫిక్ సిబ్బంది లాక్ డౌన్ తొలిరోజు ఈ వార్త ఎంత పాజిటివ్ వాతావరణాన్ని కల్పించిందంటే పోలీసుల ఈ తరహా అభ్యర్థనను ప్రశంసించని వారు లేరు. కానీ ఒక్కరోజులోనే పోలీసులు శాంతాన్ని వదిలి, దండేన్ని పట్టుకోవడంతో ఆ కాసింత మంచిపేరు కూడా గంగలో కలిపినట్లయింది.

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
25 minutes ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
an hour ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
2 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
3 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
5 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
5 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
20 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
20 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
21 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
19 hours ago
ఇంకా