newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రైతుల ఇంట పంట పండించిన యాసంగి.. అన్నపూర్ణగా అవతరిస్తున్న తెలంగాణ

17-04-202017-04-2020 16:39:07 IST
Updated On 17-04-2020 18:37:47 ISTUpdated On 17-04-20202020-04-17T11:09:07.095Z17-04-2020 2020-04-17T11:09:03.065Z - 2020-04-17T13:07:47.761Z - 17-04-2020

 రైతుల ఇంట పంట పండించిన యాసంగి.. అన్నపూర్ణగా అవతరిస్తున్న తెలంగాణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక వైపు కోవిడ్19 సాంక్రమిక వ్యాధితో అలుపెరగని పోరాటం చేస్తున్న తెలంగాణ తాజాగా పంట సిరులతో పరవశించిపోతోంది. నీళ్లు, ఉద్యోగాల్లో తమ వాటాకోసం దశాబ్దాలు పోరాడి సొంత రాష్ట్రం కలను సాకారం చేసుకున్న తెలంగాణ  ఆ నీళ్ల సాక్షిగా ఇవ్వాల అన్నపూర్ణలా మారి రైతుల ఇంట పంట సిరులను కురిపిస్తోంది. నేల ఈనిందా.. బంగారం పండిందా అన్నట్లుగా ఎటు చూసినా తెలంగాణ పొలాల్లో కోతల కోలాహలం మొదలైంది. నిన్నటిదాకా ఆకుపచ్చరంగులో

కళకళలాడిన వరిపొలాలు ఇప్పుడు తెలంగాణ రైతుల కళ్లాల్లో నిండారపోసిన ధాన్యపు రాశులుగా మారుతున్నాయి. యాసంగి పంట అంచనాలను మించిపోవడంతో ఆనందంతో మురిసిపోవడం రైతుల వంతు అయితే ఒక ధాన్యం గింజ కూడా రైతు నష్టపోకుండా రైతుల ఇళ్లవద్దనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం ధాన్యం కొనబోతున్న ప్రభుత్వం భారీస్థాయిలో ధాన్యరాశులను నిల్వ చేసుకోబోతోంది. ఆరు దశాబ్దాల కల. వందలాది మంది అమరుల ప్రాణత్యాగాలు, సొంత రాష్ట్రం..సాకారమైన ఆరేళ్లకు తెలంగాణ భారతదేశ ధాన్యాగారంలా తన పేరు లిఖించుకోవడానికి సగర్వంగా లేచి నిలబడుతున్న క్షణం ఇది. పంటకోసం కాసిన్ని నీళ్లు చివరి వరకూ ఇప్పిస్తే ప్రపంచంలో ఎక్కడైనా సరే రైతు సృష్టించే పంటల విప్లవం ఏ స్థాయిలో ఉంటుందో చూపే నిలువెత్తు సాక్ష్యం నేటి తెలంగాణ.

ప్రాజెక్టులు, చెరువులు పొలాలకు ఊపిరులూదితే వచ్చే ఫలితాన్ని నేడు తెలంగాణ భూములు నిలువెత్తు సంతకం పెట్టి మరీ చూపిస్తున్నాయి. రాష్ట్రంలో గతేడాది జూన్‌లో విస్తారంగా వర్షాలు కురవడంతో ఎస్సారెస్పీ, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎల్లంపల్లి నీటితో నిండాయి. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 60 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో సాగునీటి ప్రాజెక్టుల కింద ఏకంగా 40లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఎస్సారెస్పీ మొదటి, రెండో దశల కిందే 12 లక్షల ఎకరాలు సాగు కాగా, నాగార్జునసాగర్‌ కింద 6.40లక్షల ఎకరాల్లో పూర్తిస్థాయిలో సాగు జరిగింది. 

ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి దాదాపు 5వేల చెరువులు నింపారు. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో భూగర్భజల సగటు మట్టం గతేడాది 12 మీటర్ల వరకు ఉండగా, అది ఈ ఏడాది ఏకంగా 7 మీటర్లకు చేరింది. దీంతో బోర్ల కింద సాగు పెరిగింది. ఇందులో ఎక్కువగా వరి పంటే సాగైంది. గతేడాది యాసంగిలో మొత్తంగా 18.57లక్షల ఎకరాలలో వరి సాగవగా, అది ఈ ఏడాది ఏకంగా 40లక్షల ఎకరాలకు పెరిగింది. పంటకు ఎక్కడా నీటి కొరత లేకుండా ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలో చివరి తడి వరకు నీటిని అందించడంతో దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది.

లాక్ డౌన్ నుంచి వ్యవసాయానికి సడలింపు చేస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం కరీంనగర్, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో వరికోతలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ఎకరాకి కొన్నిచోట్ల 30 – 32 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. మిగతాచోట్ల ఎకరాకు 27 – 29 క్వింటాళ్ల ధాన్యం వస్తోంది. ఈ క్రమంలోనే కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కనీసంగా 91లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. గతేడాది యాసంగిలో 37లక్షల మెట్రిక్‌ టన్నులు, మొన్నటి ఖరీఫ్‌లో 47.11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా, ఇప్పుడది రెట్టింపైంది.

ప్రాజెక్టుల్లో నీటి లభ్యత మెరుగ్గా ఉండటం, కాళేశ్వరం జలాలతో నీటి ఎత్తిపోతలు పెరగడంతో గోదావరి పరివాహక జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌తో పాటు కష్ణా పరివాహకంలోని నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో గణనీయంగా పంటలు సాగయ్యాయి. ఉమ్మడి కరీంగనర్‌ జిల్లాలో 2018–19 యాసంగిలో వరిసాగు విస్తీర్ణం 3.72లక్షల ఎకరాలు కాగా, అది ఈ ఏడాది 7.92లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం దిగుబడి 9.14లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా, అది ఈ ఏడాది 15.95లక్షల వరకు ఉంటుందని అంచనా. 

దేవాదుల, ఎస్సారెస్పీ–2 ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈ సీజన్‌లో 4,38,033 ఎకరాల్లో వరి సాగైంది. 9.32 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఖరీఫ్‌లో 557 కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రస్తుతం 1,031 పెట్టాలని భావిస్తున్నారు. అవసరమైతే వీటి సంఖ్యను పెంచుతారు. పూర్వ నల్లగొండ జిల్లాలో సాగర్, ఎస్సారెస్పీ–2 కింద నింపిన చెరువుల పరిధిలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుత నల్లగొండ జిల్లాలోనే గత సీజన్‌లో 1.75లక్షల ఎకరాల్లో సాగు జరగ్గా, ప్రస్తుతం 3.75లక్షల ఎకరాలు సాగయ్యాయి. 

ఈ ఏడాది ఇక్కడ 7.58లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం వస్తుందని అంచనా. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే ముగిసిన ఖరీఫ్‌లో 1.15లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా, ఈ ఏడాది 8.64 లక్షల టన్నుల మేరకు సేకరిస్తారని అంచనా. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 14లక్షల మెట్రిక్‌ టన్నులు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8.50లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశారు.

రికార్డు స్థాయిలో కొనుగోళ్లు..

ఈ నెల మొదటి వారం నుంచి మొదలైన ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కేవలం పది రోజుల్లోనే ఏకంగా 3,516 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.81లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు పుంజుకుంటుండటంతో ఇకపై సేకరణ మరింత ముమ్మరం కానుంది. కొనుగోలు కేంద్రాల్లో పరిమిత దూరం పాటించాలని రైతులకు సూచిస్తున్నారు. ఖరీఫ్‌లో చెల్లించిన మద్దతు ధర మాదిరే ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాకు రూ.1,835, సాధారణ రకానికి రూ.1,815గా చెల్లిస్తున్నారు. ఇప్పటికే రూ.500 కోట్ల మేర చెల్లింపుల ప్రక్రియ పూర్తయింది. ఇక కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్‌ కేంద్రాలకు తరలించేలా రవాణా ఏర్పాట్లు చేశారు.

కేవలం నీటి సరఫరాను మెరుగుపరిచి తమకు సకాలంలో సాగునీరు అందించిన ఫలితాన్ని ఈ యాసంగిలో విరగపండిన పంటల రూపంలో చూస్తున్నామని తెలంగాణ రైతులు పట్టలేని సంతోషంలో మునిగితేలుతున్నారు. గత సీజన్‌కు ఇప్పటి సీజన్‌కు రెండు రెట్లు పెరిగిన పంట దిగుబడులతో ఊపిరి పోసుకుంటున్నామని వచ్చే రబీ సీజన్‌లో ఇలాగే దిగుబడులు వస్తే సంవత్సరాలుగా పోగుపడిన తమ అప్పులు సైతం తీర్చుకోగలమని రైతులు కొండంత ఆశను పెట్టుకుంటున్నారు. చెరువులకు నీరు అందించిన కారణంగా వరి పంట ఈసారి తమ ఇళ్లలో ధాన్య సిరులను కురిపించనుందని రైతులు పరమానందభరితులవుతున్నారు.

150 ఏళ్ల క్రితం గోదావరి నదిపై కట్టిన ఆనకట్ట ఆంధ్రప్రదేశ్‌ను ధాన్యాంధ్రప్రదేశ్‌గా మార్చింది. ఆ చరిత్ర ఇప్పుడు తెలంగాణలో నిండిన చెరువులు, ప్రాజెక్టులు సాక్షిగా పునరావృతమవుతోంది. ఈ ఆరేళ్ల కాలంలో తెలంగాణ సాధించిన అద్భుత విజయం ఇది. ప్రభుత్వ సంకల్పం, రైతుల కఠిన శ్రమ కలిసి సాధించిన కొత్త చరిత్ర ఇది. 

రైతుకు ఏ చిన్నకష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వం.. రైతు చెంతనే రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు.. కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణపై ఆశలు... రైతుల బతుకు పచ్చనాకులా మెరిసిపోవడం.. ఇది కదా తెలంగాణ కల అంటే.. నిజంగానే తెలంగాణ కల ఇప్పుడు సాకారమవుతోంది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle