newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా జోన్లపై కేంద్ర వర్గీకరణపై అపనమ్మకం.. లాక్‌డౌన్ సడలింపు లేదంటున్న కేసీఆర్

17-04-202017-04-2020 09:48:07 IST
Updated On 17-04-2020 09:56:29 ISTUpdated On 17-04-20202020-04-17T04:18:07.511Z17-04-2020 2020-04-17T04:18:05.301Z - 2020-04-17T04:26:29.310Z - 17-04-2020

 కరోనా జోన్లపై కేంద్ర వర్గీకరణపై అపనమ్మకం.. లాక్‌డౌన్ సడలింపు లేదంటున్న కేసీఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రప్రభుత్వం ప్రకటించిన కరోనా జోన్ల వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర వైద్యాధికారులు అపనమ్మకంతో తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారని విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కనీసం సంప్రదించకుండా కేంద్రం ప్రకటించిన రెడ్ జోన్ల నిర్ధారణలో ఏమాత్రం శాస్త్రీయత లేదని తెలంగాణ ప్రభుత్వం స్థిరమైన అభిప్రాయానికి వచ్చేసింది. అందుకే కేంద్ర ప్రభుత్వ రెడ్ జోన్ల నిర్ధారణతో పనిలేకుండానే రాష్ట్రంలో కంటైన్మెంట్ ప్రాంతాల్లోనే ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తీర్మానించుకున్నాయి. ఇది కేంద్ర వైఖరిని ధిక్కరించినట్లు కనపడినా క్షేత్ర వాస్తవాలకు అనుగుణంగానే తాము వైరస్ నివారణ చర్యలను చేపడతామని స్పష్టం చేశాయి. మొత్తం వ్యవహారంపై చర్చించి నిర్ణయం తీసుకోవటానికి  సీఎం కేసీఆర్ శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. 

వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో కేసులు ఉన్నా కేంద్రం పట్టించుకోలేదని, ముఖ్యంగా ఇటీవల భారీగా కరోనా కేసులు పెరిగిన వికారాబాద్ జిల్లా వైరస్ విస్తృతి విషయంలో రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉంటే దాన్ని తీసుకుపోయి ఆరెంజ్ జోన్లో ఉంచడం ఏంటని తెలంగాణ వైద్యాధికారులు ఆశ్చర్య పడుతున్నారు. ఈ పరిణామాల వెలుగులో కేంద్రం ప్రకటించిన రెడ్‌జోన్‌ జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. రెడ్‌జోన్లను నిర్ధారించడంలో శాస్త్రీయత లేదని, అయితే వాటితో సంబంధం లేకుండా రాష్ట్రంలో కంటై న్మెంట్‌ ప్రాంతాల్లోనే ప్రత్యేక చర్యలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. 

ప్రధానంగా కరీంనగర్‌ జిల్లాలో ఇటీవల కేసులు పెరగకున్నా దాన్ని రెడ్‌జోన్‌గా కేంద్రం ఎందుకు ప్రకటించిందో అర్థం కావట్లేదని ఓ కీలక అధికారి వ్యాఖ్యానించారు. వికారాబాద్‌ జిల్లాలో ఇటీవల కేసుల సంఖ్య భారీగా పెరిగిందని, రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంటే, ఆరెంజ్‌ జోన్‌లో ఉంచడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేటలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల కేంద్రం ప్రకటించిన రెడ్‌జోన్లు, ఆరెంజ్‌ జోన్లతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 159 కంటైన్మెంట్‌ ప్రాంతాలపైనే దృష్టి సారిస్తామని ఓ కీలకాధికారి తెలిపారు. వీటిని కేసుల సంఖ్య, తీవ్రత ఆధారంగా అత్యంత శాస్త్రీయంగా ప్రకటించామని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో 8 జిల్లాలను లార్జ్‌ ఔట్‌బ్రేక్‌ హాట్‌స్పాట్లు (రెడ్‌జోన్లు)గా కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్‌ అర్బన్, రంగారెడ్డి, జోగుళాంబ గద్వాల, మేడ్చల్, కరీంనగర్, నిర్మల్‌ ఉన్నాయి. రెడ్‌ జోన్‌ (హాట్‌స్పాట్‌ క్లస్టర్‌)గా నల్లగొండ జిల్లాను ఎంపిక చేశారు. కేసులు నమోదైన మిగిలిన జిల్లాలను ఆరెంజ్‌ జోన్లుగా ప్రకటించింది. అంటే 8 జిల్లాల్లో తీవ్రమైన కేసులున్నట్లు కేంద్ర సర్కారు గుర్తించింది. అయితే వీటిని గుర్తించే విషయంలో తమను పరిగణనలోకి తీసుకోలేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. 

కేంద్రం ప్రకటించిన రెడ్‌జోన్‌ జిల్లాల ప్రకారం కాకుండా, మనం ఏర్పాటు చేసుకున్న కంటైన్మెంట్‌ ఏరియాలను దిగ్బంధం చేసి, మిగిలిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తే సరిపోతుందని కరోనా నియంత్రణ రాష్ట్ర ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం రావట్లేదని కూడా వ్యాఖ్యానించారు. ‘కిట్లు అడిగాం. కానీ 10 శాతం వరకు మాత్రమే వచ్చాయి. ఇక ఆర్థికసాయం అంటూ ఏమీ లేదు' అని పేర్కొన్నారు. ఆర్థిక సాయం లేనప్పుడు రెడ్‌జోన్లు ప్రకటిస్తే వచ్చే ప్రయోజనమేంటని ప్రశ్నించారు. దీనివల్ల వైరస్‌ను పారదోలలేమని అంటున్నారు.

ప్యాకేజీలు లేకుండా జోన్ల ప్రకటనతో ప్రయోజనం శూన్యం

వివిధ దేశాలు ఆర్థిక గడ్డు పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్యాకేజీలు ప్రకటిస్తుంటే, ఆ దిశగా కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటనా జారీ కాలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కఠినంగా తీసుకుంటున్న చర్యలను నీరు గారుస్తున్నట్లు ఉన్నాయని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. లాక్‌ డౌన్‌ విషయంలో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రం కఠినంగా లాక్‌ డౌన్‌ ను అమలుచేస్తుంటే కేంద్రం మాత్రం కొన్ని మినహాయింపులు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. 

కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలతో పలు రంగాల్లో లాక్‌ డౌన్‌ ఎత్తివేసినట్లవుతుందని పేర్కొంటున్నాయి. అలా జరిగితే వైరస్‌ను ఎదుర్కోవడం కష్టమవుతుందని, ఇప్పటివరకు చేసిన కఠోర శ్రమ వృథా అవుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లాక్‌ డౌన్‌ను ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 30 వరకు కఠినంగా కొనసాగించాలని యోచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

లాక్‌ డౌన్‌ నిబంధనలను సడలించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు పాక్షికంగా ద్వారాలు తెరవడం వల్ల జనం ఇళ్ల నుంచి బయటకు వస్తారని, అప్పుడు మే 3 వరకు లాక్‌ డౌన్‌ ఉన్నా లాభం ఉండదని చెబుతున్నారు. కేంద్రం రెడ్‌జోన్ల ప్రకటన, జాతీయ స్థాయి మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 

లాక్ డౌన్‌ని సడలించే ప్రశ్నే లేదు. అలా చేస్తే నియంత్రణ ఎగిరిపోవటం ఖాయం:

మొత్తం పరిణామాలను బేరీజు వేసుకున్నాక, కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధం కోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌కు రాష్ట్రంలో ఎలాంటి సడలింపులూ ఇవ్వకూడదనేది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి ‘కంటైన్మెంట్‌’లో లేని ప్రాంతాలకు పలు మినహాయింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, తెలంగాణలో వాటిని పాటించటానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదని సమాచారం. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

తాజాగా కేంద్రం లాక్‌డౌన్‌కు 20వ తేదీ నుంచి ‘కంటైన్మెంట్‌’లో లేని ప్రాంతాలకు పలు మినహాయింపులను ప్రకటించింది. ఈ మేరకు ప్రజా రవాణా మినహా చాలా రంగాలకు మరో మూడు రోజుల్లో లాక్‌డౌన్‌ నుంచి సడలింపు లభించాల్సి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లాక్‌డౌన్‌ మధ్యలో కొన్ని రంగాలకు మినహాయింపు ఇవ్వటానికి సీఎం కేసీఆర్‌ సానుకూలంగా లేరు. భవన నిర్మాణ పనులు చేపట్టవచ్చని కేంద్రం పేర్కొంది. ఇదే జరిగితే కూలీలు వస్తారు. స్టీలు, సిమెంటు, ఇసుక, కంకర కావాలి. దీనికి ఆ షాపులన్నీ తెరుచుకోవాలి. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకూ కేంద్రం మినహాయింపు ఇచ్చింది. వారికి సామాగ్రికి కోసం ఆయా దుకాణాలూ తెరవాలి. 

వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన పనులకు కేంద్రం మినహాయింపు ఇచ్చింది. వరి కోతలకు యంత్రాలను వాడినా పూలు, పండ్ల తోటల్లో కూలీలను ఉపయోగించాల్సిన పరిస్థితి. దీంతో గ్రామాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. ప్రజలు బయటకురావడం, గుమిగూడడం పెరుగుతుందన్నది ప్రభుత్వ ఆందోళన. దీని వల్ల  ప్రభుత్వ చర్యలకు విఘాతం కలుగుతుందని, రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరుగుతాయని భావిస్తోంది. ఈ కారణాలతో కేంద్రం ఇచ్చిన మినహాయింపులను కొనసాగించకూడదని భావిస్తోంది. 

‘కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధం కోసం ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న చర్యలకు లాక్‌డౌన్‌ సడలింపుతో ఆటంకం కలుగుతుంది. జనం రాకపోకలను పూర్తి స్థాయిలో నియంత్రించలేం. వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇన్ని రోజులు ఆర్థికంగా నష్టపోయి, ప్రజలను ఇళ్లకు పరిమితం చేసి కొనసాగించిన లాక్‌డౌన్‌కు అర్థం ఉండదు. మళ్లీ పరిస్థితి మొదటి వచ్చే అవకాశం ఉంది’ అనేది కేసీఆర్ అభిప్రాయంగా తెలుస్తోంది. 

ఈ పరిణామంపై చర్చించి నిర్ణయం తీసుకోవటానికి కేసీఆర్ శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఇక్కడి ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్‌ సమావేశం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతుందని సీఎంవో గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. 

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు యథావిధిగా కొనసాగించటమా? లేక కేంద్ర ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఈనెల 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వటమా? అనే అంశంపై చర్చించి కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకోనుంది. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 20 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నుంచి ఏ రంగానికీ మినహాయింపు ఉండబోదని తెలుస్తోంది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle