newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

సంక్రాంతి సంస్కృతి కరెన్సీ నోట్లలోకి మారిపోయింది..!

14-01-201914-01-2019 14:10:47 IST
Updated On 14-01-2019 14:09:28 ISTUpdated On 14-01-20192019-01-14T08:40:47.705Z14-01-2019 2019-01-14T08:36:50.540Z - 2019-01-14T08:39:28.629Z - 14-01-2019

సంక్రాంతి సంస్కృతి కరెన్సీ నోట్లలోకి మారిపోయింది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏదా సంక్రాంతి సందడి... ఎక్కడికి పోయింది.. పిండి వంటల ఘుమఘుమలు, ఇళ్లముందు రంగవల్లులూ, వాటి నడిమిట కూర్చున్న గొబ్బెమ్మలూ, ఈడొచ్చిన ఆడపిల్లల పరికిణీల రెపరెపలూ, కొత్తల్లుళ్ల  అలకలు, ఆ బావల్ని ఆటపట్టించే మరదళ్లు, ఇంటిల్లిపాదీ కలిసి కబుర్లు చెప్పుకుంటూ చేసే భోజనాలు, గంగిరెద్దులనేసుకుని ఇంటింటికీ తిరిగే హరిదాసులూ, తీర్ధాలు,తిరునాళ్ళు.... అన్నీ ఉన్నాయనీ... ఉంటాయనీ ఆశపడి ఊళ్లకెళ్లి అక్కడా దృశ్యాలు కనిపించక దిగాలుపడిపోయే రోజులివి. ఇప్పుడా సంక్రాంతిని సినిమాల్లోనే చూడగలం. మన సంస్కృతిని వేషాలేసుకున్న యాంకర్లలోనే చూసి సరిపెట్టుకోవాలి. ముగ్గుల పోటీలంటూ పెట్టిన టీవీల్లోనే రంగవల్లుల్ని చూసుకుని మురిసిపోవాలి. 

Image result for sankranthi culture

పేకాట లేని పండగా ఒక పండగేనా... అదీ సగటు తెలుగు మగరాయుళ్ల పండగ సరదా ! ఇప్పుడీ జూదక్రీడ టార్గెట్ రెండువేల కోట్ల రూపాయలపైనే ఉంటుందంటూ క్షేత్ర స్థాయి రిపోర్టులు. పేకాట, గుండాట, కోతాట అంటూ భారీ మొత్తాలు చేతులు మారుతాయి. నిజానికి కోడి పందేల్లో కంటే పేకాటలోనే పెద్ద మొత్తాలు చేతులు మారుతుంటాయి. ఒకప్పుడు గోదావరి జిల్లాలకే పరిమితమైన కోళ్లపందాలతో జత కలిసిన పేకాట ఇప్పుడు కృష్ణ, గుంటూరు,ప్రకాశం జిల్లాలకు పాకింది. ఎన్నికల సామ్ తాత్సారం కావడంతో  పొలిటీషియన్లూ పోలీసులది జస్ట్ ప్రేక్షకపాత్రే ! కొంతమంది రాజకీయ నాయకులైతే దగ్గరుండీ మరీ ఏర్పాట్లు చేయడం, స్పోర్ట్స్ ఎండ్ గేమ్స్ అంటూ బోర్డులు పెట్టి బరులు సిద్ధం చేయడం, అక్కడే మద్యం విక్రయాలకు ఏర్పాట్లు చేయడం పూర్తయిపోయింది. ఇదంతా లాభసాటిగా ఉండడంతో ముందే చాలా చోట్ల వ్యవసాయ క్షేత్రాల్ని లీజుకు తీసుకుని అక్కడే బరుల్ని ఏర్పాటు చేసి ప్రతీ రౌండుకూ ఫుల్ వాటాల్ని వసూలు చేసి కుమ్మేస్తున్న కొత్త బిజినెస్‌‌కు  తెర లేచింది. కోళ్ల పందాలకంటే పేకాట రౌండ్లకే స్పీడ్ ఎక్కువ కాబట్టి కొన్ని గంటల్లోనే లక్షల్లో చేతులు మారుతుంటాయి.! 

ఇక నగరాలు పట్టణాల్లో పండగ మీనింగే  మారిపోయింది. రెడీమేడ్ పండగ. ఇవాళ్టి బద్దకాల ప్రపంచంలో ముగ్గులెవరేస్తున్నారు. నగరాలు,పట్టణాల్లో ఒకప్పుడు కనిపించిన పండుగ సందడి ఇప్పుడు పూర్తిగా కనుమరుగవుతోంది. ఇంటిముందు ముగ్గులు వేసే ఆడవాళ్లు, పిండివంటల్లో నిమగ్నమైపోయే పెద్దవాళ్ళు, పతంగులు,మాంజాలంటూ హడావుడి చేసే యువతరం ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో బాగా తగ్గిపోయింది. అసలా వ్యాపారమే పూర్తిగా దెబ్బతినిపోయింది. రెడీమేడ్ పిండివంటల్ని అమ్మే హోమ్ ఫుడ్ సెంటర్లు గల్లీగల్లీలో కనిపిస్తాయి. ఇంట్లో వంట చేసుకునే తీరికలెక్కడివి? అన్నీ బయట నుంచే  పార్శిల్ !  స్విగ్గీ , జొమోటో, ఉబర్ ఈట్స్ ఆన్ లైన్ ఆర్డర్లతో డోర్ డెలివెరీలు. 

సినిమా వాళ్ళకి సంక్రాంతి వెరీ స్పెషల్! బాక్సాఫీసు నుంచి ఎన్నికోట్లు కొల్లగొట్టుకోవాలన్న లెక్కలు ముందే డిసైడ్ అయిపోతాయి. బాలయ్య సినిమా, రామ్ చరణ్ మూవీ , విక్టరీ-వరుణ్ తేజ్ ల బొమ్మలన్నీ సంక్రాంతికే పడ్డాయి. మధ్యలో రజని సినిమా.. ఈ అయిదారు సినిమాలన్నీ 300 కోట్ల రూపాయల వ్యాపారం చేసిపెడతాయన్న అంచనాలే అక్కడ కనిపిస్తాయి. సినిమా ఒక వినోద సాధనమన్న కాన్సెప్ట్ పక్కనపెడితే అదే సినిమా సామాన్యుడి బలహీనత కూడా అన్న ప్రాతిపదిక మీదే సెల్యులాయిడ్ వ్యాపారం జరిగిపోతోంది. ఇందులో సంస్కృతీ లేదు.. సంస్కారాలూ లేవు. 

చివరాఖరికి పేపర్లోళ్ళూ..టీవీలవాళ్ళూ వేసుకునే స్పెషల్ పేజీలకూ, ప్రోగ్రాములకూ సైతం ఎడ్వర్టై జ్మెంట్ల ఆదాయాలు కొలమానాలు. సంక్రాంతి పేరు చెప్పి వచ్చినంత దండుకోవడమే..! ఏమన్నా అంటే..పండగ సీజన్లో, ఎలక్షన్ సీజన్లో ఆమాత్రం సంపాదించుకోకపోతే ఎలా అన్న లాజిక్కులు బయటకొస్తాయి. విదేశీ మీడియా దేశంలోకి అడుగుపెడితే మన సంస్కృతుల్ని నాశనం చేసిపారేస్తాయంటూ గగ్గోలు పెట్టి అడ్డంపడ్డ దేశీ మీడియా ఇక్కడ కాపాడుకుంటున్న సంస్కృతులు ఎంత గొప్పగా ఉన్నాయో వాళ్ళేసే కార్యక్రమాలు చూస్తేనే అర్ధమైపోతుంది. ఇక అక్కడ దర్శనమిచ్చే  చౌకబారు పాటలు, సినిమా సీక్వెన్సులకూ అంతెక్కడ ? వెరసి మూటకట్టుకునే సంక్రాతి కమ్ సంస్కృతుల పేరుతో జమేసుకునే సొమ్ములకు లెక్కేంటో ఎవరు చెప్పాలి ?  

బస్సులోళ్లు,క్యాబులోళ్లు డిమాండును బట్టి పెంచుకుంటూ పోయే టిక్కెట్ల ధరల్ని ఎవడొచ్చి అదుపులో పెట్టాలి ? పెట్టాల్సిన ప్రభుత్వాలోళ్లు తమ ఆర్టీసీ బస్సులే ఎగదోస్తున్న టిక్కెట్ల ధరల్ని నియంత్రించుకోలేక పోవడం మనం చూస్తున్న పండగ సీజన్ల ముచ్చట ! 

అవును... ఇంతకీ  ఏదా సంక్రాంతి  సంస్కృతి ?  దాని ముసుగేసుకున్న కమర్షియల్ ముఠాల జేబుల్లో కరెన్సీగా మారిపోయింది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle