newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

మరణం తర్వా త వ్యక్తిత్వ హనన రాజకీయాలేనా?

18-09-201918-09-2019 12:17:38 IST
Updated On 19-09-2019 15:57:04 ISTUpdated On 19-09-20192019-09-18T06:47:38.649Z18-09-2019 2019-09-18T06:46:08.475Z - 2019-09-19T10:27:04.284Z - 19-09-2019

మరణం తర్వా త వ్యక్తిత్వ హనన రాజకీయాలేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కోడెల శివప్రసాదరావు...ఎవరు ఒప్పుకున్నా..ఒప్పుకోకున్నా ప్రజాభిమానం ఉన్న రాజకీయ నాయకుడు. సేవా భావంతో రాజకీయాలలోకి ప్రవేశించిన వ్యక్తి. వైద్యుడిగా ప్రజాభిమానం దండిగా సంపాదించుకున్న కోడెల శివప్రసాదరావు...తెలుగుదేశం వ్యవస్థాపకకుడు నందమూరి తారకరామారావు పిలుపు మేరకు రాజకీయ ప్రవేశం చేశారు.  జయాపజయాలతో సంబంధం లేకుండా అప్పటి నుంచీ ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు.

ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాలలో ప్రవేశించిన కోడెల మూడున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అభిమానులు ఆయనను పల్నాటి పులిగా పిలుచుకుంటారు. సాహసం, వెన్ను చూపని తత్వం ఆయనది. ఎంతో ధైర్యశాలి అయిన కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత విషాదకరం. రాజకీయాలలో ఆరోపణలు సహజం. కోడెలపై కూడా అటువంటి ఆరోపణలే వచ్చాయి. ఆరోపణలతో పాటు కేసులు కూడా రాజకీయాలలో సహజమే.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆరోపణలు చేయడం, ప్రత్యర్థులపై కేసులు పెట్టడం అన్నది చాలా మామూలు విషయం. ప్రస్తుతం క్రీయాశీల రాజకీయాలలో ఉన్న వారంతా ఏదో మేరకు కేసులు ఎదుర్కొంటున్నవారే. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి...ఇలా కేసులు ఎదుర్కోని నాయకుడంటూ ఎవరూ లేరనే చెప్పాలి. మరి అత్యంత  ధైర్యవంతుడిగా పల్నాటి సీమలో ఉన్న కోడెల శివప్రసాద్ ఒక్కసారిగా డిప్రషన్ లోకి వెళ్లిపోయేంతగా ఆయనను వేధిచింన సమస్యలేమిటి? ఏది ఏమైనా కోడెల మృతి అత్యంత దురదృష్టకరం.

ఇటువంటి సమయంలో రాజకీయ వైరాలను పక్కన పెట్టి సంయమనంతో ఉండాల్సిన బాధ్యత ఆయన వ్యతిరేకులైనా, అనుకూలురైనా చేయాలి. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆయన మరణానికి కారకులు మీరంటే..మీరంటూ అధికార, విపక్షాలు మర్యాద సరిహద్దులు దాటేసి మరీ దుర్భాషలాడుకుంటున్నారు. ఇది విజ్ణత కాదు, నైతికత అంతకంటే కాదు. కోడెల మృతదేహం పక్కన పెట్టుకుని రాజకీయ దూషణలకు పాల్పడటం ఎంత మాత్రం సరికాదు. మంత్రిగా, స్పీకర్ గా పదవులను అధిష్టించి సమర్ధంగా ప్రజాసేవ చేసిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు ఏర్పడ్డాయంటే రాష్ట్ర రాజకీయాలు ఎంత దౌర్భాగ్యంగా, ఎంత ఘోరంగా తయారయ్యాయో అర్ధమౌతుంది.

ఈ పరిస్థితుల్లో కూడా రాజకీయ విమర్శలతో ఆయన వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించడం దుర్మార్గం. కోడెల శివప్రసాద్ భౌతిక కాయానికి అంత్యక్రియలు ఇంకా జరగనేలేదు. జనం పెద్ద సంఖ్యలో ఆయనను కడసారి చూసేందుకు వస్తూనే ఉన్నారు. ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ఈ సమయంలో కూడా ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించడం ఇటు విపక్షానికీ, అటు అధికార పక్షానికి కూడా తగదు. జగన్ సర్కార్ అధికారం చేపట్టిన తరువాత కారణాలేమైతేనేం కోడెల లక్ష్యంగా ప్రభుత్వంలోని కొందరు వ్యవహరించిన మాట వాస్తవం.

రాజకీయ నాయకుడిగా  అపార అనుభవం ఉన్న కోడెల శివప్రసాద్  మానసిక స్థైర్యం కరవయ్యేలా, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆరోపణలు చేశారు, అవమానించారు. అయితే ఆయన బలవర్మరణం తరువాత కూడా ఇది కొనసాగడం రాజకీయ దిగజారుడు తనం కిందకే వస్తుంది. ముఖ్యంగా ఒకరిద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు అతి దారుణంగా ఉన్నాయి. వారి అపరిపక్వతను, మరణించిన వ్యక్తిపై కూడా కక్ష సాధించాలన్న దుర్మార్గపు మనస్తత్వాన్నీ సూచిస్తున్నాయి. రాజకీయాలలో హుందాతనం కనుమరుగైందనడానికి ఇది నిదర్శనం.

ఔను నిజమే కోడెలపై ఇటీవలి కాలంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసులు నమోదయ్యాయి. వాటి నిగ్గు తేల్చడానికి దర్యాప్తు జరుగుతున్నది. దానిని అడ్డుకోమని ఎవరూ కోరడం లేదు. అనుచిత దూషణలూ, విమర్శలూ తగవ నే ఎవరైనా చెబుతారు. ఎందుకంటే ఆరుసార్లు ప్రజాప్రతినిథిగా ఎన్నికైన వ్యక్తి రాజకీయ విమర్శల కారణంగానే ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఎవరూ నమ్మరు. అయితే కోడెల విషయంలో జరిగింది వేరు. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచే స్థాయిలో ఆరోపణలు చేశారు. కోడెల విషాదాంతంతోనైనా రాజకీయాలలో విమర్శకు, దూషణకు తేడాను నేతలు తెలుసుకోవాలి. విభేదాలను సిద్ధాంత పరంగా తేల్చుకోవాలే తప్ప వ్యక్తిత్వ హననంతో కాదని గుర్తెరగాలి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle