newssting
BITING NEWS :
* టీడీపీలో సంక్షోభం.. నలుగురు రాజ్యసభ ఎంపీల తిరుగుబాటు.. తమను బీజేపీలో విలీనం చేయాలని లేఖ *టీడీపీ రాజ్యసభ ఎంపీలకు స్వాగతం పలికిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా * పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ *కాకినాడలో కాపు నేతల రహస్య సమావేశం *టీటీడీ చైర్మన్‌ పదవికి పుట్టా సుధాకర్‌ రాజీనామా*లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా *కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

బాబు ఒంటరి... ‘నందమూరి’ ఫ్యామిలీ దూరం?

01-03-201901-03-2019 08:07:23 IST
Updated On 01-03-2019 12:12:45 ISTUpdated On 01-03-20192019-03-01T02:37:23.976Z01-03-2019 2019-03-01T02:37:13.104Z - 2019-03-01T06:42:45.248Z - 01-03-2019

బాబు ఒంటరి... ‘నందమూరి’ ఫ్యామిలీ దూరం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? నారా, నందమూరి ఫ్యామిలీల మధ్య బంధం రోజురోజుకీ దూరం అవుతోందా? చంద్రబాబు ఏకాకి అవుతున్నారా? అంటే తాజాపరిణామాలు అవుననే అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగేలా షాక్‌లు మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు టీడీపీ నేతలు  వరుసపెట్టి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పార్టీపరంగా ఆ షాక్‌ నుంచి తేరుకోకముందే మరోవైపు బంధువర్గం నుంచి కూడా చంద్రబాబుకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. చంద్రబాబుకి సన్నిహితులుగా ఉన్నవారంతా ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. ఇప్పటికే ఎన్టీ రామారావు పెద్దల్లుడు, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కొడుకు హితేష్ పాటు వైఎస్సార్ సీపీలో చేరారు.  

తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ మామయ్య (లక్ష్మీప్రణతి తండ్రి) నార్నే శ్రీనివాసరావు గురువారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరడం హాట్ టాపిక్ అవుతోంది. జూనియర్ ఎన్.టి.ఆర్.మామ నార్నె శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా సమీప బంధువే. జూనియర్ ఎన్టీఆర్‌కు పెళ్లి సంబంధం కుదర్చడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. 

ఆ తర్వాత నార్నే శ్రీనివాసరావుతో చంద్రబాబుకు సంబంధాలు అంత సజావుగా లేవంటారు. నార్నే శ్రీనివాసరావు గతంలో స్టూడియో ఎన్ అనే ఛానల్‌ను నడిపించారు. ఎన్టీఆర్ పెళ్లయిన కొత్తలో దాన్ని కొంత కాలం చంద్రబాబు టీమ్‌కు అప్పగించారు కూడా. కొన్నాళ్ళకే చంద్రబాబు టీమ్ ఆ ఛానల్ నుంచి వైదొలిగింది. ఆ తర్వాత దాన్ని నార్నే అమ్మేశారని చెబుతారు. జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనే తాను వైసీపీలో చేరానని నార్నె శ్రీనివాసరావు ప్రకటించడం ఇక్కడ చర్చించాల్సిన అంశం. 

చంద్రబాబు 2014లో మళ్ళీ ఏపీ సీఎం అయినప్పటినుంచీ నందమూరి ఫ్యామిలీ అంటీముట్టనట్టుగా ఉంటోంది. చంద్రబాబు బావమరిది, వియ్యంకుడైన బాలకృష్ణ మాత్రమే ఆయనతో కలిసి తిరుగుతున్నారు. కూతురు బ్రాహ్మణిని లోకేష్ కి ఇచ్చి పెళ్ళిచేయడంతో బావ, బావమరుదులు వియ్యంకులుగా మారారు. హరికృష్ణ మాత్రం చంద్రబాబుతో అంతగా సఖ్యంగా ఉండేవారు కాదంటారు. హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ 2009లో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. కానీ 2014లో మాత్రం టీడీపీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. అప్పటినుంచి ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు. 

హరికృష్ణ మరణానంతరం బాలయ్య తన అన్న కుటుంబంతో కలిసి కనిపించినా, ఆతర్వాత వారిమధ్య అంతగా మాటల్లేవ్. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాం ఇద్దరూ బాబాయితో కలిసి తిరిగారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక దశలో జూనియర్ ఎన్టీఆర్ గానీ కళ్యాణ్ రాం గానీ కూకట్ పల్లినుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా నందమూరి వారసురాలు, హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినిని కూకట్ పల్లినుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీచేయించారు.

ఆమె నామినేషన్ వేసే టైంలో ఆమె సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాం సోదరికి బెస్ట్ విషెస్ అయితే చెప్పారు గానీ, ప్రచారబరిలోకి మాత్రం రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని చివరివరకూ ఊరించారు కానీ రాలేదు. బాబాయి బాలయ్య, చంద్రబాబు మాత్రమే ప్రచారం చేశారు. కానీ విజయం మాత్రం దక్కలేదు. అయితే సుహాసిని ఓటమి వెనుక చంద్రబాబు వ్యూహం ఉందనే గుసగుసలు కూడా వినిపించాయి. అవి అలా ఉంచితే.. తాజాగా తెలుగుదేశం పార్టీకి విశ్వాసపాత్రులైన వారు, నందమూరి కుటుంబంతో సఖ్యంగా ఉండేవారు సైతం దూరం అవుతున్నారు. ఇప్పటికే ఈ పరిణామాలను చంద్రబాబు జీర్ణించుకోలేకుండా ఉన్నారు.

చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్ ఇప్పటికే జగన్ పంచన చేరారు. వదిన పురందేశ్వరి బీజేపీలో కొనసాగుతున్నారు. మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ తన మామ బాటలోనే పయనిస్తారా.. తారక్ భవిష్యత్ వ్యూహం ఏంటనేది అంతుచిక్కడం లేదు. ఏపీ ఎన్నికల వేళ ఇటు నందమూరి, దగ్గుబాటి ఫ్యామిలీల వ్యూహాలు చంద్రబాబుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle