newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

నకిలీ ఓట్ల నిరోధానికి వైసీపీ మాస్టర్ ప్లాన్

13-12-201813-12-2018 15:21:59 IST
Updated On 13-12-2018 17:52:40 ISTUpdated On 13-12-20182018-12-13T09:51:59.567Z13-12-2018 2018-12-13T09:51:57.143Z - 2018-12-13T12:22:40.696Z - 13-12-2018

నకిలీ ఓట్ల నిరోధానికి వైసీపీ మాస్టర్ ప్లాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
త్వరలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో నమోదైన నకిలీ ఓటర్లను నిరోధించేందుకు కేంద్రస్థాయిలో వత్తిడి తెస్తున్నారు వైసీపీ నేతలు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాతో వైఎస్సార్సీపీ అగ్రనేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సర్వేల పేరుతో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని కమిషనర్‌కు వివరించారు. తెలంగాణలోనూ లక్షలాది ఓట్లు గల్లంతయిన నేపథ్యంలో ఈసీపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితి తిరిగి ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ముందునుంచీ నకిలీ ఓట్లను ఏరిపారేయాలని వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెస్తున్నారు. 

ఓట్లు తొలగించబడిన ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో ఉన్న అన్ని తప్పులను క్షుణ్ణంగా పరిశీలించి సరిదిద్దాలని వినతి పత్రం సమర్పించారు.  ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, సీనియర్‌ నేతలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ, వరప్రసాద్‌, మిథున్‌ రెడ్డి, తదితరులు ఢిల్లీలో మకాం వేశారు. ఏపీలో 35 లక్షలకు పైగా నకిలీ ఓట్లు ఉన్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఏపీలో ఒకే వ్యక్తి పేరుతో నాలుగు, ఐదు ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. సుమారు 35 లక్షలకు పైగా నకిలీ ఓట్లు ఏపీలో ఉన్నాయని ఎంపీ విజయ్ సాయిరెడ్డి స్పష్టం చేశారు. మరో 18 లక్షల మందికి ఏపీ, తెలంగాణాలో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని వివరించారు. ఓటర్‌ కార్డును ఆధార్‌ కార్డుతో లింక్‌ చేస్తే నకిలీ ఓట్లకు కళ్ళెం వేయవచ్చని, అందుకోసం ప్రజాప్రాతినిథ్య చట్టానికి సవరణలు తీసుకురావాలి లేదంటే ఆర్డినెన్స్‌ తీసుకుని రావాలని సూచించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున తమ ఫిర్యాదులను పరిశీలించి ఆధార్ లింక్ చేయించాలని కోరారు. నకిలీ ఓట్ల వల్ల తమ అభ్యర్ధులకు నష్టం చేకూరకుండా ముందునుంచీ జాగ్రత్తలు తీసుకుంటోంది వైసీపీ. తెలంగాణలో మాదిరి ఓటర్లు ఇబ్బంది పడకుండా ఓటుహక్కు వినియోగించుకునేందుకు అన్నిస్థాయిల్లో వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. మరి వైసీపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా? 

మజ్లిస్ మద్దతు ఎఫెక్ట్ 

ఇదిలా ఉంటే మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ ఏపీలో జగన్‌‌కు మద్దతిస్తామని ప్రకటించడం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఏపీలో మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణలో మైనారిటీ నేత ఫరూక్‌కు మంత్రి పదవి ఇచ్చారు. ముస్లింల కోసం అనేక పథకాలు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు మజ్లిస్ నేత వైసీపీకి మద్దతిస్తామని ప్రకటించడం చంద్రబాబును ఇరకాటంలో పడేసింది. తెలంగాణ ఎన్నికల్లో మజ్లిస్ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. 43 నియోజకవర్గాల్లో బలంగా ఉన్న మైనారిటీ ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారని భావిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ భారీ మెజారిటీ చేజిక్కుంచుకుంది. ఈ ప్రయోగం ఏపీలో జరిగితే టీడీపీకి మెజారిటీ తగ్గడం ఖాయం అంటున్నారు. వైసీపీ నేతల వ్యూహానికి చంద్రబాబు ప్రతి వ్యూహంగా ఏం ఆలోచిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle