newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

టీడీపీ, వైసీపీకి ఆ ధైర్యం కూడా లేదా..?

25-03-201925-03-2019 13:10:52 IST
2019-03-25T07:40:52.262Z25-03-2019 2019-03-25T07:40:50.681Z - - 24-07-2019

టీడీపీ, వైసీపీకి ఆ ధైర్యం కూడా లేదా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ధ్య ఎన్నిక‌లు ఎంత హోరాహోరీగా సాగుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో పైచేయి సాధించేందుకు రెండు ప్రధాన పార్టీలు వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు ర‌చిస్తున్నాయి. ఇప్పుడు ఎన్నిక‌ల హామీల్లోనూ రెండు పార్టీలూ ఇదే ధోర‌ణిలో వెళుతున్నాయి. ఒక‌రి హామీలు చూసి మ‌రొక‌రు అంత‌కు మించి హామీలు ఇవ్వాల‌ని భావిస్తున్నారు. దీంతో ఎన్నిక‌ల ప్రచారానికి ఇంకా 15 రోజులే స‌మ‌యం ఉన్నా ఇంత‌వ‌ర‌కు రెండు పార్టీలూ మేనిఫెస్టోల‌ను విడుద‌ల చేయ‌లేదు.

తాము అధికారంలోకి వ‌స్తే ప్రజ‌ల‌కు ఏం చేస్తామో చెప్పేదే మేనిఫెస్టో. ఎన్నిక‌ల‌కు ముందు త‌మ పార్టీ మేనిఫెస్టోను రూపొందించి ప్రజ‌ల్లోకి తీసుకెళ్లి ఓట్లడ‌గ‌డం సంప్రదాయం. మేనిఫెస్టోను క్షేత్రస్థాయిలో ప్రజ‌ల్లోకి తీసుకెళ్లడానికి స‌మ‌యంలో కావాలి. కానీ, ప్ర‌చారానికి ఇప్పుడు కేవ‌లం 15 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉన్నా ఇంత‌వ‌ర‌కు మేనిఫెస్టోలు బ‌య‌ట‌కు రాలేదు. ఇవ్వాళో రేపో అవి బయటకు రావచ్చు. 

దాదాపు నెల రోజుల‌ క్రిత‌మే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల మేన‌ఫెస్టో రూప‌క‌ల్పన‌కు క‌మిటీ వేశారు. ఈ క‌మిటీ ప‌లుమార్లు స‌మావేశ‌మై, వివిధ వ‌ర్గాల ప్రజ‌ల నుంచి సూచ‌న‌లు తీసుకొని మేనిఫెస్టోను త‌యారు చేసింది. కానీ, విడుద‌ల మాత్రం ఆల‌స్యమ‌వుతోంది. ఇవాళ‌, రేపు అంటూ వారం రోజులుగా మేనిఫెస్టో విడుద‌లను వాయిదా వేస్తున్నారు. దీనికి కార‌ణం వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టోను, వారి హామీలు చూశాకే విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ధోర‌ణిలో ఉంది. ఆ పార్టీ కూడా ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లు నేతృత్వంలో మేనిఫెస్టో క‌మిటీని చాలా రోజుల క్రిత‌మే ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ ఇప్పటికే మేనిఫెస్టోకు రూప‌క‌ల్పన చేసింది. కానీ, ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతున్నా ఎప్పుడు విడుద‌ల చేస్తారో మాత్రం క్లారిటీ లేదు. టీడీపీ మేనిఫెస్టో విడుద‌ల చేశాక‌, ఆ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న ప్రజాకర్షక ప‌థ‌కాల‌ను మించి ప‌థ‌కాలు చేర్చి విడుద‌ల చేయాల‌నేది వైసీపీ ఆలోచ‌న‌.

ఇప్పటికే ఏడాదిన్నర క్రిత‌మే వైసీపీ న‌వ‌ర‌త్నాల పేరుతో తాము అధికారంలోకి వ‌స్తే చేప‌ట్టనున్న ప్రధాన ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లింది. ఇందులో ముఖ్యమైన పింఛ‌న్ రూ.2000 హామీని, ట్రాక్టర్లు, ఆటోల‌పై ట్యాక్సుల ఎత్తివేత వంటి హామీల‌ను చంద్రబాబు ఎన్నిక‌ల ముందే చేసేసి వైసీపీని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టారు. దీంతో వైసీపీ తేరుకొని పింఛ‌న్ రూ.3000 వేల‌కు పెంచుతామ‌ని చెబుతోంది. ఇలా న‌వ‌ర‌త్నాల‌ను ముందుగానే ప్రక‌టించి దెబ్బతిన్న వైసీపీ ఇప్పుడు ఆ త‌ప్పు చేయొద్దనుకుంటోంది.

టీడీపీ మేనిఫెస్టో ప్రక‌టించాక‌, దానికి మించి జ‌నాక‌ర్షక ప‌థ‌కాలు రూపొందించి త‌మ మేనిఫెస్టోను విడుద‌ల చేయాల‌ని నిర్ణయించింది. జ‌న‌సేన మాత్రం ఈ విష‌యంలో కొంత ముందుంది. రాజ‌మండ్రిలో జ‌రిగిన పార్టీ ఆవిర్భావ స‌భ‌లోనే ఆ పార్టీ మేనిఫెస్టోను ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రక‌టించేశారు. మొత్తానికి టీడీపీ, వైసీపీ మ‌ధ్య మేనిఫెస్టో కూడా ధైర్యంగా విడుద‌ల చేయ‌లేనంత పోటీ క‌నిపిస్తోంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle