newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

టీడీపీకి జనం ఏం చెబుతున్నారు?

01-03-201901-03-2019 17:09:58 IST
Updated On 01-03-2019 19:06:34 ISTUpdated On 01-03-20192019-03-01T11:39:58.007Z01-03-2019 2019-03-01T07:10:17.550Z - 2019-03-01T13:36:34.998Z - 01-03-2019

టీడీపీకి జనం ఏం చెబుతున్నారు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓటమి నుంచి పాఠాలు నేర్ఛుకోవడం సర్వసాధారణంగా అందరూ చేసేదే. కానీ విజ్ఞులు గెలుపు నుండి కూడా పాఠాలు నేర్చుకుంటారు. తాము గెలుచుకున్నది పదికాలాల పాటు నిలుపుకోవాలంటే, ప్రతి యుద్ధంలోనూ మునుపటి కంటే సునాయాస విజయాన్ని సాధించాలంటే అది అవసరమే. అసలు తమను వరించిన విజయం ఎలా సాధ్యమయ్యిందో విశ్లేషించుకోవలసిందే. కానీ ఆ పని తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టుగా లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఓటమినే విశ్లేషించుకోలేనివారు ఇక గెలుపుని ఏం అవగాహన చేసుకుని పాఠాలు నేర్చుకుంటారు? అని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం అగ్రనాయకత్వం పోకడలను గమనించినవారు అంటున్న మాట.

2004లోనూ,  2009లోనూ తాము ఎందుకు ఓటమి చెందామన్న విషయాన్ని నిక్కచ్చిగా అంతర్గత చర్చల్లో కూడా విశ్లేషించుకోని పార్టీ, 2014 ఎన్నికల్లో ఏయే పరిణామాలు తమ గెలుపునకు దోహదం చేసాయి అన్న విషయాన్ని ఎందుకు అంతగా పట్టించుకుంటుంది అన్నది వారి ప్రశ్న.  అసలు 2004 ఓటమిని సరిగా సమీక్షుంచుకుంటే, 2009లో పార్టీ మళ్ళీ తిరిగి ఓటమి పాలయ్యేదే కాదని వారి వాదన. 2014లో ప్రజలిచ్చిన తీర్పులో తెలుగుదేశం గమనించని ముఖ్యమైన విషయం ఒకటి ఉంది.

రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను ఛీ కొట్టి తీవ్రంగా శిక్షించిన ఆంధ్ర ప్రజలు, ఆ విభజనను సమర్ధిస్తూ లిఖితపూర్వకంగా తన అంగీకారాన్ని అధికారికంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలియజేసిన తెలుగుదేశాన్ని క్షమించి అధికారాన్ని అప్పజెప్పారు. అలాగే విభజన చట్టానికి మద్దతునిచ్చి పార్లమెంటులో బిల్లు ఆదరాబాదరాగా తలుపులువేసి, టీవీ కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసి మరీ పాస్ చెయ్యడానికి సహకరించిన బీజేపీ‌కి ఓట్లు వేసారు. విభజనను ఒప్పుకోని వైయస్సార్ పార్టీని అధికారానికి ఆమడ దూరంలో పెట్టారు.

ఇందుకు కారణమేంటి? టీడీపీ వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే. ఈ ప్రశ్నకు సరైన సమాధానం వెతుక్కుంటే, 2019 ఎన్నికలలో గెలుపుమంత్రాన్ని సాధించుకున్నట్టే. నిజానికి 2014 ఎన్నికల నాటికి తెలుగుదేశం ఐసీయూలో ఉంది. వరుసగా 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయి ఉంది. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో చావుదెబ్బతిని ఇక కొన ఊపిరే అన్నట్టుగా ఉంది. రాష్ట్రంలో పాదయాత్ర, బస్సు యాత్రలు, ఢిల్లీలో దీక్షలతో పార్టీ అధినేత చంద్రబాబు అలా బండి నెట్టుకుంటూ వస్తున్నాడు. తెలుగుదేశం మళ్ళీ బతికి బట్టకట్టి అధికారం అంచుల్లోకైనా వస్తుందా అని పార్టీ వీరాభిమానులు కూడా సందేహాలను వెలిబుచ్చుతున్న రోజులు.

ఎన్నికలు సమీపించేనాటికి జగన్ పార్టీ మంచి ఊపులో ఉంది. తెలుగుదేశం నాయకుల్లోనే సగంమందికి పైగా గెలుపు మీద ఆశలు వదులుకున్నారు. దాదాపు అన్ని సర్వేలూ వైయెస్సార్ పార్టీదే విజయమని తీర్పు ఇచ్చేసాయి.కానీ ఫలితాలు వచ్చేటప్పటికి పరిస్థితి తలకిందులయ్యింది. తెలుగుదేశం అధికారాన్ని కైవసం చేసుకుంది. కేవలం రెండు శాతంలోపు ఓట్ల ఆధిక్యతతో చివరినిముషంలో జనం చంద్రబాబునాయుడుకి అధికారాన్ని అప్పచెప్పారు. ఆనాటి రాజకీయ సమీకరణాలు ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. టీడీపీకి తోడుగా ఆ వేళ మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఉంది. మోదీ ప్రభ ఆసేతు హిమాచలపర్యంతమూ వెలిగిపోతున్న రోజులవి. రాష్ట్రంలో యువతలోనూ, కాపు కులస్థులలోనూ క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ కూడా టీడీపీకి బాసటగా నిలిచాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో న్యాయం చేయిస్తాను అన్న పవన్ మాటలకు ఇంతో అంతో విశ్వసనీయత ఉన్న రోజులవి. 

ఢిల్లీని మించిన రాజధానిని కట్టిస్తాను, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాను అని మోదీ ఆ వేళ చెప్పిన మాటల్ని రాష్ట్ర విభజనతో కుంగిపోయి ఉన్న ప్రజలు నమ్మారు. వరుసగా రెండు ఎన్నికల్లో తాము చంద్రబాబును ఎందుకు ఓడించామో ఆ వేళ ప్రజలకు గుర్తుకు రాలేదు. విడిపోయిన రాష్ట్రం, రాజధానిని కోల్పోయిన రాష్ట్రం, ఆర్ధికంగా నష్టపోయిన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి ఇదివరకు ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉన్న నాయకుడు కావాలి అని అనుకున్నారు జనం. పైగా ఆనాడు దాదాపుగా ప్రధాని అయిపోతాడు అనుకుంటున్న మోదీతో జతకట్టాడు చంద్రబాబు. 

ఇన్ని సమీకరణాలు కలిసి వచ్చినా చివరికి తెలుగుదేశం అత్తెసరు మార్కులతో గట్టెక్కి అధికార పీఠం కైవసం చేసుకుంది. వైసీపీకన్నా కేవలం 1.8% ఓట్లు అదనంగా తెచ్చుకుంది. మొత్తం ఓట్ల లెక్క చూస్తే రెండు ప్రధాన పార్టీలకీ మధ్య తేడా ఇంచుమించు 5 లక్షలు మాత్రమే. అంటే రెండు, మూడు నియోజకవర్గాలలో ఉన్న మొత్తం వోట్లపాటిలేదు ఈ తేడా. ఆనాడు వెలిగిన గెలుపు దీపం కింద ఉన్న ఈ క్రీనీడను గమనించకుండా 2014లో తిరుగులేని విజయం సాధించామన్నట్టు వ్యవహరిస్తే తెలుగుదేశానికి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. 

ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఈరోజు మోదీ టీడీపీతో లేడు. ఉన్నా ఆయనకు ఆ క్రేజ్ లేదు. పైగా ఆంధ్రదేశంలో ఆయనంటే ఏహ్యభావం ఏర్పడింది. పవన్ చంద్రబాబుతో విభేదించి ఘాటైన విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. ఆ నాడు మోదీ, పవన్‌ల వల్ల దక్కిన ఓట్లు ఈవేళ దక్కే అవకాశాలు లేనేలేవు. ఇప్పుడు పవన్‌ను మళ్ళీ తెలుగుదేశం నాయకత్వం చేరదీసి తమ పాటపాడేలా చేసుకున్నా మాటమార్చిన మనిషికి ఉన్నవిలువే జనసేన అధినేతకి ఉంటుంది తప్ప అంత ప్రభావం ఉండదు అతని మాటకి. 

ఇటీవల జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్రం నడివీధుల్లో కనిపించిన దృశ్యాలు తెలుగుదేశం నాయకత్వాన్ని ఆలోచనల్లో పడేసిఉండాలి. మూడొందల రోజులకు పైగా జరిగిన పాదయాత్రలో జగన్‌కు తండోపతండాలుగా జనం వచ్చారు. టిక్కెట్లు ఆశిస్తున్నవాళ్ళు బస్సులు పెట్టి తీసుకొచ్చారని కొన్నాళ్ళు సర్దిచెప్పుకున్నా, వారం రెండు వారాలతర్వాత అటువంటి సర్దుబాటు మాటలకి తావులేకుండా పోయింది. దేశం పార్టీ కిందిస్థాయి కార్యకర్తలలోనూ, ఎమ్మెల్యేలలోనూ గుబులు స్పష్టంగా కనబడింది.

డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బులూ, పింఛన్ల పెంపూ, నిరుద్యోగ భృతి బట్వాడా లాంటి నష్టనివారణ చర్యలు హడావిడిగా తీసుకుంటే తప్ప కింది స్థాయి కార్యకర్తల్లో ఉన్న నైరాశ్యాన్ని పోగొట్టలేమేమో అన్న ఆలోచనకి పార్టీ అధినాయకత్వం వచ్చినట్టు కనబడుతోంది. ఈ చర్యలవల్ల నియోజకవర్గాల స్థాయిలో కొంత ఉత్సాహం కనబడినా, ఇది ఎన్నికలవరకూ నిలబడుతుందా అన్న ప్రశ్న టీడీపీ నేతలను తొలుస్తోంది. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రీ, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం, ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలు, సంక్రాంతి కానుకలూ, రంజాన్ తోఫాలు, క్రిస్మస్ గిఫ్టులూ, జనాన్ని తృప్తిపరిచేలా గోదావరి కృష్ణా పుష్కరాల ఏర్పాట్లూ, రాజధాని, పోలవరం ప్రాజెక్టుల శంఖుస్థాపనలూ, పెట్టుబడుల వరదలంటూ ప్రకటనలూ, విదేశీ పర్యటనలూ, ప్రతి చిన్నవిషయాన్నీ శ్రద్ధగా దగ్గరుండి పర్యవేక్షించడం,  ప్రతినిత్యం సమీక్షలు – ఇన్ని ఉన్నా, ఇన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి సమావేశాలకి జనం ఎందుకు ఎగబడ్డారు అన్నది తెలుగుదేశం తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న.

జగన్మోహన్ రెడ్డి జనానికి కొత్తకాదు, ఇదివరకు చూడనివాడు కాదు, అరుదుగా కనపడే సినీతార అంతకన్నా కాదు. అతను చెప్పే విషయంలో కొత్తదనం కూడా ఏమీ లేదు. అయినా జనం ఎందుకు విరగబడ్డారన్నది ఆలోచించాల్సిన సీరియస్ పాయింట్. రాజకీయ నాయకుడన్నాక ఎంతో అంత జనం రాక మానరు. పాతికో పరకో, వందో వెయ్యో అయితే సరిపెట్టుకోవచ్చు. కానీ కొన్ని వేలల్లో ఎందుకువచ్చినట్టు? వరసగా అన్ని మీటింగులకీ ఎందుకు వచ్చినట్టూ? వచ్చినవాళ్ళు జగన్ మాటలకి ఎందుకు స్పందించినట్టు? ఏ ఊరిలోనూ ‘‘ఏంటయ్యా నువ్వు చెప్పేది, మీ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు కోట్లు దోచుకుని మాకేమి చెపుదామని వచ్చావు?’’ అని ఒక్కరంటే ఒక్కరు ఎందుకు నిలదీయలేదు?

ప్రభుత్వం ఇన్నిచేస్తున్నా, ఇన్ని అవార్డులు గెలుచుకుంటున్నా, ప్రజల్లో ఇంత సంతృప్తి శాతం సాధిస్తున్నామని లెక్కలేసుకుంటున్నా, ప్రతిపక్షనాయకుడి సమావేశాలకి జనం వచ్చి ప్రభుత్వానికి, పాలక పక్షమైన తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వారు ఏమి సంకేతాలివ్వాలనుకుంటున్నారు? ఏమిచెప్పాలనుకుంటున్నారు?  వీటిల్లో ఏ సంకేతమూ లేదనుకోవడం, జనం ఏ సందేశమూ ఇవ్వడం లేదనుకోవడం, అసలు జనమే రావట్లేదనుకోవడం పచ్చి మూర్ఖత్వమే అవుతుంది. ఇటీవల ప్రకటించిన తాయిలాలు జనం పంపే ఈ సందేశాలకీ, సంకేతాలకి సమాధానం కాగలుగుతాయా? ఈ ప్రశ్నకి సమాధానంలోనే 2019 ఎన్నికల ఫలితాలు దాగి ఉన్నాయి. ఆ తాయిలాలే సమాధానం అయితే తెలుగుదేశం విజయం ఖాయం, కాదంటే వైసీపీ గెలుపు నిశ్చయం. 

మొత్తం మీద దీని అర్ధం ఇన్నాళ్ళూ ప్రభుత్వం, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు చేసినవన్నీ హుళక్కే అని. ఈ నాలుగున్నరేళ్ళలో రాష్ట్ర ప్రజల్ని మెప్పించలేకపోయారనే లెఖ్ఖ! 2014లో ప్రజలు ఏమి ఆశించి ఓట్లు వేసారో ఆ మేరకు పనిచేసి చూపించలేకపోయారని అర్ధం. ఏదో అనుకుని ఓటు వేసాం, కానీ ఏమీ కాలేదు. ప్రత్యామ్నాయం ఏమిటో చూద్దాం అని జనం కొత్తనాయకత్వ అన్వేషణలో ఉన్నారని అర్ధం. లేనిపక్షంలో దార్శనికతను వదిలి తాయిలాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే చివరికి తెలుగుదేశం, చంద్రబాబుల గెలుపు- ఓటములకి మధ్య కేవలం తాయిలాలే అడ్డం.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle