newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

చంద్రబాబు Vs జగన్: బిగ్‌స్టోరీ-1

28-01-201928-01-2019 14:38:53 IST
Updated On 28-01-2019 14:38:44 ISTUpdated On 28-01-20192019-01-28T09:08:53.765Z28-01-2019 2019-01-28T09:02:49.874Z - 2019-01-28T09:08:44.924Z - 28-01-2019

చంద్రబాబు Vs జగన్: బిగ్‌స్టోరీ-1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019 ఒక చారిత్రక సంవత్సరం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని సమూలంగా మార్చేసే  సంవత్సరం ఇదే ! ఇక్కడ రెండు పార్టీల మధ్య జరగబోతున్న హోరాహోరీ పోరాటంలో ఎవరు గెలిచి మరెవరు ఓడినా అక్కడ కొత్త చరిత్ర పుట్టుకొస్తుంది. తెలుగుదేశం పార్టీ పుట్టుపూర్వోత్తరాలు ఎప్పటివైనా... అవి చంద్రబాబు స్వీయ దర్శకత్వంలోకి వచ్చి దాదాపు 24 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడా పార్టీ జయాపజయాలకు ఆయనే కారకుడు. ఇక జగన్ మోహన్ రెడ్డి ..వైఎస్సార్ కాంగ్రెస్. ప్రధాన కాంగ్రెసుతో  విభేదించి విడిపోయి బయటకొచ్చి పెట్టుకున్న తన పార్టీ 2014లో  ఓటమిపాలైంది. ఇప్పుడు మళ్ళీ  తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇక్కడ కూడా గెలుపు ఓటములకు ఆయనొక్కడే బాధ్యుడు. వైస్సార్సీపీలో రెండో వ్యక్తి ఎవరూ కనిపించరు. ఉన్నవాళ్లంతా నామమాత్రపు శాల్తీలే ! అన్నీ జగనే !

ఎన్నికలు మరో మూడునాలుగు నెలలు కూడా లేవు. నోటిఫికేషన్ రావడం తరువాయి... యుద్దానికి శంఖం వూదినట్లే. టిక్కెట్లెవరికో తేలిపోయిన ప్రతీసారీ కొత్త రాజకీయం మొదలవుతుంది. కొత్త రాజకీయ సమీకరణాలు మొదలవుతాయి. బీ-ఫార్మ్ చేజిక్కించుకున్నవాడు రాజకీయ సమర్థుడైతే అక్కడ జరిగిపోయే తంతే వేరు! 175 అసెంబ్లీయే నియోజకవర్గాలు- 25 లోక్‌సభ నియోజకవర్గాలు. ఇప్పటిదాకా వచ్చిన సర్వేలన్నీ ఆంధ్రాలో జగన్ పార్టీకే అనుకూలంగా తీర్పులు చెప్పాయి. జాతీయస్థాయిలో ఎలా ఉన్నా రాష్ట్ర స్థాయిలో మాత్రం జగన్‌దే పైచేయిగా ఉంటుందంటూ నాడి పట్టి జోస్యం చెప్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఈ సర్వేల్లో ఎక్కడా నామమాత్రంగానైనా జనసేన పార్టీ ఊసే లేదు. అటువంటి ప్రస్తావన కూడా రాకపోవడానికి కారణాలూ చెప్పలేదు. ఇక కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందంటూ వచ్చిన నిర్ణయంతో ఆ పార్టీ నాయకులు తమకు దక్కిన స్వేచ్ఛకు ఊపిరి పీల్చుకుంటున్నా నిజానికి ఆ పార్టీ మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకోగలదా అన్నది చర్చనీయాంశమైంది. 

చంద్రబాబు బలహీనపడ్డారా? 

తెలుగుదేశం పార్టీ బలహీనపడిందా లేక తెలుగుదేశం ప్రభుత్వం బలహీన పడిందా అన్న ప్రశ్నల్లో ఉన్న తేడాను గమనించాల్సిందే ! అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వానికి సహజంగా ఏర్పడే వ్యతిరేకత ఈ ప్రభుత్వానికీ ఉందని ఎప్పుడో తేలిపోయింది. చంద్రబాబు తన వైఫల్యాలకు కారణం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ అనీ, ఆయనకు ఆంధ్ ప్రదేశ్ గుజరాత్ రాష్ట్రం కంటే ఎక్కువగా అభివృద్ధి చెందడం ఇష్టం లేకనే తొక్కేస్తున్నారంటూ కొత్త కొత్త థియరీల్ని చెప్తున్నారు. నిజానికి వాళ్ళిద్దరి మధ్య సఖ్యతలు చెడిపోయి చాలా కాలమైంది. ఏపీ రాష్ట్రంలో తన రాజకీయాన్ని కొనసాగించడానికి చంద్రబాబు కంటే మరో ప్రత్యామ్నాయ వ్యక్తి, శక్తీ అవసరమని మోడీ భావించడం వల్లనే అక్కడ బాబు మైనస్ అయ్యారు. ఇక మోడీతో కొనసాగితే తాను రాజకీయంగా నష్టపోతానన్న భయంతోనే ఆ ఫ్రెండ్షిప్ కు స్వస్తి చెప్పారు బాబు అంటూ అతన్ని మోసేవాళ్లంటారు.

ఇదంతా ఒక ఎత్తైతే అసలు గ్రౌండ్ లెవెల్లో బాబు పరిస్థితి ఎలా ఉన్నదో తెలియచేసే సూచికలేమీ లేవు. తన పథకాలు క్షేత్ర స్థాయిలో ఎలా పనిచేస్తున్నాయన్న విషయంపై ఆరాలు తీసిన కొంతమందికి అసంతృప్తే కనిపించింది. ఇప్పటికిప్పుడు అదంతా సరిదిద్దే పరిస్థితి లేదు. మొన్న కెసిఆర్ ప్రకటించిన పథకాలనే అటూఇటూ తిప్పి వరాల మూటలు విసిరేయాలన్న ఆలోచన బాబుకు కలిగిందా? అదే విషయాన్ని కేటీయార్ ఎత్తిపొడుస్తూ ‘‘మా పథకాలనే బాబు కట్ ఎండ్ పేస్ట్’’ చేస్తున్నారంటూ చెప్పారు. రైతులకు నేరుగా ఆర్ధిక సహాయం చేసే రైతుబంధు పథకం లాంటి ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థి జగన్ కూడా  ‘‘అధికారంలోకి వస్తే  రైతులకు ఎకరానికి రూ.12,500 ల సాయం చెయ్యాలన్నది తమ పార్టీ నిర్ణయం’’ అంటూ పాదయాత్ర ముగింపు  రోజున ప్రకటించారు. మరి అదే మాటలన్న చంద్రబాబును ఎద్దేవా చేసిన కేటీయార్ ...జగన్ చేసిన ప్రకటనపై కాపీ కొడుతున్నావంటూ ఎందుకు ప్రశ్నించలేదు. వాళ్లిద్దరి మధ్య ఉన్న దోస్తీనే అందుకు అడ్డుపడిందన్నది లాజిక్ ! 

(ఇంకా ఉంది)


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle