newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

ఏ పార్టీ తప్పులు తక్కువ?

26-02-201926-02-2019 05:49:34 IST
Updated On 26-02-2019 11:28:28 ISTUpdated On 26-02-20192019-02-26T00:19:34.573Z25-02-2019 2019-02-25T12:54:33.261Z - 2019-02-26T05:58:28.018Z - 26-02-2019

ఏ పార్టీ తప్పులు తక్కువ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల షెడ్యూలయితే ఇంకా రాలేదుగానీ దాదాపుగా అన్ని పార్టీలూ ఎన్నికలకి సీరియస్‌గా సంసిద్ధమవుతున్నాయి. తమ తమ పార్టీల పరిస్థితి ఏమిటీ? ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగుల పరిస్థితి ఎలా ఉంది? టిక్కెట్లు కావాలని తమ చుట్టూ తిరిగే వారికి ప్రజల్లో ఉన్న పలుకుబడి ఏపాటిదీ? లాంటి విషయాల మీద పార్టీలు తమదైన పద్ధతిలో కూపీలు లాగుతున్నాయి. 

జగన్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ విడిచిపెట్టివెళ్ళిన సంస్థ ఐ-పాక్ ఈ పనులు చక్కబెడుతోంది. ఆయన బీహార్‌లో క్రియాశీల రాజకీయాలలో తలమునకలుగా ఉన్నా, ఆ సంస్థకు చెందిన వారు రాష్ట్రం అంతా ఇప్పటికే విస్తరించి ఉన్నారట. ఏరోజుకారోజు ఆయా నియోజకవర్గాలనుంచి అక్కడి పార్టీ పరిస్థితుల పైన, అక్కడ పనిచేస్తున్న నాయకులమీదా నివేదికలు పార్టీ కేంద్రకార్యాలయానికి పంపుతారు.

జగన్ ఉపన్యాసాలలో ఏఏ అంశాలు ఉండాలి, స్థానిక సమస్యలు ఏమిటీ? వాటిని ఎలా ప్రస్తావించాలీ అనేవాటి మీదకూడా ఈ సంస్థ ఉద్యోగులు రిపోర్టులు పంపుతారు. జగన్ ప్రసంగాలు చాలా వరకూ వీటి ఆధారంగానే రూపొందుతాయి అని వైఎస్సార్ పార్టీని దగ్గరనుంచి చూస్తున్నవారు చెబుతున్న మాట.

అయితే, ఈ నివేదికలు తప్పుల తడకలుగా ఉంటున్నాయని ఆ పార్టీ జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉద్యోగుల్లో చాలామందికి తెలుగు రాదు. నియోజకవర్గాల కులసమీకరణలమీద అవగాహన లేదు. గత ఎన్నికల్లో పార్టీ కలిసొచ్చిన అంశాలేమిటి, ప్రతికూలతలేమిటి అన్న దానిమీద సమాచారం లేదు. ఇవేవీ లేకుండా ఒక ఊళ్ళో కనపడ్డ నలుగురితో మాట్లాడి తూతూ మంత్రంగా నివేదికలు తయారుచేస్తున్నారని, వీటివల్ల తమ పార్టీ అధిష్టానం తప్పుడు నిర్ణయాలు తీసుకుని భారీగా నష్టపోయే ప్రమాదం ఉందనీ వారు ఆందోళన చెందుతున్నారు. 

జనసేనకి ఇటువంటి ఏర్పాటు ఉన్నట్టుగా లేదు. ఆ పార్టీ నాయకుడు రాజకీయాల గురించి, ఎన్నికలగురించీ సీరియస్‌గా ఉన్నప్పుడు ఇటువంటి సమాచారం కోసం తన జన సైనికులమీదనే ఆధారపడతారని, కాని ఆ సమాచారాన్ని ఎంతవరకూ వాడతారో తెలియదనీ మొన్నటివరకూ ఆ పార్టీలో చురుగ్గా పాల్గొని ఈ మధ్యనే కొంత దూరంగా ఉంటున్న ఒక నాయకుడు చెప్పిన అభిప్రాయం. 

ఇక తెలుగు దేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వేలు చేయించడంలో, సమాచారం సేకరించడంలో ఆరితేరిన వారిగా పేరుపడ్డారు. పైగా ఇప్పుడు అధికారంలో ఉన్నారేమో, వనరులకు కొదవలేదు. అలాగే సమాచారం సేకరించడానికి కావలసినన్ని వ్యవస్థలు, సంస్థలు చేతికింద ఉన్నాయి. చంద్రబాబు ఒక సర్వేని నమ్మి తన రాజకీయతంత్రాన్ని రూపొందించుకోరని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటూంటారు. ఒకే నియోజకవర్గాన్ని మూడునాలుగు సంస్థలతో సర్వే చేయించి గాని ఒక అభిప్రాయానికి రారు అని ఆయన ఎన్నికల నిర్వహణను అనేక సంవత్సరాలుగా దగ్గరగా చూసిన వారి పరిశీలన. 

ఒక పక్క సర్వే సంస్థలు, మరోపక్క నిఘా విభాగం ఇచ్చిన నివేదికలు. ఇవేకాకుండా అదనంగా ఇప్పుడు ఆర్టీజీ అనే సంస్థ ఒకటి రాష్ట్రప్రభుత్వానికి ఉంది. రియల్ టైమ్ గర్వర్నెన్స్ పేరుతో పనిచేస్తున్న ఈ సంస్థ సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కొలువుతీరి ఉంటుంది. రోజుకు కొన్ని లక్షలమందికి ఫోనులు చేసి ఫలాన పధకం మీకు అందిందా? అది మీకు నచ్చిందా? నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు? అది పొందడానికి ఎవరికైనా లంచం ఇచ్చారా? ఇస్తే ఎవరికి ఎంత ఇచ్చారు అనే ప్రశ్నలు అడిగి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది. అయితే వీరు సేకరించే సమాచారం, ప్రజాభిప్రాయం నమ్మశక్యమైనవి కావని, అవి ముఖ్యమంత్రినీ, ప్రభుత్వాన్నీ తప్పుదోవ పట్టించేవిగా ఉంటున్నాయనీ కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులే చెవులు కొరుక్కుంటున్నారు. 

ఇటీవల ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గ పర్యటనలో ‘మీ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ మీద సంతృప్తి ఎనభై శాతానికి మించి ఉంది’ అని బహిరంగంగా ప్రకటించేసరికి అక్కడున్నవాళ్ళు అవక్కాయ్యారట. కారణం ఆ నియోజకవర్గంలో అసలు అన్న క్యాంటీనే లేదట. తమ ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ అధికారులు అంటూ వాపోతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఆర్టీజీ నివేదికలు తమను ముంచుతాయని వారు తలలుపట్టుకుంటున్నారు. ఇంత ప్రాథమిక సమాచారం విషయంలోనే పప్పులో కాలేసిన ఆర్టీజీ ఇక ప్రభుత్వాధినేత కీలకమైన ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు కావలసిన విషయాలను ఎలా అందివ్వగలరని వారి ఆందోళన. 

మొత్తానికి ఏపార్టీ కూడా ఎన్నికల వ్యూహ రచనకు కావలసిన సమాచారాన్ని సేకరించుకోడానికి పక్క వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేసుకోలేకపోయాయనే రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

అందరూ తప్పులు చేస్తే, అందరికన్నా తక్కువ తప్పులు చేసినోడిదే గెలుపు కావచ్చు. మరి ఆ తక్కువ తప్పులు చేసినవాడెవడో ఇక త్వరలోనే తేలుతుంది. 


Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle