newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

ఏపీలో బీజేపీ దూకుడు...సంకేతమేమిటి?

12-09-201912-09-2019 12:20:37 IST
2019-09-12T06:50:37.443Z12-09-2019 2019-09-12T06:50:14.918Z - - 27-02-2020

ఏపీలో బీజేపీ దూకుడు...సంకేతమేమిటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘దేశమంతా ఒక ఎత్తు..ఏపీ ఒక్కటీ ఇంకో ఎత్తు’ అన్నట్లుగా రాజకీయం నడుస్తున్నది. ఏపీ అసెంబ్లీలో కేవలం రెండు పార్టీలకు మాత్రమే ప్రాతినిథ్యమున్న నేపథ్యంలో రాజకీయం అంతా ఆ రెండు పార్టీల మధ్యే తిరుగుతుంటుందని ఎవరైనా భావిస్తారు. అందుకు భిన్నంగా అధికార, విపక్ష పార్టీలు రెండింటినీ మించి బీజేపీ దూకుడు ప్రదర్శిస్తున్నది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశమే అయినా...ఏపీలో ఆ పార్టీ దూకుడు చూస్తుంటే...ఈ దూకుడు వెనుక వ్యూహమేమిటన్న అనుమానం రాక మానదు. 

సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పరిస్థితిని గమనించిన వారెవరైనా అప్పటి విపక్షం వైకాపాతో బీజేపీకి ఏదో రహస్య ఒప్పందం ఉందని భావించే పరిస్థితి కనిపించింది. అప్పటి అధికార పార్టీపై విమర్శల విషయంలో వైకాపా, బీజేపీలు పోటీ పడ్డాయి. ముఖ్యంగా అప్పటి అధికార పార్టీపై అవినీతి ఆరోపణలు చేయడంలో ఇరు పార్టీల గళం దాదాపుగా ఒకటిగానే కనిపించింది. అందుకే నాటి సార్వత్రిక ఎన్నికలలో అప్పటి అధికార పార్టీ విపక్షంతోనూ, బీజేపీతోనూ ఒంటరి పోరు చేసిన పరిస్థితి ఏర్పడింది. సరే ఎన్నికలు పూర్తయిన తరువాత వైకాపా రాష్ట్రంలో అధికారం చేపట్టింది. వంద రోజులు పూర్తయ్యే సరికి రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. వైకాపా సర్కార్ నిర్ణయాలను విపక్ష తెలుగుదేశం కంటే అధికంగా, బీజేపీ దూకుడుగా విమర్శిస్తున్నది. 

ఇది చాలదన్నట్లు ప్రభుత్వ నిర్ణయాలపై కేంద్ర మంత్రులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంపై పోలవరం, అమరావతిలో అక్రమాలు, అవినీతి అంటూ విమర్శలు గుప్పించిన బీజేపీ ఇప్పుడు ఆ రెండు ప్రాజెక్టులలో పనులు మందగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. వైకాపా తీరును తప్పుపడుతున్నది. అయితే బీజేపీ ఈ దూకుడు ఏ సంకేతాలను ఇస్తున్నది? ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణం అన్నవి ఆంధ్రుల సెంటిమెంట్ గా మారిపోయాయనడంలో సందేహం లేదు. అందుకే సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపా అధినేత జగన్ స్వయంగా తాము అధికారంలోకి వచ్చినా రాజధానిని తరలించే ప్రసక్తి లేదని ప్రజలకు వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. అలాగే పోలవరం విషయంలో కూడా పోలవరంలో అవకతవకలు వ్యతిరేకిస్తున్నామే కానీ ప్రాజెక్టును కాదని చెప్పిన జగన్...తాము అధికారంలోకి వస్తే పోలవరంను మరింత వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 

అయితే అధికారంలోనికి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. పోలవరం, అమరావతి రెండింటిలోనూ వేగం మందగించింది. మందగించడమేమిటి? పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిణామాలు ప్రజలలో అసంతృప్తికి కారణమయ్యాయి. ఆ అసమ్మతిని తమకు అనుకూలంగా మలచుకోవాలన్న పకడ్బందీ వ్యూహంతోనే బీజేపీ జగన్ సర్కార్ పై దూకుడుగా వ్యవహరిస్తున్నది. గత తెలుగుదేశం ప్రభుత్వంపై కూడా బీజేపీ వ్యవహరించిన తీరు ఇలాగే ఉందన్నది ఇక్కడ ప్రస్తావించడం ఎంత మాత్రం అప్రస్తుతం కాదు. 

అప్పట్లో తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షంగా ఉన్న సమయంలో కూడా వ్యూహాత్మకంగా రాష్ట్ర బీజేపీ నేతలు తెలుగుదేశంపై దూకుడుగా విమర్శలు గుప్పించేవారు. ఆ విమర్శలపై తెలుగుదేశం బీజేపీ అధిష్టానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చిందే తప్ప...ఇక్కడి నేతల విమర్శలకు దీటుగా స్పందించకుండా మిత్రధర్మం పేరిట మౌనం వహించింది. ఆ ఫలితాన్ని...బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తరువాత అనుభవించాల్సి వచ్చింది. మొదటి నుంచీ విమర్శలను పట్టించుకోకుండా మౌనం వహించిన తెలుగుదేశం చివరిలో ప్రతిస్పందించినా పెద్దగా ప్రభావం చూపలేని పరిస్థితి ఏర్పడింది. 

ఇప్పుడు జగన్ సర్కార్ కూడా దాదాపు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నది. కేంద్రం నుంచి ఆర్ధిక సహకారం అందకుంటే రాష్ట్రాన్ని పురోగమ బాటలో పెట్టడం సాధ్యం కాదన్న ఒక కారణంతో బీజేపీ విమర్శలను, కేంద్ర మంత్రుల వ్యాఖ్యలకు గట్టిగా బదులివ్వలేని పరిస్థితిని ఏపీ సర్కార్ ఎదుర్కొంటున్నది. ఇదే అదునుగా బీజేపీ విమర్శలు, ఆరోపణలతో రాష్ట్ర సర్కార్ ను ఉక్కిరి బిక్కిరి చేయడం, అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్న నిజమైన చాంపియన్లం తామేనని ప్రజలకు చెప్పడం బీజేపీ వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. తెలుగుదేశం విషయంలో సక్సెస్ అయిన వ్యూహాన్నే ఇప్పుడు జగన్ సర్కార్ విషయంలోనూ బీజేపీ అనుసరిస్తున్నదని అంటున్నారు.  

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle