newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

అమరావతి మీడియాకు సరైన వార్తల్లేవా?

01-07-201901-07-2019 17:44:57 IST
Updated On 01-07-2019 18:05:18 ISTUpdated On 01-07-20192019-07-01T12:14:57.742Z01-07-2019 2019-07-01T12:14:55.301Z - 2019-07-01T12:35:18.424Z - 01-07-2019

అమరావతి మీడియాకు సరైన వార్తల్లేవా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐదేళ్ళు కంటిమీద కునుకులేకుండా పనిచేసిన అమరావతిలోని ఏపీ మీడియా ప్రతినిధులకు గత నెలరోజులుగా సరైన పనిలేనట్టుంది. జగన్ సీఎం అయ్యాక అధికారులతో సమీక్షలు నిర్వహించినా అవి సాయంత్రానికే ముగిసిపోతున్నాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా అర్థరాత్రిళ్ళు, అపరాత్రిళ్ళు విలేకరులకు కెమేరా మెన్లకు చేతినిండా పని ఉండేది. సీఎంవోలో ఉండే అధికారులు కూడా ముఖ్యంగా పీఆర్వోలు అర్థరాత్రి వరకూ పని చేయాల్సి వచ్చేది. సీఎం ఏం మాట్లాడారో, ఏ అధికారికి ఎలాంటి సూచనలు చేశారో, ఏ శాఖ సమీక్షలు ఎలా జరిగాయో పీఆర్వోలు రాసుకుని, వాటిని టైపింగ్ చేసి ఆయా శాఖల అధికారులకు, పత్రికలకు, ఐఆండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ కు పంపించేవారు. ఇదంతా పూర్తయ్యేటప్పటికీ ఏ అర్థరాత్రో అయ్యేది. అదంతా ఒకప్పటి మాట. 

ఇప్పుడు నెలరోజులుగా అధికారులు అంత బిజీగా లేరు. టెలికాన్ఫరెన్స్ లు, ఆర్టీజీ సమీక్షలు వంటివి మచ్చుకైనా లేవు.  వివిధ శాఖ సమీక్షలు కూడా చాలా కూల్ గా జరిగిపోతున్నాయి. దీంతో వార్తలు లేవు. కేవలం ప్రజావేదిక కూల్చివేత, లింగమనేని ఎస్టేట్ కు నోటీసులు, టీడీపీ ఆఫీసులకు నోటీసులు.. ఇలా టీడీపీ వార్తలు తప్ప అమరావతిలో చెప్పుకోదగ్గ వార్తలు లేవనే చెప్పాలి. అందుకే చంద్రబాబు వార్తలే హైలైట్ అవుతున్నాయి. మొన్న రెండుమూడురోజులు ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ పర్యటనతో అక్కడి యంత్రాంగం అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. ఏపీ వాళ్ళు రాసుకోడానికేం మిగల్లేదు. తెలంగాణ సీఎంవో పీఆర్వోలే అంతా రాసి తలోకాపీ ఇచ్చేశారు. అదంతా అందరికీ తెలిసిందే. భేషజాలు లేవు.. బేసిన్ల గొడవల్లేవంటూ ఒకటే రకమయిన సాహిత్యం అటు తెలంగాణ, ఇటు ఏపీ పత్రికల్లో అచ్చేసుకున్నారు. అంతేకాదు, టీవీ ఛానెల్స్ కూడా అదే సాహిత్యాన్ని తమ వార్తల్లో చొప్పించారు.

సోమవారం ఉదయం ఏ వార్తలు కనిపించలేదు. సీఎం గారి ఇంటిముందు ఓ మహిళ స్పృహ తప్పిన వార్త, తర్వాత ఎంతోకాలంగా తిరుమల కొండపై తిష్టవేసిన టీటీడీ జేఈవో కడప రాజుగారి బదిలీ వార్తలే ప్రధానాంశాలయ్యాయి. ఏ పనిలేనివాడు పిల్లి తల గొరిగాడన్న నానుడి చందాన అమరావతి మీడియాకు వార్తలు కరువయ్యాయి. రుతుపవనాలు ఎలాగూ లేటయ్యాయి... కనీసం రాసుకోడానికి కూడా వార్తలు కరువయ్యాయని తెగ ఇదైపోతున్నారు మీడియా మిత్రులు. అందుకే దొరికిన రెండు వార్తలనే హైలైట్ చేస్తున్నారు. జేఈవో శ్రీనివాసరాజు బదిలీ వెనుక కథలు, ఆయన్ని ఇన్నాళ్ళూ కాపాడిన పెద్దాయన ఎవరు అనేది ఇప్పుడు హైలైట్ అవుతోంది. విలేకరులు సెక్రటేరియట్, విజయవాడ వీధుల్లో ధూమపానం (ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా మీడియా వారు పట్టించుకోరు) చేస్తూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. 

చంద్రబాబు ఉండే ఇల్లు కూల్చేస్తున్నారు కదా... చంద్రబాబు మట్టిగోడల ఇంట్లో ఉంటారట, పుట్టగుంట వారి ఇల్లు వెతికారట అని చంద్రబాబు ఇంటి అన్వేషణ గురించి పుంఖానుపుంఖాలుగా వార్తలు రాస్తున్నారు.  అంతేకాదు బీజేపీ ఆఫీసులోకి ఎవరైనా అపరిచిత వ్యక్తి ఎంటరైతే.. టీడీపీ నుంచి బీజేపీలోకి భారీ వలసలు అంటూ వార్తలు చెక్కేస్తున్నారు. ఇక ఛానెల్ గొట్టాలు అయితే మూగబోతున్నాయి. చంద్రబాబు హయాంలో క్షణం తీరిక లేకుండా గడిపిన వారు ఇప్పుడు చేతికి, పెన్నుకి పనిలేక అటూ ఇటూ తెగ తిరిగేస్తున్నారు.

చంద్రబాబుని కదుపుదామంటే.. ఆయన ఉలకడం లేదు పలకడం లేదు. మే 23 నాటి ఎన్నికల వడదెబ్బ నుంచి ఆయన కోలుకున్నట్టు లేడు. అదీ కాకుండా నలుగురు రాజ్యసభ ఎంపీల ఫిరాయింపు తాళింపు ఆయన ముక్కుపుటాలను తాకుతూనే ఉంది. మంత్రి పదవులు రాని వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద అమరావతిలో మీడియాకు సరైన పనిలేదు. ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ దొరికితే గానీ వీరి కడుపుమంట (జర్నలిస్టిక్ అల్సర్) చల్లారదు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle