newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

అతను వస్తాడా... అసలు రాడా?

05-03-201905-03-2019 18:11:49 IST
Updated On 06-03-2019 12:27:59 ISTUpdated On 06-03-20192019-03-05T12:41:49.754Z05-03-2019 2019-03-05T12:03:12.881Z - 2019-03-06T06:57:59.121Z - 06-03-2019

అతను వస్తాడా... అసలు రాడా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ ప్రశ్నలతోనే తెగ ఉక్కిరిబిక్కిరైన జూనియర్ ఫ్యాన్స్ ఇక ఆ ఊసెత్తడమే మానుకున్నారు. రాజకీయాలకు ఇంకా టైం వుంది . .అది 2019 లో మాత్రం కాదు. ఇదీ వాళ్లకు పైనుంచి నుంచే వచ్చిన క్లారిటీ ! కానీ ఇప్పుడు తెలుగు దేశానికి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే.. మచ్చా నాగేశ్వరావు...  ఈవ్యక్తి అకస్మాత్తుగా తెరమీదకొచ్చి.. ' ఇంకో రెండేళ్లలో జూనియర్ రాజకీయ ఆరంగేట్రం గ్యారెంటీ' అంటూ ఇచ్చుకున్న స్టేట్మెంట్ జూనియర్ ఎన్టీఆర్ అనబడే తారక్  మీద ఆశలు పెట్టుకున్న ఫాన్స్‌కు సరికొత్త ఆలోచనలు  పుట్టించకమానవు.  ఇందుకు అసలు కారణం ఉండనే ఉంది. ఒకప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టి మామయ్య చంద్రబాబుకు అండగా నిలబడ్డ బుడ్డోడు అడ్డం తిరిగి వెనక్కి వెళ్ళాడెందుకు? నాన్న హరికృష్ణ వద్దనడమే కారణమన్నది ఆనాడు చెప్పుకున్నమాట.

2008లో ఎన్నికలకు తన తాత ఎన్టీఆర్ మార్క్ ఖాకీ చొక్కా తగిలించుకుని అచ్చం ఆయనలానే  రథమెక్కి రాజకీయ హంగామా చేసేసాడు తారక్.  తరువాత తిరుగుప్రయాణంలో జరిగిన ఒక యాక్సిడెంట్‌తో  జూనియర్ కెరీర్ కు తాత్కాలిక బ్రేక్ పడింది.. ఆ తరువాత ఒకనాటి మహానాడులో వేదిక నెక్కి మామయ్యకు అండగా నిలబడాలంటూ చేసుకున్న విజ్ఞప్తి.. ఇంకా గుర్తుంది. కానీ ఆనాటి ఆ  మహానాడు ప్రాంగణంలో కనిపించిన పెద్దపెద్ద కటౌట్లలో ఎక్కడా జూనియర్  బొమ్మే లేదు. సరిగ్గా అదే  హరికృష్ణ మనస్తాపానికి అసలు కారణమని చెపుతారు. లోకేష్ బొమ్మల మధ్య ఎక్కడా తన కొడుక్కి ప్లేస్ లేకపోవడం పాపం హరికృష్ణ ఆగ్రహానికి కారణం.  ఆ మాటకొస్తే జూనియర్ కు ఎన్టీఆర్ కుటుంబంలో ఎప్పుడూ సముచిత స్థానం దక్కలేదన్న నిజం కూడా ఆ కుటుంబానికి సన్నిహితులన్న వాళ్లకు తెలుసు. అప్పుడప్పుడూ బాలయ్యతో సినిమా వేదికల మీద నిలబడ్డా..  అటువంటి చిన్నచిన్న వాటికి  సంతృప్తి పడిపోయే రకంకాదు జూనియర్. 

ఇక అప్పటికే  లోకేష్ తెలుగుదేశం పార్టీకి వారసుడన్న మాట అనధికారికంగా ఎప్పుడో కమ్యూనికేట్ అయిపోయింది. మరి తన స్థానం ఏమిటి? తన తాత ,తన తండ్రి ఆ పార్టీకి ఏమీ కారా? వాళ్ళ కాంట్రిబ్యూషన్ల మాటేంటి ? రాజకీయాల్లో వారసత్వాలే రాజ్యాలేలుతున్న ఈ రోజుల్లో తనను కావాలనే దూరం పెట్టారన్న అభిప్రాయం జూనియర్‌కు కలిగిందా? ఆ తరువాత జరిగిన ఒకట్రెండు సంఘటనలు, సందర్భాలు కూడా అందుకు సాక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. కానీ జూనియర్ తండ్రి హరికృష్ణ కొడుకును దూరంగా ఉండాలంటూ ఆదేశించారా? 

కొంతకాలానికి చంద్రబాబుకు మేనల్లుడి వరసయ్యే నార్నె శ్రీనివాస రావుకు ఎన్టీఆర్‌తో పెళ్లి సంబంధం కలుపుకునే అవకాశం వచ్చింది. చర్చలు గోప్యంగా జరిగాయి. ముఖ్యంగా చంద్రబాబుకు ఈ విషయం తెలియకుండా అందరూ జాగ్రత్త పడ్డారు. అసలు చంద్రబాబుకు తారక్‌తో ఎటువంటి సంబంధం కలుపుకోవడం ఇష్టం లేదన్నది నార్నె కుటుంబీకులు చెప్పే మాట. అందుకే  అన్నీ లాంఛనాలు పూర్తయిన తరువాత శ్రీనివాస రావే స్వయంగా వెళ్లి బాబుతో ఈ విషయం చెప్పినపుడు బాబు షాక్ తిన్నారు. సరే.. ఆ తరువాత అన్నీ తనకు తెలిసే.. తన  ఆధ్వర్యంలోనే వ్యవహారాలన్నీ జరిగిపోయినట్లు బిల్డప్ ఇచ్చారు బాబు. 

కారణాలు ఏవైనా.. నార్నె ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక న్యూస్ ఛానల్ లోకేష్ చేతుల్లోకి వెళ్ళింది. నష్టాల్లో నడుస్తున్న ఆ ఛానల్‌కు లోకేష్ మిత్రుడు అభీష్ట సారధ్యం వహించాడు. అయినా అది కోలుకోలేదు. రకరకాల ప్రయోగాలు చేసి ఆ తరువాత లోకేష్ ఎండ్ కో చేతులు దులిపేసుకుని  ఛానల్ బయటకొచ్చింది. ఆదుకోవడానికి  ఒక దశలో జూనియర్ తన చేయి వేస్తాడని అనుకున్నారు కానీ అటువంటిదేమీ జరగలేదు. అతను తన సినిమాల గొడవలో మునిగిపోయాడు. లోకేష్ ఫుల్ టైం రాజకీయాల్లోకి దిగిపోయాడు...తరువాత ఎమ్మెల్సీ ..ఆ వెంటనే మంత్రిపదవి వరించేశాయి. . నిజానికి లోకేష్ అంత తొందరగా తన చెప్పుల్లో కాళ్ళు పెట్టడం బాబుకూ ఇష్టం లేదనే చెప్పాలి. కానీ కుటుంబ వత్తిళ్లు మేరకే ఆ పనిచేయవలసి వచ్చిందనేది ఒక విశ్వసనీయ సమాచారం. అది వేరే విషయం !

ఇక్కడ విషయం జూనియర్ ఎన్టీఆర్ అనే తారక్ ది కాబట్టి చంద్రబాబు కుటుంబ నేపధ్యం చెప్పుకోవాల్సి వచ్చింది. లోకేష్-తారక్ ల మధ్య సాపత్యాలు అనవసరం. తారక్ మంచి నటుడే కాదు..కూచిపూడి సుశిక్షితుడు. పైగా  స్పష్టమైన ఉచ్చారణతో అనర్గళంగా మాట్లాడి అశేష జనాల్ని మెప్పించగలిగే అద్భుతమైన శక్తియుక్తులు అతడి సొంతం. 34-35 ఏళ్ళ వయసు. ఇంకా రాజకీయాల్లో ఎదగడానికి కావలసినంత సమయం అతనికి ఉంది. తెలుగు దేశం పార్టీ పగ్గాల్ని చేపట్టడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే అక్కడ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. తనకు తానే పార్టీ రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా దూరం జరిగిన తారక్ మొన్నే మధ్య తెలంగాణాలో తన సోదరిని కూకట్ పల్లి నియోజకవర్గంలో నిలబెట్టినపుడు కూడా ప్రచారానికి దూరంగానే నిలబడ్డాడు. అసలు కారణం చంద్రబాబు మాటవరసకైనా జూనియర్ని పిలవలేదు. 

ఒక వేళ ఆమె గెలిస్తే ఆ క్రెడిట్ జూనియర్‌కే  దక్కుతుంది. అది బాబుకు ఇష్టం లేదు. అది  ఆలోచన. నేనే వాళ్ళిద్దర్నీ దూరంగా ఉండమన్నాను అంటూ బాలకృష్ణ చెప్పిన మాటల్లో అసలు అంతరార్ధం సరిగ్గా ఇదే !. ఏదైతేనేం..  జూనియర్, కళ్యాణ్ రాంలిద్దరూ ఎన్నికలకు దూరం నిలబడ్డారు. ఒక రకంగా అలా దూరం నిలబడడం మంచిదే అయిందని అతని సన్నిహితులు సంతోషపడ్డారు కూడా ! అయితే జూనియర్ మాత్రం ఎక్కడా  ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కొత్త అర్ధాలకు దారి తీసింది.  ఆయన మనసులో ఇంకేదో ఉండబట్టే అలా జరిగిందంటూ సోషల్ మీడియా సాక్షిగా అభిమానులు ప్రశ్నలు లేవనెత్తారు.

ఈ మధ్య ఇంకో  మాట కూడా బయటకొచ్చింది. " తెలుగు దేశం మా తాత పెట్టిన పార్టీ... ఎప్పటికైనా ఆ జెండా నేను పట్టుకుంటాను." అంటూ తన  సన్నిహితులదగ్గర జూనియర్ అన్నాడన్న మాటే అది. వాటిల్లో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ఇప్పడు మళ్ళీ దాదాపుగా అదే మాట తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే నోటి నుంచి జారిపడింది. ఇంకో రెండేళ్లంటే 2021. నాలుగేళ్ల ముందు నుంచే తన రాజకీయ పావుల్ని కదిపే ప్రయత్నానికి జూనియర్ ఆలోచనలు చేస్తున్నాడా ? అనుమానమే లేదంటూ అతని సన్నిహితులు ఘటాపధంగా చెప్తున్న మాట ! 

చివరిగా చిన్న ముచ్చట ! 2019 ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న తెలుగుదేశం- వైస్సార్సీపీల్లో ఏదో ఒక్కటే నిలబడుతుంది. ఈసారి చంద్రబాబు ఓటమిపాలైతే అక్కడ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు కష్టం. డెబ్భైల్లోకి చేరిపోయే చంద్రబాబుకు ఖచ్చితంగా వయసు పెట్టే పరిమితులు ఉంటాయి. లోకేష్ పగ్గాలపైన పార్టీలోనే లెక్కలేనన్ని  ప్రశ్నలు. ఇక జగన్ ఓటమి పాలైతే కూడా అతని పార్టీ మనుగడ కష్టం. రెండుసార్లు అవకాశం ఇచ్చినా నిలదొక్కుకోలేని వ్యక్తిని జనం మూడోసారి నెత్తిన పెట్టుకోవడం కష్టం. ఈ నేపథ్యంలో ఒక కొత్త శక్తీ... కొత్త యుక్తీ ఉన్న నాయకుడికి కచ్చితంగా అక్కడ స్థానం ఉంది. ఆ స్థానాన్ని జూనియర్ భర్తీ  చేయగలడా?  అసలటువంటి ఆలోచనే  అతనికి కనుక వుంటే అవకాశమనే అదృష్టం అతనికి తలుపులు తెరవొచ్చు..! 

ఇంతకీ అతను వస్తాడా... అసలు రానేరాడా .. ముందు ఆ మాట తేల్చుకోనివ్వండి .. !


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle