newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

తాలిబన్లతో ట్రంప్‌ భేటీ రద్దు వ్యూహాత్మకమా?

11-09-201911-09-2019 13:54:31 IST
Updated On 11-09-2019 15:04:37 ISTUpdated On 11-09-20192019-09-11T08:24:31.848Z11-09-2019 2019-09-11T08:24:24.092Z - 2019-09-11T09:34:37.641Z - 11-09-2019

తాలిబన్లతో ట్రంప్‌ భేటీ రద్దు వ్యూహాత్మకమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తాలిబన్లలో రహస్య భేటీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రద్దు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారింది.. గత రెండు రోజులుగా ఈ అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అసలు తాలిబన్లతో అర్థాంతరంగా భేటీ రద్దుచేస్తూ ట్రంప్‌ ప్రకటించడం వ్యూహాత్మకమా..? లేక తొందరపాటు నిర్ణయమా..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ట్రంప్‌ అసలు ఈ చర్చలెందుకు రద్దుచేశాడు.. దీనివల్ల భారత్‌కు ఎంత నష్టం అనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్లతో శాంతి ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గత శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కటిగా వరుస ట్వీట్లు చేసిన ట్రంప్‌ 'తను ఆదివారం క్యాంప్‌ డేవిడ్‌లో తాలిబాన్‌ నేతలు,ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడితో ఒక రహస్య సమావేశంలో పాల్గొనాల్సి ఉందని, కానీ ఇప్పుడు దాన్ని రద్దు చేసుకుంటున్నానని చెప్పారు. ఆయన అందులో రద్దు కారణాన్ని వివరించారు. కాబూల్‌లో జరిగిన కారు బాంబు పేలుడు తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రంప్‌ తెలిపారు. 

ఆ ప్రమాదంలో ఒక అమెరికా సైనికుడు సహా 12 మంది చనిపోయారు. ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబాన్లు ప్రకటించారని ట్రంప్‌ తెలిపారు. 

ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా ప్రత్యేక రాయబారి జల్మే ఖలీల్‌జాద్‌ గత సోమవారం తాలిబాన్లతో 'సిద్ధాంతపరంగా' ఒక శాంతి ఒప్పందం జరగబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు చెబుతున్న ఈ ఒప్పందం ప్రకారం అమెరికా ఆ తర్వాత 20వారాల్లోపు ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి తమ 5400 సైనికులను వెనక్కు పిలిపించాలి. అయితే ఈ ఒప్పందంపై అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది అధ్యక్షుడు ట్రంపే అని అమెరికా రాయబారి చెప్పారు. 

తాలిబన్లతో చర్చలు జరుపుతున్నప్పటికీ, ఆఫ్ఘనిస్థాన్‌లో గత కొన్నిరోజులుగా జరుగుతున్న హింస ఆగడం లేదని గురువారం కారు బాంబు పేలుడు తర్వాత అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తాలిబన్లతో చర్చలు జరిపి ఉపయోగం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ట్రంప్‌ గత అమెరికన్‌ మాజీ అధ్యక్షులపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షులు అమెరికాను పెద్ద యుద్ధంలోకి నెట్టే నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయంతో తాలిబన్లు భగ్గుమన్నారు. 

ఆఫ్ఘనిస్థాన్‌తో శాంతి చర్చలను రద్దుచేస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు. తమతో శాంతి చర్చలను రద్దు చేసుకుంటే అమెరికాకు ముప్పుతప్పదని హెచ్చరికలుసైతం జారీ చేశారు. దీనివల్ల ఎక్కువ మంది అమెరికన్లు ప్రాణాలు కల్పోతారని హెచ్చరించారు. మేరీల్యాండ్‌ రాష్ట్రంలోని కొండలలోని క్యాంప్‌ డేవి డ్‌ దగ్గర తాలిబాన్‌ ప్రధాన నాయకులతో జరగాల్సిన ముఖాముఖీ రహస్య చర్చలను డొనాల్డ్‌ ట్రంప్‌ ఊహించని విధంగా రద్దు చేసిన కొన్ని గంటల్లోనే ఇస్లామిస్ట్‌ గ్రూప్‌ ఈ ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి నెలకొల్పే లక్ష్యంతో అమెరికా, తాలిబన్‌ల మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న ప్రయత్నాలకు విఘాతం ఏర్పడినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వం మాత్రం అమెరికా నిర్ణయాన్ని స్వాగతించింది దీనిని సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయంగా ప్రకటించింది.

అసలు గొడవేంటి..?

సెప్టెంబర్‌ 11, 2001 తేదీన న్యూయార్క్‌ నగరంలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌కి చెందిన జంట టవర్ల పైన దాడిచేసింది ఒసామా బిన్‌ లాడెన్ నేతృత్వంలోని ఆల్‌-ఖైదాయేనని దాడి జరిగిన కొద్దిగంటల్లోనే అమెరికా ప్రకటించింది. ఒసామా బిన్‌ లాడెన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో దాక్కున్నాడని, ఆయనను తాలిబాన్‌ ప్రభుత్వం కాపాడుతోందని ప్రపంచానికి చెప్పింది. లాడెన్‌ని అప్పగించారా సరేసరి, లేదా దాడిచేస్తామని అప్పటి అమెరికన్‌ అధ్యక్షుడు జార్జిబుష్‌ తాలిబాన్‌ని హెచ్చరించాడు. 

లాడెనే దాడి చేయించాడని ఒక్క సాక్ష్యం చూపండి అప్పగిస్తాం అని తాలిబాన్‌ బదులిచ్చింది. కానీ అమెరికా దగ్గర ఆ సాక్ష్యం లేదు. ఇప్పటికీ కూడా సాక్ష్యం చూపలేకపోయింది. సాక్ష్యం ఇవ్వకుండా యుద్ధానికి సన్నాహాలు ప్రారంభించింది అమెరికా. మాకు మద్దతు ఇవ్వండి లేదా తాలిబాన్‌కి మద్దతు ఇచ్చినట్లే అని జార్జిబుష్‌ ప్రపంచాన్ని హెచ్చరించాడు. తద్వారా తటస్థత అనేదే లేకుండా చేశాడు. అనంతరం మన్నూ, మిన్నూ ఏకంచేస్తూ అమెరికా, ఐరోపా రాజ్యాల సూపర్‌ సోనిక్‌లోహ విహంగాలు, ట్యాంకర్లు, ఫైటర్‌ జెట్లు, కార్పెబ్‌ బాంబింగ్‌లు , విమాన కేరియర్‌ నౌకలు, సీ-13 విమాన కేరియర్లు ఇత్యాది లోహ రాకాసులు ఆఫ్ఘనిస్థాన్‌ని మరోసారి మరుభూమిగా మార్చేశాయి. 

అప్పటి నుండి ఇప్పటి వరకు లక్షల మంది అమాయక ఆఫ్ఘన్లు కనీసం చనిపోయారన్న గుర్తింపునకు కూడా నోచుకోకుండా అదృశ్యమైపోయారు. ఇదంతా తాలిబాన్‌లు ఒసామా బిన్‌లాడెన్‌ను దాచిపెట్టినందుకే నంటూ అమెరికా ప్రకటించింది. దీనికితోడు ఆఫ్ఘనిస్థాన్‌ రాజధానిలో అమెరికా రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసి స్థానిక ప్రభుత్వంకు సహకరిస్తూ పాలన సాగిస్తుంది. ఈ సమయంలో తాలిబన్లు అమెరికాను చర్చలకు రావాలని కోరారు. కానీ అప్పుడు అమెరికా తాలిబన్లను ఊచకోతకోసే ఉద్దేశంలోనే ఉండిపోయింది. అప్పటి నుండి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్లపై అడపాదడపా అమెరికా దాడులు చేస్తూ వారిని ఏరివేసే పనిలో పడిపోయింది. తాలిబన్లుసైతం ఎదురుదాడులకు పాల్పడుతూనే ఉన్నారు.

భారత్‌కు లాభమా..? నష్టమా..?

చర్చలు జరపకపోవటం ద్వారా భారత్‌కు లాభమని పలువురు పేర్కొంటుండగా.. నష్టమని పలువురు భావిస్తున్నారు. అయితే భారత్‌కు ఎంతలాభం చేకూరుతుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. అయితే తాలిబాన్లు కనుక ఆఫ్ఘనిస్తాన్‌లో రాజీకి వస్తే ఖచ్చితంగా అది భారత్‌కు సవాల్‌గా మారే అవకాశాలున్నాయి. దీనికి కారణం ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉన్న తీవ్రవాదం అక్కడ పనైపోతే మళ్ళీ కశ్మీర్‌వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు ఓ కాంట్రాక్టర్‌ ఓ వద్ద పని ఒప్పుకొని అక్కడ పూర్తిచేసుకున్న తరువాత మరోచోటకు వచ్చినట్లు.. అదే ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల వశమైతే .. అక్కడ నుండి వీరు కాశ్మీర్‌వైపు దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి. 

అదే జరిగితే భారత్‌కు ఈ అంశం పెద్ద సవాల్‌గా మారుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు భారత్‌ కోరుకోవాల్సింది.. ఆఫ్ఘన్‌లో శాంతి నెలకొనాలంటే ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న అన్ని గ్రూపులతో చర్చలు జరపాలి. ఒక్క తాలిబాన్‌ కాదు. అలాగే ఆఫనిస్థాన్ ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఈ చర్చలు జరపకూడదు. ప్రస్తుతం ఆఫ్ఘన్‌ ప్రమేయం లేకుండా నేరుగా తాలిబన్లతో అమెరికా చర్చలు జరుపుతుంది. ప్రస్తుతానికి చర్చలు వాయిదా వేసినా ట్రంప్‌ ఎప్పుడు ఏవిధంగా వ్యవహరిస్తాడో అతనికే తెలియని పరిస్థితిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా పరిణామాలతో భారత్‌ పెద్దగా సంతోషపడాల్సిన పనిలేదని.. రాబోయే కాలంలో ట్రంప్‌ తీసుకొనే నిర్ణయాలను బట్టి భారత్‌కు నష్టమా..? లాభమా అనేది స్పష్టత వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle